శోభా నాగిరెడ్డి మరిలేరు

శోభా నాగిరెడ్డి మరిలేరు - Sakshi


సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉప నాయకురాలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి(46) ఇకలేరు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోని 18వ జాతీయ రహదారిపై గూబగుండంమిట్ట వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శోభ... గురువారం ఉదయం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. పక్కటెముకలు విరిగిపోవడంతో ఊపిరి పీల్చుకోలేక అపస్మారక స్థితిలో ఉన్న శోభను మెరుగైన చికిత్స కోసం గురువారం ఉదయానికి బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స చేశారు. అయితే ఈ ప్రయత్నం ఫలించకపోవడంతో ఉదయం 11.05 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

 

 బుధవారం రాత్రి నంద్యాలలో షర్మిల బహిరంగసభలో పాల్గొని ఆళ్లగడ్డకు తిరిగి వెళుతుండగా శోభా నాగిరెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాద స్థలిలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిన శోభను  ఆళ్లగడ్డకు తరలించగా అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స చేసి నంద్యాలకు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్ల సూచనల మేరకు ఆమెను నేరుగా హైదరాబాద్ కు తరలించారు. ఉదయం 7.30కు అక్కడకు చేరుకోగానే ఆమె పరిస్థితిని ‘బ్రెయిన్ డెడ్’ (మెదడు పనిచేయని స్థితి)గా వైద్యులు అంచనా వేశారు. 11 గంటలకుపైగా మృత్యువుతో పోరాడిన శోభ ఉదయం 11.05 గంటలకు తుదిశ్వాస విడిచారు. నంద్యాల వైఎస్సార్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, ఆమె భర్త భూమా నాగిరెడ్డి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు చికిత్స జరుగుతున్నపుడు ఆసుపత్రిలోనే ఉన్నారు. శోభ తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారన్న వార్త తెలియగానే ఆ కుటుంబసభ్యులంతా కన్నీరు మున్నీరయ్యారు. భూమా నాగిరెడ్డి సృ్పహతప్పి పోవడంతో వైద్యులు తక్షణం చికిత్సను అందించారు. ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని తెలియగానే అభిమానులు, ప్రజలు, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉదయం నుంచే భారీస్థాయిలో ఆసుపత్రికి చేరుకున్నారు.




 నేత్రదానం: శోభ తన కళ్లను దానం చేస్తూ గతంలో అంగీకారపత్రం ఇవ్వడంతో వైద్యులు ఆమె నేత్రాలను తొలగించి ‘ఐ బ్యాంక్’కు పంపారు. శోభ కళ్లను శుక్రవారం ఇద్దరు అంధులకు అమర్చనున్నట్లు హైదరాబాద్ జిల్లా అంధత్వ నివారణ కార్యక్రమం అధికారి డాక్టర్ రవీందర్‌గౌడ్ తెలిపారు.

 

 విజయమ్మ సహా పలువురి సందర్శన: శోభ పార్థివదేహం కేర్ ఆసుపత్రిలో ఉండగానే వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో సహా పలువురు ప్రముఖులు సందర్శించారు. శోభ భౌతికకాయాన్ని చూడగానే విజయమ్మ దుఖాన్ని ఆపుకోలేక విలపించారు. చికిత్స జరుగుతున్నపుడే ఎంవీ మైసూరారెడ్డి, డీఏ సోమయాజులు, లక్ష్మీపార్వతి, విజయచందర్, వాసిరెడ్డి పద్మ, అల్లు అరవింద్, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్.పి.మీనా, టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె.ఆర్.ఆనంద్, విద్యుత్ శాఖ ఉన్నతాధికారి చంద్రశేఖరరెడ్డి, సినీ నటులు మంచు మనోజ్, మంచు లక్ష్మి, రాజా, జీవిత, రాజశేఖర్, ప్రొఫెసర్ ఆర్.వేణుగోపాల్‌రెడ్డితో పాటు పలువురు శోభ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

 

 ఆళ్లగడ్డలో నేడు అంత్యక్రియలు

 

 శోభా నాగిరెడ్డి పార్థివదేహానికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ప్రజల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని ఇంటి వద్దే ఉంచనున్నారు. ఆ తర్వాత భూమా నివాసం నుంచి పాతబస్టాండ్, ఇండోర్‌స్టేడియం, జాతీయరహదారి, చిన్నకందుకూరు రస్తా మీదుగా అంతిమయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య జాతీయ రహదారి సమీపంలోని సుద్దపల్లి క్రాస్ రోడ్డు వద్ద సొంత స్థలంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహితులు తెలిపారు.

 

 

 భూమా నివాసం శోకసంద్రం




 ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్: భూమా శోభా నాగిరెడ్డి మరణవార్తతో ఆళ్లగడ్డ శోకసంద్రమైంది. ఆమె పార్థివదేహం ఆళ్లగడ్డలోని  నివాసానికి చేరుకోగానే ప్రజలు ఉద్వేగానికి లోనయ్యారు. శోభా నాగిరెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అమ్మా ఎక్కడికి పోతివమ్మా అంటూ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె మృతదేహాన్ని అంబులెన్స్ నుంచి దించగానే కుమార్తెలు బోరున విలపించారు. అమ్మా లేమ్మా... అంటూ రోదిస్తున్న వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. శవపేటికపై తలపెట్టి ఏడుస్తున్న కొడుకును చూసి అక్కడి వారంతా కన్నీరు పెట్టారు. మేనమామ ఎస్వీ మోహన్‌రెడ్డి వారిని ఓదార్చారు. ఆళ్లగడ్డలో మధ్యాహ్నం నుంచి స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు జనాలు బారులు తీరారు. భూమా నివాస ప్రాంగణంలో మిత్రులు, కుటుంబసభ్యులు ఆప్తులు, సన్నిహితులు పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. ‘‘ఎమ్మెల్యేగా తప్పక గెలుస్తుంది. మంత్రి అవుతుందనే ఆశించాం. మీకు ఇలా జరుగుతుందని ఊహించలేదు తల్లీ’’ అంటూ మహిళలు బోరున విలపించారు.

 

 ఎంత శ్రమించినా ఫలితం లేకపోయింది: వైద్యులు

 

 అపస్మారక స్థితిలో ఉన్న శోభానాగిరెడ్డిని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి అత్యవసర విభాగానికి తీసుకొచ్చిన వెంటనే డాక్టర్ సోమరాజు నేతృత్వంలోని క్రిటికల్ కేర్, ఆర్థో, న్యూరో విభాగం వైద్యబృందం ఆమెకు పలు పరీక్షలు చేసింది. ఉదయం 9 గంటలకు తల, ఛాతీ, మెడ భాగంలో సీటీస్కాన్ తీయించారు. తలకు తగిలిన బలమైన గాయంవల్ల మెదడులో రక్తం గడ్డకట్టడంతో పాటు చెవి, ముక్కు నుంచి అధిక రక్తస్రావమైనట్లు గుర్తించారు. పక్కటెముకలు విరిగి గుండె, ఊపిరితిత్తులకు ఆనుకోవడంతో గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంటున్నట్లు, శ్వాస కూడా తీసుకోలేకపోతున్నట్లు నిర్ధారించారు. మెడలోని నరాలు కూడా చిట్లిపోయినట్లు ఉదయం 10 గంటలకు విడుదల చేసిన మెడికల్ బులెటిన్‌లో వైద్యులు స్పష్టం చేశారు. ఆపరేషన్ చేసి గుండెకు ఆనుకుని ఉన్న పక్కటెముకలను సరిచేయాలని వారు నిర్ణయించారు. అదే సమయంలో అకస్మాత్తుగా పల్స్‌రేటు పడిపోయింది. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు పనిచేయడం మానేశాయి. దీంతో శోభానాగిరెడ్డి చికిత్స పొందుతూ ఉదయం 11.05 నిమిషాలకు మృతి చెందినట్లు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గోపీకృష్ణ ప్రకటించారు. ఆమెను కాపాడేందుకు నాలుగు గంటలపాటు తామెంతో శ్రమించినా ఫలితం లేకపోయిందని తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top