కోలాహలం

ఫ్యాన్ గుర్తుతో వైఎస్ఆర్ సీపీ అభిమాని సందడి - Sakshi


నామినేషన్ల దాఖలు బుధవారం కోలాహలంగా సాగింది. జిల్లాలో రోడ్లన్నీ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు దారితీశాయి. జిల్లా అంతటా సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల సందడి, అభ్యర్థుల హడావుడి కనిపించింది. ఆయా పార్టీల అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో అట్టహాసంగా ర్యా లీగా ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. దీంతో రోడ్లన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి.   ఐదో రోజున జిల్లాలోని 3 లోక్‌సభ, 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 112 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో విశాఖ ఎంపీకి 7, అనకాపల్లి ఎంపీకి 12, 15 శాసనసభ స్థానాలకు 53 మంది అభ్యర్థులు 93 నామినేషన్లు వేశారు. ఇందులో చాలా మంది రెండు నుంచి నాలుగు సెట్లు దాఖలు చేశారు.

 

 కిక్కిరిసిపోయిన కలెక్టరేట్

 విశాఖ, అనకాపల్లి లోకసభ స్థానాలతో పాటు విశాఖ-తూర్పు నియోజకవర్గానికి నామినేషన్లను జిల్లా కలెక్టరేట్‌లో స్వీకరించారు. ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి రావడంతో వారి అనుచరులు, కార్యకర్తలతో కలెక్టరేట్ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ట్రాఫిక్ స్తంభించింది. అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్ భారీగా అభిమానులతో అట్టహాసంగా వచ్చి 2 సెట్ల నామినేషన్లను జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు సమర్పించారు.

 

 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, అమర్‌నాథ్ తల్లి గుడివాడ నాగమణిల సమక్షంలో నామినేషన్లు వేశారు. టీడీపీ అభ్యర్థిగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు 4 సెట్లు, అతనికి డమ్మీగా ముత్తంశెట్టి జ్ఞానేశ్వరి, కాంగ్రెస్ అభ్యర్థి  తోట విజయలక్ష్మి 4 సెట్లు, స్వతంత్ర అభ్యర్థిగా ఎస్.అప్పలరాజు ఒక నామినేషన్ వేశారు. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కంభంపాటి హరిబాబు సాదాసీదాగా వచ్చి కలెక్టర్ ఆరోఖ్యరాజ్‌కు 4 సెట్ల నామినేషన్లు సమర్పించారు. సీపీఎం అభ్యర్థి సి.హెచ్.నరసింగరావు మాత్రం భారీగా కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి 2 సెట్లు వేశారు. స్వతంత్ర అభ్యర్థి బ్రహ్మస్వరూప్ కాశీభట్ట నామినేషన్ వేశారు.

 

 అసెంబ్లీకి 93 నామినేషన్లు

 జిల్లాలోని15 అసెంబ్లీ నియోజకవర్గాలకు 93 నామినేషన్లు దాఖలయ్యాయి. విశాఖ-తూర్పు నియోజకవర్గానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి చిన్నబోయిన శ్రీనివాసరావు (వంశీకృష్ణ శ్రీనివాస్) పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీగా కలెక్టరేట్‌కు వచ్చారు. తూర్పు నియోజకవర్గంలో ప్రతీ ప్రాంతంలోను ప్రజలు వంశీకృష్ణకు మద్దతు పలికారు. అదనపు జాయింట్ కలెక్టర్‌కు 2 సెట్ల నామినేషన్లు సమర్పించారు. సీపీఎం అభ్యర్థి ఆర్.కె.ఎస్.వి.కుమార్ 2 సెట్లు, సీపీఐ అభ్యర్థి దేవరకొండ మార్కెండేయులు 2 సెట్లు, స్వతంత్రులుగా చిన్నబోయిన మాలకొండయ్య, మురారి జగన్నాథరావు, యు.ఎన్.మూర్తి శేఖర్‌మంత్రి నామినేషన్ వేశారు.

 

 భీమిలికి ఏడుగురు అభ్యర్థులు 15 నామినేషన్లు, విశాఖ దక్షిణ నియోజకవర్గానికి నలుగురు అభ్యర్థులు 5 నామినేషన్లు, విశాఖ ఉత్తరానికి నలుగురు అభ్యర్థులు 7, విశాఖ పశ్చిమానికి నలుగురు అభ్యర్థులు 7, గాజువాకకు ఆరుగురు అభ్యర్థులు 10, చోడవరానికి ముగ్గురు అభ్యర్థులు 3, మాడుగులకు ఇద్దరు అభ్యర్థులు 4, అరకువేలీకి ఇద్దరు అభ్యర్థులు 5, పాడేరుకు ముగ్గురు అభ్యర్థులు 6, అనకాపల్లికి ఇద్దరు అభ్యర్థులు 2, పెందుర్తికి నలుగురు అభ్యర్థులు 9, యలమంచిలికి ఇద్దరు అభ్యర్థులు 5, పాయకరావుపేటకు ఇద్దరు అభ్యర్థులు 2, నర్సీపట్నంకు ఇద్దరు అభ్యర్థులు 4 నామినేషన్లు వేశారు. అన్ని రిటర్నింగ్ కార్యాలయాల వద్ద భారీగా పోలీసులను మోహరించి ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top