'జగన్ పోరాటం చూస్తుంటే వైఎస్ఆర్ గుర్తుకొస్తున్నారు'

'జగన్ పోరాటం చూస్తుంటే  వైఎస్ఆర్ గుర్తుకొస్తున్నారు' - Sakshi


హైదరాబాద్ : వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు పుట్టిన పార్టీయే వైఎస్ఆర్సీపీ అని, పోరాటంలోనే నడుస్తోందని ఆపార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అలాగే వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరంపార్టీ నేతలతో కలిసి పార్లమెంట్ ఆకారంలో ఉన్న కేక్ను కట్ చేశారు.



ప్రజల సంక్షేమమే పరమావధిగా వారి పోరాటాల నుంచే ఉద్భవించి, ప్రత్యర్థుల కుట్రలు, కుతంత్రాలను ఛేదించుకుంటూ పార్టీ పురోగమిస్తున్న తీరును ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ప్రాంతాలకతీతంగా వైఎస్ రాజశేఖరరెడ్డి  అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశారని అన్నారు. వైఎస్ఆర్  మరణించినప్పటి నుంచి ప్రజలు ఎన్నో బాధలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎన్నో పోరాటాలు చేశామని విజయమ్మ అన్నారు. రెండు ప్రాంతాలకు చెందిన బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆమె అన్నారు.



సొంత ప్రయోజనాలు తప్ప, చంద్రబాబు నాయుడుకు ప్రజల కష్టాలు పట్టవని ఆమె వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తుంటే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు భయపడుతున్నాయని విజయమ్మ ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు సహాయపడ్డారని విజయమ్మ అన్నారు. రాష్ట్రాన్ని విడదీసినా తెలుగువారంతా ఒక్కటేనని ఆమె పేర్కొన్నారు. వైఎస్ జగన్ పోరాటం చూస్తుంటే వైఎస్ఆర్ గుర్తుకొస్తున్నారని విజయమ్మ అన్నారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని విజయమ్మ ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు ఘనంగా పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించుకుందామని ఆమె అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top