3న రాజధాని గ్రామాల్లో జగన్ పర్యటన


సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్చి 3వ తేదీన ఏపీ రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటించనున్నారు. వచ్చే మంగళవారం రోజంతా ఆయన మంగళగిరి, తాడికొండ మండలాల్లోని రాజధాని నిర్మాణానికి నిర్దేశించిన గ్రామాల్లో పర్యటించి అక్కడి రైతులు, రైతు కూలీలు, కౌలుదారుల సమస్యలు తెలుసుకుంటారని పార్టీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు వెల్లడించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌తో కలిసి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ ఆధ్వర్యంలోని రాజధాని రైతులు, రైతు కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ శనివారం సమావేశమై జగన్ పర్యటన విషయమై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

 

ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, కురగల్లు, ఉద్దండ్రాయునిపాలెం, వెంకటపాలెం, మందడం, రాయపూడి, తుళ్లూరు తదితర గ్రామాల్లో జగన్ పర్యటిస్తారని వెల్లడించారు. రాజధాని గ్రామాల్లో రైతుల సమస్యలను తెలుసుకుని మార్చి 7 నుంచి ప్రారంభమయ్యే శాసనసభా సమావేశాల్లో జగన్ వాటిని ప్రభుత్వం దృష్టికి తెస్తారని వివరించారు. హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు ఇప్పటికే పలుమార్లు రాజధాని గ్రామాల్లో పర్యటించి అక్కడ నెలకొన్న పరిస్థితులు తెలుసుకున్నారని తెలిపారు. తాజాగా తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు కూడా ఆ గ్రామాల్లో పర్యటించారన్నారు. జగన్ తమ గ్రామాల్లో పర్యటించాలని అక్కడి రైతులు కోరుకుంటున్నారని, జగన్ కూడా రైతులకు అండగా ఉన్నారనే విషయం తెలియజేసేందుకు తమ కమిటీ ఆయన పర్యటనపై నిర్ణయం తీసుకుందని చెప్పారు.

 

బెదిరించి, భయపెట్టి భూ సమీకరణ

 భూ సమీకరణ ప్రక్రియ అంతా రైతుల భయాందోళనల మధ్య సాగిందని అంబటి చెప్పారు. స్వచ్ఛందంగా ఇస్తేనే భూములను తీసుకుంటామని పైకి చెప్పిన ప్రభుత్వం.. రైతులను బెదిరించి, భయపెట్టి, అంగీకారపత్రాలను తీసుకుందని విమర్శించారు.  రైతులు తమ భూములను ఇవ్వకుండా చేస్తున్నది ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమేనని ప్రభుత్వం చెప్పడం పట్ల అంబటి తీవ్ర అభ్యంతరం తెలిపారు.

 

 అనేక ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా పచ్చని పొలాలను రైతుల వద్ద నుంచి సమీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. స్వామి అగ్నివేశ్  పర్యటించి రైతులకు మద్దతుగా నిలిచారన్నారు. సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ కూడా మద్దతు నిస్తున్నారని, ఆమె త్వరలో  పర్యటిస్తారని వెల్లడించారు. భూసమీకరణ ప్రక్రియ పూర్తయ్యాక ఇప్పుడు జగన్ పర్యటించడాన్ని విలేకరులు ప్రశ్నించగా.. అంగీకార పత్రాలు ఇచ్చినంత మాత్రాన అంతా అయిపోయినట్లు కాదని, రైతులకూ ప్రభుత్వానికీ మధ్య ఒప్పందాలు జరిగేవరకూ వాటిని వెనక్కి తీసుకునే అవకాశం ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ రైతుల సమస్యలపై మహోద్యమాన్ని నిర్మిస్తుందని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top