ఇదేం ‘పచ్చ’పాతం

ఇదేం ‘పచ్చ’పాతం - Sakshi


 పొందూరు: తుపాను బాధితులకు పరిహారం పంపిణీలో పక్షపాతం చూపుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బాధిత గ్రామాల ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం మద్దతుతో సోమవారం తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎంపీపీ సువ్వారి దివ్య, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లతో కలిసి బాధితులు తొలుత తహశీల్దారు కార్యాలయానికి చేరుకున్నారు. ముంపు గ్రామాలకు ప్రభుత్వం పంపించిన సాయాన్ని తహశీల్దార్ డీలర్లకు పంపకుండా వేరే వ్యక్తులకు పంపించారని వారు ఆరోపించారు. సరుకులు పచ్చచొక్కా కార్యకర్తలకే అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం తహశీల్దార్‌తో మాట్లాడేందుకు కార్యాలయానికి రాగా ఆయన చాంబర్ తాళం వేసి ఉండటంతో సిబ్బందిని పిలిచి ప్రశ్నించారు. కలెక్టరేట్‌లో సమావేశానికి వెళ్లారని సిబ్బంది బదులివ్వగా,  వెంటనే కలెక్టర్, జేసీ, ఆర్‌డిఓలకు తమ్మినేని ఫోన్ చేసి పొందూరులో సరుకుల పంపిణీలో అక్రమాలను వివరించారు. ఇంతలో సీఎస్‌డీటీ ప్రసాదరావు, ఎంఎల్‌ఎస్ పాయింట్ గోడౌన్ ఇన్‌చార్జి హరిశంకర్ వచ్చి కలిశారు. బియ్యం తదితర సరుకులకు సంబంధించి ఆర్‌ఓలు డీలర్ల పేరు మీద రాయకుండా గ్రామాల పేరుమీద రాయడం ఏంటని తమ్మినేని వారిని ప్రశ్నించారు. వాస్తవానికి ఎఫ్‌సీ షాపుల డీలర్లకే అందించాల్సి ఉండగా తహశీల్దార్ ఆదేశాల మేరకు వేరే వ్యక్తుల ఇళ్ల వద్దకే పంపించామని సీఎస్‌డీటీ, ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జిలు స్పష్టం చేశారు. ఈ మేరకు రాతపూర్వకంగా రాసి ఇచ్చారు.

 

 బుక్కేస్తున్నారు...

 అనంతరం విలేక రులతో తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. మండలంలో టన్నుల కొద్దీ బియ్యం పచ్చచొక్కాల ఇళ్ల వద్దకు చేరడంతో బుక్కేయడానికే సిద్ధమయ్యారని విమర్శించారు. ఇందుకు నిదర్శనంగా తోలాపిలో మాజీ సర్పంచ్ ఇంటి వద్దనే సరుకులు పంపిణీ చేస్తున్న ఫొటోను చూపించారు.  నిరుపేదలకు అన్యాయం జరిగితే  ఊరుకునేది లేదని హెచ్చరించారు. తుపాను ప్రభావంతో పంటలను నష్ట పోయిన రైతులు, కూలీలకు బాసటగా నిలిచేందుకు ప్రభుత్వం సదుద్దేశంతో సరుకులు పంపిణీ చేయమంటే అధికారులు చేతివాటం చూపిస్తున్నారని మండి పడ్డారు.

 

 తెలుపు, ఎరుపు రంగు రేషన్ కార్డులు కలిగి పనులు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సాయం అందించాలని డిమాండ్ చేశారు. జిల్లా యంత్రాంగం స్పందించి తహశీల్దార్, సీఎస్‌డీటీ, గోడౌన్ ఇన్‌చార్జి, రూట్ ఆఫీసర్లను సస్పెండ్ చేయాలని, లేదంటే  పచ్చచొక్కాల ఇళ్ల వద్దకు చేరిన సరుకును రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తమ్మినేని వెంకటరామినాయుడు, మొదలవలస రామస్వామినాయుడు, సువ్వారి గాంధీ, సీపాన శ్రీరంగనాయకులు, బి.ఎల్. నాయుడు, కోరుకొండ సాయి, పోతురాజు సూర్యారావు, గురుగుబెల్లి మధుసూదనరావు, పప్పల అప్పలనాయుడు, అన్నాజీలతో పాటు సర్పంచులు, ఎంపీటీసీలు, ముంపు బాధితులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top