నేటి నుంచి వైఎస్‌ఆర్ జిల్లాలో జగన్ పర్యటన

నేటి నుంచి వైఎస్‌ఆర్ జిల్లాలో జగన్ పర్యటన - Sakshi


వైఎస్ఆర్ జిల్లా(పులివెందుల) : వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం(నేడు) జిల్లాకు రానున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం కర్నూలు నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు కడప చేరుకుంటారన్నారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటన మేరకు జగన్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.

 మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు కడపలోని అమీన్ ఫంక్షన్ హాలులో ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. రాత్రి ఇడుపులపాయకు చేరుకొనిఅక్కడే బస చేస్తారు.  

 బుధవారం ఉదయం వైఎస్ రాజశేఖరరెడ్డి (వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి) జయంతిని పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. అనంతరం వేంపల్లెకు చేరుకొని గండి రోడ్డులో ఏర్పాటు చేసిన ఆర్‌వో వాటర్ ప్లాంటును ప్రారంభిస్తారు. గండిరోడ్డులో ఉన్న మసీదును సందర్శించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. తర్వాత పులివెందులకు చేరుకొని ఇటీవల వివాహం చేసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఓతూరు రసూల్ కుమార్తె, అల్లుడులను ఆశీర్వదిస్తారు. ఇటీవల వివాహమైన వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త ప్రకాష్‌రెడ్డి కుమారుడు ఉదయ్‌కుమార్‌రెడ్డి, కోడలు సువర్ణలను ఆశీర్వదిస్తారు. ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్న వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త గౌస్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తారు. అక్కడి నుంచి బొగ్గుడుపల్లె గ్రామానికి చేరుకొని ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. మధ్యాహ్నం తర్వాత సింహాద్రిపురం మండలం చవ్వారిపల్లె గ్రామానికి చేరుకొని ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన ఆర్‌వో వాటర్ ప్లాంటును ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కసనూరు, ఆగ్రహారం గ్రామాలకు వెళ్లి ఇటీవల విద్యుత్ ప్రమాదంలో మరణించిన కృష్ణమోహన్‌రెడ్డి, శేషారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.

 

 గురువారం ఉదయం లింగాల మండలం మురారిచింతల గ్రామానికి చేరుకొని అనారోగ్యంతో మరణించిన మాజీ సర్పంచ్ ఓబుళరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం పులివెందులకు చేరుకొని తన క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం వరకు కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌కు బయలులదేరి వెళతారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top