ఆగ్రహ జ్వాల

ఆగ్రహ జ్వాల - Sakshi


రైతు, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో ఆందోళన కొనసాగింది. ఆంక్షల పేరుతో ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. పోలీసు నిర్బంధం మధ్యనే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.

 

 సాక్షి, కడప: రైతు, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. అన్ని నియోజకవ ర్గాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. రైల్వేకోడూరు మండలం ఉప్పరపల్లె గ్రామం వద్ద జాతీయ రహదారిపై వైఎస్సార్‌సీపీ నాయకుడు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బాబు దిష్టిబొమ్మను దహనంచేశారు.

 

 పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పెద్దకూడాలలో ఎంపీపీ, మండల కన్వీనర్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేయగా పులివెందులలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కౌన్సిలర్లు తహశీల్దారుకు వినతిపత్రం సమర్పించారు. ఖాజీపేట మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీ నాయకులు వాసు, గంగాధర్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డిల ఆధ్వర్యంలో బాబు దిష్టిబొమ్మను దహనం చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కమలాపురంలో మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి, జిల్లా రైతు కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డిల ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయం వద్ద బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.

 

 ప్రొద్దుటూరు మండల పరిధిలోని సోములవారిపల్లె, రాజుపాలెం మండలంలోని తొండలదిన్నెలో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసన తెలిపారు.

 

 కడపలో ఎమ్మెల్యే అంజద్ అరెస్టు.. విడుదల : బాబు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం కడపలో ఎమ్మెల్యే అంజద్‌బాష ఆధ్వర్యంలో ఏడురోడ్ల వద్ద ఆందోళనకు సిద్ధమైన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు.



అంజద్‌బాషతోపాటు డిప్యూటీ మేయర్ అరీఫుల్లా, అధికార ప్రతినిధి అఫ్జల్‌ఖాన్, వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం తలెత్తింది. దిష్టిబొమ్మ తగలబెట్టవద్దని పోలీసులు, ఎట్టి పరిస్థితుల్లో కాల్చాల్సిందేనని వైఎస్సార్‌సీపీ నాయకులు పట్టుబట్టడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే అంజద్‌బాషతోపాటు మిగతా నాయకులను పోలీసులు అరెస్టుచేసి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం పూచీకత్తుపై విడుదల చేశారు.

 

 బద్వేలులో ఎమ్మెల్యే జయరాములు

 ఆధ్వర్యంలో: బద్వేలు ఎమ్మెల్యే జయరాములు ఆధ్వర్యంలో బద్వేలులోని నాలుగు రోడ్ల సర్కిల్ వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసి ఆందోళన చేపట్టారు. బద్వేలుతోపాటు కలసపాడు, బి.కోడూరు, అట్లూరు, పోరుమామిళ్లల్లో మాజీ జెడ్పీటీసీ నాగార్జునరెడ్డి, కిట్టా బ్రదర్స్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనాలు చేశారు. ఇప్పటికైనా బాబు దిగివచ్చి డ్వాక్రా, రైతు రుణాలన్నింటిని మాఫీ చేయాలని ఎమ్మెల్యే జయరాములు డిమాండ్ చేశారు.

 

 అలాగే రాజంపేటలో వైఎస్సార్‌సీపీ నాయకుడు ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ర్యాలీగా వచ్చి దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చిన్నమండెంలో మాజీ జెడ్పీవైస్ ఛెర్మైన్ దేవనాథరెడ్డి ఆధ్వర్యంలో బాబు దిష్టిబొమ్మను తగలబెట్టారు. ఒంటిమిట్టలో జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఆందోళన నిర్వహించారు.

 

 అంతా పోలీసు స్వామ్యం..

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జిల్లాలో ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలను అణచివేసేందుకు పోలీసులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం చేయకుండా అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ అడ్డుకున్నారు. కేవలం వైఎస్ జగన్ సొంత జిల్లా కావడంతోనే ఇక్కడ ఆందోళనలను విఫలం చే సేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా నిర్వహిస్తున్న ఆందోళనలు అడ్డుకున్న పోలీసులు, మరోవైపు రెచ్చగొట్టే విధంగా టీడీపీ నేతలు రోడ్లపైకి వ చ్చి ఆందోళనలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top