రగిలిన జ్వాల

రగిలిన జ్వాల - Sakshi


శ్రీకాకుళం: రుణమాఫీలో పరిమితులను వ్యతిరేకిస్తూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పూర్తిస్థాయి రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ‘నరకాసుర వధ’ పిలుపునకు జిల్లా రైతుల నుంచి అనూహ్య స్పందన లభించింది. పార్టీ శ్రేణులు, రైతులు కలిసి గ్రామస్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకు కదం తొక్కారు. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. ఎక్కడికక్కడ చంద్రబాబ దిష్టిబొమ్మలను దహనం చేసి, మానవహారాలు, ధర్నాలు చేసి పూర్తిస్థాయి రుణమాఫీకి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ముందుముందు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తొలి రెండు రోజుల మాదిరిగానే మూడో రోజైన శనివారం కూడా జిల్లావ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. మాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దగాకు నిరసనగా శనివారం డ్వాక్రా మహిళలు కూడా నిరసన కార్యక్రమాల్లో భాగస్వామ్యులయ్యారు.

 

 తెలుగుదేశం నాయకులు తమను నమ్మించి మోసం చేశారని ధ్వజమెత్తారు. వీరికి రైతులు తోడై పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుంటే తగిన సమయంలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో నరసన్నపేటలో పార్టీ జిల్లా నాయకులతో పెద్ద ఎత్తన నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటిలో సమన్వయకర్త నర్తు రామారావు, ఎస్‌ఎస్ శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిల నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. ధర్నా నిర్వహించి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. పలాస, టెక్కలి నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు వజ్జ బాబూరావు, ఎంపీపీ కొయ్య శ్రీనివాసరెడ్డి, దువ్వాడ శ్రీనులు ఆర్డీవోకు వినతిపత్రాలు సమర్పించారు. ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు, ఆమదాలవలసవలసల్లో పార్టీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.

 

 రాజాం నియోజకవర్గం సంతకవిటిలో ఎమ్మెల్యే కంబాల జోగులు నేతృత్వంలో మానవహారం నిర్వహించి ఆందోళనలు చేశారు. పాతపట్నం నియోజకవర్గం ఎల్‌ఎన్‌పేట, హిరమండలంలలో శివ్వాల కిషోర్, ఏవీ రమేష్, లోలుగు లక్ష్మణరావు, కొమరాపు తిరుపతిరావుల నేతృత్వంలో ధర్నాలు నిర్వహించారు. పాలకొండ నియోజకవర్గం భామిని, వీరఘట్టంలలో ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పాలక రాజబాబు, ఎంపీపీ సవర లక్ష్మీలు కూడా పాల్గొన్నారు. నరసన్నపేట నియోజకవర్గంలోని పోలాకి, నరసన్నపేటలలో భారీ మానవహారం, ధర్నా చేసి చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌తో పాటు పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి, టెక్కలి సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

 బీమా సొమ్ము లాక్కున్నారు

 రుణమాఫీ అమల్లోకి వచ్చేసిందంటూ టీడీపీ సంబరాలు చేసుకుంది. నేతలు చంద్రబాబును అభినందించడానికి పోటీలు పడ్డారు. కానీ ఇక్కడ జరుతున్నది వేరు. బ్యాంకులు తమ పని తాము చేసేస్తున్నాయి. రుణాలు కట్టాలని నోటీసులు ఇస్తున్నాయి. బంగారు, ఇతర ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరిస్తున్నాయి. చివరికి నా పొదుపు ఖాతాలో జమ అయిన ఎల్‌ఐసీ పాలసీ సొమ్ము రూ.28వేలు కూడా.. నాకు చెప్పకుండానే రుణ బకాయి కింద లాగేసుకున్నారు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి.. నా సొమ్ముకు ఎవరు భరోసా ఇస్తారు?

 -ధర్మాన బాలరాజు,

 పెద్దలోగిడి, పాతపట్నం మండలం

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top