నరకాసుర వధ

నరకాసుర వధ - Sakshi


 ‘ఏరు దాటేవరకు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న’ అనే నానుడి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ  గెలుపే ధ్యేయంగా  వ్యవసాయ, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని  చంద్రబాబు  హామీలు ఇచ్చారు. ఆయన మాటలు నమ్మిన ప్రజలు అధికారం కట్టబెట్టడంతో, రుణమాఫీపై తొలి సంతకంపేరుతో బాబు చేస్తున్న మాయాజాలం కళ్లకు కడుతోంది. ఖరీఫ్ ప్రారంభమై మూడు వారాలు గడిచినా రుణమాఫీ అమలు అతీగతీ లేకుండాపోయింది.

 

 సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మోసాలను ఎండగడతూ, రుణమాఫీపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన బాట పట్టింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు గురువారం నుంచి మూడు రోజులపాటు ఊరూరా చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేయాలని నిర్ణయించినట్టు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ బుధవారం వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ‘నరకాసుర వధ’గా నామకరణం చేసినట్టు ఆయన తెలిపారు.

 

 ంద్రబాబు ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.1.50 లక్షలు, డ్వాక్రా గ్రూపునకు రూ.లక్ష మాఫీ చేస్తున్నట్టు ప్రకటించడంపై ఇటు రైతులు, అటు డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికార పీఠమెక్కిన తరువాత నట్టేట ముంచుతున్నారని మండిపడుతున్నారు.

 

 రుణమాఫీపై టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో డ్వాక్రా గ్రూపు మహిళలు ధర్నాలు చేసి తమ నిరసన తెలిపారు.

 ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మోసాలను ఎండగడుతూ, రుణమాఫీపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన బాట పట్టాలనీ, ‘నరసకాసుర వధ’ పేరిట చంద్రబాబు దిష్టిబొమ్మలను గ్రామగ్రామానా దహనం చేయాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పిలు పునిచ్చారు.

 

 పెద్ద ఎత్తున ఆందోళనలు.. మర్రి రాజశేఖర్

 వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు.

 

 ఎలాంటి షరతులు లేకుండా వ్యవసాయ, డ్వాక్రా గ్రూపుల రుణాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.

 పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, ముఖ్య బాధ్యులు ఈ కార్యక్రమాన్ని నడిపించాలని కోరారు.

 

 ప్రతి గ్రామంలో  పార్టీ నాయకులు ,కార్యకర్తలు ‘నరకాసుర వధ’ కార్యక్రమాన్ని నిర్వహించాలని మంగళగిరి, మాచర్ల, బాపట్ల ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి పిలుపునిచ్చారు.

 

 నియోజకవర్గాల సమీక్ష వాయిదా

 వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గుంటూరులో ఈ నెల 24వ తేదీన ప్రారంభం కావాల్సిన నియోజకవర్గ సమీక్ష సమావేశాలను వాయిదా వేసినట్టు పార్టీ కార్యక్రమాల కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌లు తెలిపారు.

 

 రుణమాఫీపై తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నందున సమీక్ష సమావేశాలను వాయిదా వేసినట్టు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top