పోటెత్తిన గోదారి గట్టు


  • ఊరూరా వైఎస్ జగన్‌కు స్వాగతం పలికిన ప్రజలు

  • 10 గంటలు సాగిన తొలిరోజు బస్సు యాత్ర

  • 60 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతల హాజరు

  •  

    పట్టిసీమ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘పట్టిసీమ వద్దు.. పోలవరం ముద్దు..’ అంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సుయాత్ర తొలిరోజు విజయవంతమైంది. గోదారి గట్టు వెంబడి సాగిన యాత్రకు స్థానికులు పోటెత్తారు. యాత్ర తొలిరోజు.. బుధవారం ఉదయం 10 గంటలకు రాజ మండ్రి విమానాశ్రయం నుంచి మొదలైన బస్సుయాత్ర రాత్రి 8 గంటల సమయంలో పట్టిసీమ వద్ద ముగిసింది. రాజమండ్రి విమానాశ్రయంలో 10 గంటలకు దిగిన విపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి 3 బస్సుల్లో 10.30 గంటలకు యాత్ర మొదలైంది. దాదాపు 50 నిమిషాల తర్వాత ధవళేశ్వరానికి చేరి, అక్కడ సర్ ఆర్థర్ కాటన్, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాటన్ బ్యారేజీని సందర్శించారు. పోలవరం ప్రాజెక్టు రిటైర్డ్ ఎస్‌ఈ ఎస్.నాగేశ్వరరావు నేతృత్వంలో కొంత మంది రిటైర్డ్ ఇంజనీర్ల బృందం అక్కడ జగన్‌ను కలిసింది.

     

    ‘పట్టిసీమకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా. ప్రజలపక్షాన నిలబడి పోరాటం చేయకపోతే గోదావరి జిల్లాలు ఎడారిగా మారతాయి. పట్టిసీమ లిఫ్ట్ కోసం రూ.1300 కోట్లు, 21.9 శాతం అదనపు చెల్లింపులు కలిపి.. దాదాపు రూ.1600 కోట్లు ఖర్చు పెట్టి పట్టిసీమను నిర్మించి గోదావరి జిల్లాల రైతుల పొట్టగొట్టడం కంటే, పోలవరం మీద శ్రద్ధ పెట్టి వేగంగా పూర్తి చేస్తే రాష్ట్రమంతా సశ్యశ్యామలం అవుతుంది’ అని జగన్‌కు వారు వివరించారు.

     

    ఉదయం 12.10 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి బయలుదేరిన కాసేపటికి బొబ్బర్లంక గ్రామంలో యువత యాత్రకు ఘన స్వాగతం పలికారు. అక్కవ యువతను పలకరించిన జగన్.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి యాత్ర కొనసాగించారు. తూర్పు నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించిన సందర్భం లోనూ ప్రజలు రోడ్డుపై నిలబడి యాత్రకు స్వాగతం పలి కారు. అక్కడ నుంచి గోదావరి గట్టు వెంబడి యాత్ర సాగుతున్న కొద్దీ.. ఊరూరా ప్రజలు రోడ్డుపై నిలబడి జగన్‌కు ఘనంగా స్వాగతం చెప్పారు. మహిళలు, రైతులు వచ్చి జగన్‌కు వినతిపత్రాలిచ్చారు. దారిపొడవుగా ప్రజలకు అభివాదం చేస్తూ, పలకరిస్తూ, వారి సమస్యలను వింటూ జగన్ బస్సుయాత్రను కొనసాగించారు. 40 కిలోమీటర్ల దూరం లో ఉన్న పోలవరం చేరుకోడానికి మూడున్నర గంటల కుపైగా సమయం పట్టింది. సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో యాత్ర పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరాక, అక్కడ అధికారులతో జగన్ మాట్లాడారు.

     

    ఎప్పటికి పూర్తయ్యేను?: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత పని జరిగిందని సంబంధిత అధికారులను జగన్ ప్రశ్నించారు. దీనికి అధికారులు రూ.100 కోట్ల పని జరిగినట్టు చెప్పారు. దివంగత వైఎస్, తర్వాత ప్రభుత్వాలు దాదాపు రూ.4,500 కోట్లు ఖర్చు చేయగా, ఇంకా రూ.12 వేల కోట్ల వ్యయం చేసే పనులు మిగిలి ఉన్నాయని, ఏటా రూ.100 కోట్ల చొప్పున పనులు చేస్తే ఎంత కాలానికి పనులు పూర్తవుతాయి? అని జగన్ ప్రశ్నించినప్పుడు.. అధికారులు నీళ్లు నమిలారు. పోలవరం ప్రాజెక్టు కోసం 1,200 ఎకరాలు సేకరించడానికి 11 నెలల సమయం ప్రభుత్వానికి సరిపోలేదని, కానీ.. పట్టిసీమ లిఫ్ట్‌కు అవసరమైన 250 ఎకరాల రైతులను మాత్రం ఒప్పించడానికి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్న తీరును జగన్ తప్పుబట్టారు. పోలవరం పనులు దాదాపు నిలిచిపోయాయని, వైఎస్సార్ సీపీ బస్సుయాత్ర ఉందనే నేపథ్యంలో మంగళవారం నుంచి మళ్లీ కొద్దిగా పనులు మొదలుపెట్టారని స్థానిక రైతులు జగన్ దృష్టికి తెచ్చారు. గోదావరి నదిలో కనీసం ఒక్కశాతం పనులు జరినట్టుగా కూడా ఆనవాళ్లు కనిపించడం లేదని జగన్ వ్యాఖ్యానించారు.

     

    రైతుల ఆమోదం సరిపోతుందా..: పట్టిసీమ లిఫ్ట్ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని జగన్ పరిశీలించారు. అక్కడి అధికారులతో మాట్లాడారు. లిఫ్ట్‌కు అవసరమైన పైపులైన్లకోసం భూములను తీసుకునేందుకు కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తున్న విషయం నిజమేనా? అని ప్రశ్నించినప్పుడు.. కాదని వారు జవాబిచ్చారు. మరి రైతులకు పరిహా రం చెల్లించకుండా పనులు ఎలా మొదలుపెట్టారని జగన్ అడిగినప్పుడు.. రైతుల ఆమోదం తీసుకున్నామన్నారు. పరిహారం చెల్లించకుండా రైతుల ఆమోదం సరిపోతుందా? అని జగన్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. పంపుల ఫుట్‌వాల్వ్ లెవల్‌ను అడిగినప్పుడు.. 11 మీటర్ల వద్ద ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాటన్ బ్యారేజీ జలాశయం నీటిమట్టం 13.6 మీటర్లు ఉన్నప్పుడు, పంపుల ఫుట్‌వాల్వ్ లను 11మీటర్ల వద్ద ఏర్పాటు చేసి జలాశయంలో నీళ్లనూ తోడేస్తారా? అని అడగ్గా.. వారి నుంచి జవాబు కరువైంది.

     

    రైతులతో ముఖాముఖి: సాయంత్రం 6.30 గంటలకు పట్టిసీమ వద్ద రైతులతో జగన్ ముఖాముఖి మాట్లాడారు. పట్టిసీమ లిఫ్ట్‌తో గోదావరి జిల్లాలు బీడుబారిపోతాయని, తమ పొట్టగొట్టాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోందని.. రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం.. తొలిరోజు యాత్ర ముగించుకొని విజయవాడ వైపు బస్సులు బయలుదేరాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top