వైఎస్‌ఆర్ సీపీ బలోపేతమే లక్ష్యం

వైఎస్‌ఆర్ సీపీ బలోపేతమే లక్ష్యం - Sakshi


 శ్రీకాకుళం అర్బన్:వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి అన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి రాష్ట్ర నాయకుడు కాదని, దేశ నాయకుడని వ్యాఖ్యానించారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా నియమితులైన తరువాత తొలిసారిగా సోమవారం ఆమె జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా బాపూజీ కళామందిరంలో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో మమేకమై కార్యకర్తలా శ్రమిస్తూ గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు కృషిచేస్తానన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానన్నారు.

 

 పార్టీ అధినేత నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడే వ్యక్తన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు లేనిపోని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తరువాత కమిటీలతో కాలయాపన చేస్తున్నార ని ధ్వజమెత్తారు. పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ఎంతోమంది శ్రమించి పార్టీ ఆవిర్భావం నుంచి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు. గడచిన ఎన్నికల్లో జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు మూడు చోట్ల విజయం సాధించామని, నాలుగు స్థానాల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయామన్నారు. అనంతరం రెడ్డి శాంతిచే పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయించారు. మాజీ మంత్రి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించడం ముళ్ల కిరీటం వంటిదన్నారు.

 

 రెడ్డి శాంతికి పార్టీ శ్రేణులను ముందుకు నడిపించే సత్తా ఉందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మూడు నెలలు గడచినా ఎటువంటి హామీలు అమలు చేయలేదన్నారు. జిల్లాలో మంత్రి, ఎమ్మెల్యేల నుంచి క్యాబినెట్‌లో మంత్రులు వరకూ ఫ్యాక్షనిస్టులేనని, టీడీపీ నాయకులకు దమ్ముంటే దీనిపై చర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. మంగళవారం దివంగత వైఎస్ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లాలో అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. మూడో తేదీ పార్టీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు జిల్లాకు వస్తున్నందున ఆయనకు పార్టీ శ్రేణులు స్వాగతం పలకాలన్నారు. పార్టీ నేత పాలవలస రాజశేఖరం మాట్లాడుతూ పార్టీకి క్యాడర్‌ను పెంచేందుకు  గ్రామ, మండల, జిల్లాస్థాయి కమిటీలను వేయాలన్నారు. పార్టీ రాష్ట్ర బీసీసెల్ అధ్యక్షునిగా కృష్ణదాస్‌ను నియమించినందుకు గాను పార్టీ నేతలు ఆయనను అభినందిస్తూ సన్మానం చేశారు.

 

 అనంతరం శ్రీకాకుళంలోని న్యూకాలనీలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ కార్యాలయ ఆవరణలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పిరియా సాయిరాజ్, మీసాల నీలకంఠంనాయుడు, జుత్తు జగన్నాయకులు, పార్టీ నాయకులు దువ్వాడ శ్రీనివాస్, గొర్లె కిరణ్, మార్పు ధర్మారావు, వరుదు కల్యాణి, హనుమంతు కిరణ్‌కుమార్, గొండు కృష్ణమూర్తి, అంధవరపు వరహానరసింహం, ఎం.వి.పద్మావతి, సుప్రియ, జె.ఎం.శ్రీనివాస్, టి.కామేశ్వరి, బరాటం నాగేశ్వరరావు, పేరాడ తిలక్, దువ్వాడ శ్రీధర్, దువ్వాడ శ్రీకాంత్, దువ్వాడ వాణి, రొక్కం సూర్యప్రకాశరావు, ఎన్ని ధనుంజయ్, గేదెల రామారావు, సుంకరి కృష్ణ, సువ్వారి గాంధీ, కోణార్క్ శ్రీను, కిల్లి లక్ష్మణరావు, మామిడి శ్రీకాంత్, కెవివి సత్యన్నారాయణ, ధర్మాన రఘునాథమూర్తి, పీస శ్రీహరి, శిమ్మ వెంకట్రావు, పైడి నిర్మల్‌కుమార్, మండవిల్లి రవి, గుంట జ్యోతి పాల్గొన్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top