ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ సీపీకి 167 సీట్లు

ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ సీపీకి 167 సీట్లు - Sakshi


శ్రీకాకుళం : ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజలు 167 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని ఆపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రజల్లోకి వెళ్లి ఓటు వేస్తారా అని అడగగలరా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.  శుక్రవారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు గ్రాఫ్ ఇంత తొందరగా పడిపోతుందని అనుకోలేదన్నారు. మామూలుగా ప్రజా వ్యతిరేకత రావటానికి ఏ ప్రభుత్వానికి అయినా రెండేళ్లు పడుతుందని, అయితే చంద్రబాబుకు మాత్రం ప్రజా వ్యతిరేకతకు నెలరోజుల సమయం కూడా పట్టలేదన్నారు.



చంద్రబాబు దారుణంగా అబద్ధాలాడుతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. ఎర్రచందనం అక్రమ నిల్వల విషయంలో ముఖ్యమంత్రి, మంత్రి చెరోమాట మాట్లాడుతున్నారని అన్నారు. ఎర్ర చందనాన్ని అమ్మి రుణమాఫీ చేస్తామంటున్నారని, 8వేల టన్నుల ఎర్రచందనం ఉందని, నాలుగు వేల టన్నులు వేలం వేస్తే టన్నుకు రై.10 లక్షల చొప్పున వస్తుందని ఓవైపు అటవీశాఖ మంత్రి చెబితే, మరోవైపు చంద్రబాబు  మాత్రం 15వేల టన్నులని చెబుతున్నారన్నారు. అలా అయినా వచ్చే రూ.1500 కోట్లతో ఎలా రుణమాఫీ చేస్తారని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు.



ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు అసలు మనిషేనా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో హామీలిచ్చి ఇప్పుడు మాత్రం అమలుకు కష్టంగా ఉందంటున్నారని చెప్పటం శోచనీయమని వైఎస్ జగన్  అన్నారు. పార్లమెంట్లో ఓటేయించి రాష్ట్రాన్ని విడగొట్టించిన చంద్రబాబు రెండు రాష్ట్రాలకు రెండు మేనిఫెస్టోలు విడుదల చేసి రుణమాఫీ చేస్తానన్నారని గుర్తు చేశారు.  పిక్‌పాకెట్ చేస్తేనో, దొంగతనం చేస్తేనో 420 కేసు పెడతారని, మరి ప్రజల్ని మోసం చేసి సీఎం అయిన చంద్రబాబుపై..

420 కేసు పెట్టాలా.. 840 కేసు పెట్టాలా? అని అడుగుతున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు.



ఏప్రిల్ 11న ఎన్నికల కమిషన్కు లేఖ రాసిన బాబు రాష్ట్రంలోని వనరులపై తనకు అవగాహన ఉందని, రుణమాఫీ అమలు చేస్తానన్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆ తర్వాత 40, 50 సమావేశాల్లోనూ తనకు చాలా అనుభవం ఉందని, ప్రపంచానికే పాఠాలు చెప్పానని చాలా మాటలు చెప్పారని, రుణాలు కట్టవద్దని ఆయన మనుషులు ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికి వెళ్లి చెప్పారన్నారు. రుణమాఫీ కష్టమని తెలిసినా అంతా తెలిసే ఉద్దేశ్యపూర్వకంగానే చేశారని జగన్ వ్యాఖ్యానించారు. అలాంటి బాబుపై 420 కేసు పెట్టాలో, 840 కేసు పెట్టాలో ఆయన మనస్సాక్షినే అడగాలన్నారు.



ఇంటికో ఉద్యోగమన్న చంద్రబాబు... ఉద్యోగం లేనివారికి నెలకు రెండువేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని వైఎస్ జగన్ అన్నారు. ఆ హామీలు అమలు చేయాలని నిరుద్యోగులు అడుగుతుంటే... ఇప్పుడు జాబంటే ప్రభుత్వ ఉద్యోగమనలేదని మాట తప్పుతున్నారన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో హైదరాబాద్లోని ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వారిని ఆదుకునే వారే కనిపించడం లేదన్నారు.



మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై తాను గర్వపడుతున్నానని, ఇచ్చే భావన, మంచి ఆలోచన లేనప్పుడు పథకాలు ఎత్తివేసే కార్యక్రమంలోనే భాగంగా ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top