ధైర్యంగా ఉండండి..

ధైర్యంగా ఉండండి.. - Sakshi


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది

పాలక పక్ష అన్యాయాలపై పోరాడదాం

రాజధాని గ్రామాల రైతులు, కౌలురైతులు, కూలీలకు వైఎస్సార్ సీపీ అధినేత,

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా

రాజధాని ప్రాంతంలో పర్యటన.. రైతులు, మహిళలతో ముఖాముఖి


 

కొడుకా ఈ పిల్లకు పెళ్లి ఎలా చెయ్యాలయ్యా అంటూ ఓ అమ్మ.. అన్నా రేపటి నుంచి నా చదువు సాగేదెలా అంటూ ఓ చెల్లి..

 మనవడా మేమెలా బతకాలి అంటూ ఓ తాత,అవ్వ..  తల్లిలాంటి భూముల్ని లాక్కున్నారయ్యా అంటూ రైతులు, కౌలు రైతులు..

 ఏ పనులు చేసుకుని పొట్టపోసుకోవాలయ్యా అంటూ రైతు కూలీలు..  రాజధాని ప్రాంతంలో మంగళవారం పర్యటించిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట చిన్నాపెద్దా ఒకరేమిటీ అంతా ఉద్వేగభరితులయ్యారు. రాజధాని భూ సమీకరణ పేరుతో టీడీపీ ప్రభుత్వం సాగించిన దమనకాండను ఆయన కళ్లకు కట్టినట్టు చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు. వారి బాధలను సావధానంగా ఆలకించిన జగన్ తానున్నానంటూ వారిలో మనోధైర్యం నింపారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ ప్రభుత్వం లాక్కున్న భూములను తిరిగి రైతులకు ఇస్తామంటూ వారికి భరోసా కల్పించారు. పాలకుల అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడదామంటూ జనహర్షధ్వానాల మధ్య ప్రకటించారు.  

 

గుంటూరు : ‘మీరు ధైర్యంగా ఉండండి, ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడదాం, మీకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది’ అని రాజధాని గ్రామాల రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలను తెలుసుకుని ఇక్కడి రైతులు, కౌలు రైతులు, కూలీల్లో మనోధైర్యం నింపేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఆయా గ్రామాల్లో పర్యటించారు. జగన్ రాకను ముందుగానే తెలుసుకున్న రైతులు, మహిళలు ఆయనకు ఎదురేగి ఘన స్వాగతం పలికారు. ఉదయం నుంచి రహదారుల వెంట బారులు తీరారు. భూ సమీకరణ పేరిట టీడీపీ పాలకులు సృష్టించిన భయాందోళనలను జగన్ ఎదుట ఏకరువు పెట్టారు. తమ రెక్కల కష్టాన్నిముఖ్యమంత్రి చంద్రబాబు గద్దలా తన్నుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇకపై ఆయన ఆటలు సాగనీయం, అన్నా నువ్వు అండగా ఉంటే మా ప్రాణాలకు తెగించైనా మా భూములను కాపాడుకుంటాం’ అంటూ గ్రామ గ్రామాన రైతులు ఉద్వేగభరితంగా మాట్లాడారు. వారి బాధలను ఆసాంతం విన్న జగన్ మాట్లాడుతూ, వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందనీ, ధైర్యంగా ఉండాలని చెప్పారు. జరీబు రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని, కౌలుదారులు, వ్యవసాయ కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు.



పర్యటన సాగిందిలా....



వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  ఉదయం 9 గంటలకు ఉండవల్లి చేరుకుని పర్యటన ప్రారంభించారు. తొలుత గ్రామ సెంటర్‌లో ఉన్న రైతులతో మాట్లాడారు. ఈ సమయంలో అక్కడకు మహిళలు కూడా చేరుకుని ఉద్వేగభరితంగా మాట్లాడారు.  ‘మా ప్రాణాలు అయినా ఇస్తాం గానీ, పంట భూములను మాత్రం వదిలేది లేదు, జరీబు భూముల్లో సాలీనా నాలుగు పంటలు పండుతున్నాయి. ఏటా రూ.లక్షన్నర వరకు సంపాదించుకుంటూ హాయిగా జీవిస్తున్నాం. రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు మూడు నెలల నుంచి నిద్రలేకుండా చేశాడు. అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా మంత్రులు, అధికారులు, టీడీపీ కార్యకర్తలు మా ఇళ్లకు వచ్చి భూ అంగీకార పత్రాలపై సంతకాలు చేయాలని ఒత్తిడి చేశారు. భూములు మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదు.’ అని మహిళలు, రైతులు స్పష్టంగా చెప్పారు.



పొలాల్లోకి వెళ్లి..  రైతుల బాధలు విన్న జగన్...



 ఉండవల్లి గ్రామ సెంటర్ నుంచి జగన్ ముందుకు కదిలి  అరటి, కంద, గులాబీ, బంతిపూల తోటల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడారు. బత్తుల ఏడుకొండలు అనే రైతు మాట్లాడుతూ ‘నేను 75 సెంట్లలో అరటి  సాగు చేస్తున్నా, రూ.1.50 లక్షల వరకు సంపాదించుకుంటున్నా.  భూ సమీకరణకు సంతకం చేయలేదు, భూసేకరణ కూడా అంగీకరించను, ఒకవేళ ప్రభుత్వం భూసేకరణ చేస్తే పురుగుల మందే నాకు దిక్కు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.



 అక్కడే ఉన్న బంతిపూలు, గులాబీ, అరటి, కంద సాగు చేసే రైతులు మాట్లాడుతూ,  ‘మాకు నెలకు రూ.25 వేల వరకు ఆదాయం వస్తోంది. కౌలుకు తీసుకుంటేనే ఇంత లాభం వస్తోంది.  కొందరు రైతులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకు రావడంతో వారు భయపడి సమీకరణకు సుముఖంగా సంతకాలు చేశారు. వారి భూములు ప్రభుత్వానికి ఇచ్చేస్తే మాకు పనులు ఉండవు. వాస్తు దోషమని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు మా జీవితాలను నరకం చేస్తున్నారు’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు.



మరో రైతు దంటు గోవర్ధనరెడ్డి మాట్లాడుతూ ‘మా పొలాలన్నీ విజయవాడ సమీపంలోనే ఉన్నాయి,  బిల్డర్లు ఇక్కడ అపార్టుమెంట్లు కడుతున్నారు. ఎకరం పొలం వారికి డెవలప్‌మెంట్‌కు ఇస్తే, మాకు 40 ఫ్లాట్లు ఇస్తున్నారు. ఒక్కో ఫ్లాటు రూ. 40 లక్షలకు అమ్ముకుంటే రూ.16 కోట్లు వస్తాయి, ఇంత లాభం వచ్చే భూముల్ని మేం ఎలా వదలుకుంటాం’ అని ప్రశ్నించారు.

 

పెనుమాక గ్రామంలో....



జగన్ పెనుమాక గ్రామానికి వస్తూ మార్గం       మధ్యలో రైతులు, వ్యవసాయ కూలీలను పరామర్శించారు. ‘మీకు అండగా ఉంటాను, గట్టిగా పోరాడతాను, ధైర్యంగా ఉండండి’ అంటూ భరోసా ఇచ్చారు. గ్రామంలో మహిళలతో జగన్ ముఖాముఖీ మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘మా ఉసురు పోసుకుంటారు, ప్రశాంతంగా ఉంటున్న మా జీవితాలను అల్లకల్లోలం చేశారు.’ అంటూ మండిపడ్డారు. ఈ సమయంలో జగన్, ‘మీకు రుణమాఫీ జరిగిందా, బంగారు ఆభరణాలను బ్యాంకుల నుంచి తెచ్చుకున్నారా, డ్వాక్రా రుణాలు రద్దు చేశారా’ అంటూ ప్రశ్నించారు. ఏ ఒక్కటీ రద్దు కాలేదని, వాటినే చేయలేని వారు రాజధానిని ఎలా నిర్మిస్తారని మహిళలు తిరిగి ప్రశ్నించారు. రుణమాఫీ పేరిట మోసం చేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.



ఆ తరువాత మహిళలు ఒక్కొక్కరుగా మాట్లాడారు.



ముందుగా, మస్తానమ్మ అనే కౌలు రైతు మాట్లాడుతూ ‘మాకు పొలం మినహా మరొకటి తెలియదు. మాకు ఏసీ రూమ్‌లు కట్టిపెడతామంటున్నారు అవేవీ అవసరం లేదు. మా అమ్మాయికి 20 సంవత్సరాల వయసు వచ్చింది. పెళ్లి చేయాలి. ఇంకా కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, ఇవన్నీ ఎలా నెరవేర్చాలో తెలియడం లేదు’ అంటూ కంటతడి పెట్టుకున్నారు. మరో మహిళ నాగమణి మాట్లాడుతూ ‘ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ కోట్ల రూపాయలు చెల్లిస్తున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతాం. అసలు ఆయన్ను గెలిపించిన వారికి బుద్ధిలేదు. ఇది బుద్ధిలేని రాజ్యం.’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.



షేక్ అబ్దుల్లా అనే బోర్ల మెకానిక్ మాట్లాడుతూ ‘రాజధాని గ్రామాల్లో బోర్లు వేసుకుంటూ బతుకుతున్నా. ఈ భూములన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే నేను ఎక్కడ బోర్లు వేయాలి, ఎలా బతకాలి. దైవసాక్షిగా చెబుతున్నా ఈసారి చంద్రబాబు గెలవడంటే గెలవడు ఇది నా శాపం’ అంటూ ఆందోళన వెలిబుచ్చారు.



ఎర్రబాలెం, పెనుమాక గ్రామాల మధ్యలో...



 జగన్ ఎర్రబాలెం, పెనుమాక గ్రామాల మధ్యలో దొండ, అరటితోటలను పరిశీలించి ఆదాయం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎర్రబాలెం సెంటర్‌లో శ్రీకాంత్ అనే యువకుడు మాట్లాడుతూ ‘దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఉన్నత చదువులు చదువుకున్నా. ఈ ప్రభుత్వం బలవంతంగా నా భూముల్ని లాక్కొంది, ఇప్పుడు నేను ఎలా బతకాలి సార్’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.  



మంగళగిరిలో...



ఎర్రబాలెంలో గొర్రెల పెంపకం దారులు బాణావత్ నాయక్, క ళ్ళిబాయిలను జగన్ కలిసి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడ నుంచి పోగోలు పూర్ణయ్య అనే రైతు పొలంలో పంటలను పరిశీలించి రైతు, రైతు కూలీల ఆవేదనను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పూర్ణయ్య మాట్లాడుతూ రాజధానికి భూములు ఇచ్చేది లేదని, తమను చంపి సమాధులపై రాజధాని  నిర్మించుకోవాలని చెప్పారు. వారికి అండగా ఉంటామని జగన్ భరోసా కల్పించారు. అనంతరం గ్రామ సెంటర్ నటరాజ కళామందిర్ జరిగిన సమావేశంలో రైతు, రైతు కూలీల సమస్య తెలుసుకున్నారు.



స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్ సీపీ భూపర్యటన కమిటీ సభ్యులతో పాటు స్థానిక  నాయకులు మున్నంగి గోపిరెడ్డి, ఎంపీపీ పచ్చల రత్నకుమారి, జిల్లా ఎస్సీ,ఎస్టీ సెల్ కన్వీనర్‌లు బండారు సాయిబాబు, మొగిలి మధు, చిల్లపల్లి మోహన్‌రావు, జిల్లా మహిళా కన్వీనర్ యేళ్ల జయలక్ష్మీ, మునగాల మల్లేశ్వరరావు, పచ్చల శ్యామ్‌బాబు, ఎంపీటీసీలు షేక్ హన్నన్, సుధాహనుమాయమ్మ, అన్నె శేషారావు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు సంకె సునీత, మద్దిరాల జ్యోతి, నాయకులు నాలి వెంకట కృష్ణ, ఇక్బాల్ అహ్మద్, షేక్ మహ్మద్, మాచర్ల సుధాకర్, ఆకురాతి రాజేష్, షేక్ శ్రీను, ఎండీ ఫిరోజ్, నరేంద్ర  తదితరులు పాల్గొన్నారు.

 

భూమి ఎక్కడికీ పోదు : జగన్



ఎర్రబాలెం సెంటర్‌లో జగన్ మాట్లాడుతూ ‘ శ్రీకాంత్ నీకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది. మీ ఎమ్మెల్యే ఆర్కే తోడుగా ఉంటారు, ఇప్పటికే కోర్టులో కేసు వేశారు. నువ్వు కూడా ఆయన్ను సంప్రదించి కోర్టులో కేసు వేయండి, భూమి ఎక్కడికీ పోదు. ఇది రాక్షస ప్రభుత్వం, దీనిపై గట్టిగా పోరాడదాం. దౌర్జన్యంగా భూములు తీసుకుంటే ఊరుకోం. మనసులో ఇంత బాధ ఉన్నా నా పర్యటనకు వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నా’ అంటూ చేతులు జోడించి ప్రజలకు అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగిపోయారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top