బాబువన్నీ తప్పుడు లెక్కలే

బాబువన్నీ తప్పుడు లెక్కలే - Sakshi


హైదరాబాద్: కేంద్రం నుంచి అధిక నిధులను రాబట్టడానికి బడ్జెట్‌లో మాయ చేసి లేనిది ఉన్నట్లుగా చూపించారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. అబద్ధాలు కూడా అధికారపక్షం ఇంత గొప్పగా చెబుతుందనుకోలేదని మండిపడ్డారు. శాసనసభలో శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ గురించి ప్రభుత్వం చెబుతున్న విషయాలకు, వాస్తవాలకు పొంతనే లేదని గణాంకాలతో సహా వివరించారు. ‘‘2011-12లో వ్యవసాయ రుణాలుగా రూ. 31,877 కోట్లను రైతులకు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంటే రూ. 35,611 కోట్లు ఇచ్చామనీ, 2012-13లో రూ. 35,854 కోట్లను వ్యవసాయ రుణాలుగా పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే రూ. 50,060 కోట్లు ఇచ్చామని.. 2013-14లో  వ్యవసాయ రుణాలుగా రూ. 47,017 కోట్లను ఇవ్వాలనుకుంటే రూ. 49,774 కోట్లను పంపిణీ చేశామని చంద్రబాబుకు బ్యాంకర్లు వివరించారు. కానీ.. 2014-15 పరిస్థితి చూస్తే రూ. 56,019 కోట్లను వ్యవసాయ రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే 30 సెప్టెంబర్ 2014 నాటికి కేవలం రూ. 13,789 కోట్లను మాత్రమే పంపిణీ చేశామని ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకర్లు సీఎంకు చెప్పారు’’ అని గుర్తుచేశారు.





‘‘సీఎం అధ్యక్షతన జరిగిన 188వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో.. 31 మార్చి 2012 నాటికి రూ. 65,217 కోట్లు, 31 మార్చి 2013 నాటికి రూ. 78,916 కోట్లు, 31 మార్చి 2014 నాటికి రూ. 87,612 కోట్లు ఉన్న వ్యవసాయ రుణాలు 30 సెప్టెంబరు 2014 నాటికి తడిసిమోపెడై రూ. 99,555 కోట్లకు చేరుకున్నాయి అని బ్యాంకర్లు చెప్పారు’’ అని జగన్ వెల్లడించారు. రుణమాఫీకి గత ఏడాది రూ. 4,600 కోట్లు కేటాయించగా... అవి కనీసం వడ్డీలకూ సరిపోవని జగన్ విమర్శించారు. ఈ ఏడాది రూ. 4,700 కోట్లు కేటాయించామని చెబుతున్నా చంద్రబాబు మాటలను బట్టిచూస్తే రూ. 2,100 కేటాయించారని అర్థమవుతోందని, ఇవి కూడా వడ్డీకి సరిపోవన్నారు.





బంగారం వేలం నోటీసులే..

ఏ పత్రిక జిల్లా ఎడిషన్ చూసినా బంగారం వేలం వేస్తున్నట్లు బ్యాంకులు ఇచ్చిన ప్రకటనలే ఎక్కువగా కనపడుతున్నాయని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘‘వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని.. జాబు రావాలంటే బాబు రావాలని.. ఒక్కొక్కరికి నిరుద్యోగ భృతిగా నెలకు రూ. రెండు వేలు చొప్పున పంపిణీ చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తనకు పూర్తిగా అవగాహన ఉండే ఆ హామీలను ఇచ్చానని 11 ఏప్రిల్, 2014న ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ కూడా రాశారు. ప్రతి మీటింగ్‌లోనూ ఇదే హామీలు ఇచ్చారు.





టీవీ ఆన్ చేస్తే చాలు.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలి.. జాబు రావాలంటే బాబు రావాలి.. అనే ప్రకటనలు వచ్చేవి. ఏ గోడ మీద చూసినా ఇదే రకమైన రాతలు కన్పించేవి. అంతే కాదు.. ‘దేశం బాగుండాలంటే రైతులు బాగుండాలి. అందుకే వ్యవసాయ రుణాల రద్దుపై తొలి సంతకం చేస్తాను. కుటుంబం సంతోషంగా ఉండాలంటే అక్కాచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి. అందుకే డ్వాక్రా రుణాలను పూర్తిగా రద్దు చేస్తాను. జాబు కలలను సాకారం చేయడానికి ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి కింది నెలకు రూ. రెండు వేలు ఇస్తాం’ అని రాసి, చంద్రబాబు సంతకంతో కూడిన లేఖను టీడీపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అందించారు. ఆ మాటలను ప్రజలు నమ్మి చంద్రబాబును సీఎంను చేశారు. అధికారం వచ్చాక.. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే.. చంద్రబాబు అఫిషియల్ గెజిట్ ఈనాడు పేపరుకు ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చింది. దాంట్లో.. 1. వ్యవసాయ రుణాల రద్దు 2. డ్వాక్రా రుణాల రద్దు 3. ఇంటికో ఉద్యోగం అనే హామీలకు ప్రముఖ స్థానం కల్పించారు. కానీ ఇప్పుడు.. ఒక్క హామీనీ నిలబెట్టుకోలేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయాన్ని అధికారపక్షం గమనించాలి. ఇదీ.. మీరు (టీడీపీ) రైతులకు చేసింది’’ అని విపక్ష నేత జగన్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు.





ఢిల్లీలో పరువు పోదా?

ఢిల్లీలో కూడా బాగా చదువుకున్నవారు, తెలివైనవారు ఉంటారని, బడ్జెట్‌లో చేసిన మాయను గుర్తిస్తే రాష్ట్రం పరువు పోతుందని హెచ్చరించారు. నాయకులుగా ఉన్న వారు ప్రజలకు మోసం, వంచన, వెన్నుపోటు నేర్పకూడదని హితవు పలికారు. ప్రణాళికేతర వ్యయం విషయంలో ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించిందన్నారు. 11 నెలల 27 రోజులకు సంబంధించిన మొత్తం వ్యయం వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, దాని ప్రకారం 2014-15లో మొత్తం బడ్జెట్ రూ. 85 వేల కోట్లకు మించే అవకాశం లేదన్నారు. కానీ రివైజ్డ్ బడ్జెట్‌లో రూ. 1.12 లక్షల కోట్లుగా చూపించడంలో అంతరార్థమేంటని ప్రశ్నించారు. కేవలం కేంద్రం నుంచి నిధులు రాబట్టడం కోసమే 2014-15లో ప్రణాళికేతర వ్యయాన్ని ఎక్కువ చేసి చూపారని, ఇప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టే 2015-16లో దీన్ని రూ. 11 వేల కోట్ల మేర తగ్గించారన్నారు. న్యాయంగా రాష్ట్రానికి దక్కాల్సిన నిధుల్ని రాబట్టడానికి కలిసొస్తామని తాము చెబుతున్నామని, పోరాడి హక్కులను సాధించుకుందామని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు.





ఆగిపోయిన 5.6 లక్షల ఇళ్లు

బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన శాంపిల్ సర్వే చేశామని, అందులో 4 శాతం అనర్హులున్నారని గుర్తించామని గృహ నిర్మాణ శాఖ మంత్రి గతంలో సభలో చెప్పిన విషయాన్ని విపక్ష నేత గుర్తు చేస్తూ.. ఇప్పుడేమో మాటమార్చి జియోట్యాగింగ్ చేసిన తర్వాత 41 శాతం ఇళ్లు కనిపించడం లేదంటున్నారని విమర్శించారు. ఇంతగా అబద్ధాలు చెబితే ఎలా? అని ప్రశ్నించారు. మొత్తం ఇళ్లే లేవని చెప్పేస్తే పోలా? అని ఎద్దేవా చేశారు.





2014 ఆగస్టు 12న ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు (ఈవో నోట్) ప్రకారం.. మంజూరైనా ఇంకా ప్రారంభం కాని 7.9 లక్షల ఇళ్లను రద్దు చేస్తున్నామని, 5.6 లక్షల ఇళ్లకు చెల్లింపులు చేయవద్దని అందులో ఆదేశించారని చెప్పారు. ఒక్కో ఇంటికి రూ. 50 వేలు ఇవ్వాల్సి వచ్చినా, 5.6 లక్షల ఇళ్లకు కనీసం రూ. 2,800 కోట్లు కావాలని, కానీ బడ్జెట్‌లో దానికి కేటాయించింది కేవలం రూ. 656 కోట్లేనన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం గతేడాది బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. 520 కోట్లు కేటాయించి, ఒక్క ఇంటినీ నిర్మించని విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ఏడాది కేటాయింపులు నిర్మాణంలో ఉన్న ఇళ్ల ఒక విడత బిల్లులు చెల్లించడానికీ సరిపోవన్నారు.

 



పెన్షన్ల సంఖ్యను వైఎస్ పెంచారు

సామాజిక పెన్షన్ల కోసం కేంద్రం రూ. 400 ఇస్తే, వైఎస్ రూ. 200 ఇచ్చారని ఆర్థిక మంత్రి చేస్తున్న విమర్శలకు ప్రతిపక్ష నేత స్పందించారు. రోజుకు రూ. 27 పైబడిన సంపాదన ఉన్న కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు కాదంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను దివంగత నేత రాజశేఖరరెడ్డి సవరించారని, వార్షిక ఆదాయం రూ. 60 వేలు ఉన్న వారిని కూడా పేదలుగానే గుర్తించి పెన్షన్లు మంజూరు చేసిన విషయాన్ని అధికారపక్షం ఉద్దేశపూర్వకంగా మరిచిపోతోందని జగన్ విమర్శించారు. మార్గదర్శకాలను మార్చి పెన్షన్ల సంఖ్యను 17 లక్షల నుంచి 78 లక్షలకు వైఎస్ పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్రంలో 43,13,292 పెన్షన్‌దారులు ఉన్నారు. పెన్షన్ల కోసం జన్మభూమిలో 4,10,278 దరఖాస్తులు వచ్చాయి.





అందులో 3,85,892 పెన్షన్లు పెండింగ్‌లో ఉన్నట్లు సీఎం కోర్ డాష్ బోర్డు చెబుతోంది. వీటన్నింటినీ కలుపుకుంటే.. రాష్ట్రంలో 47 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలి. మార్చి నెలలో 37,85,376 మందికి రూ. 402 కోట్లను పెన్షన్‌గా మంజూరు చేశారు. అంటే.. పది లక్షల మందికి పెన్షన్లు కట్ చేశారు. పోనీ.. ఆ 37 లక్షల మందికైనా పంపిణీ చేయడానికి బడ్జెట్‌లో సక్రమంగా నిధులు కేటాయించారా అంటే అదీ లేదు. నెలకు రూ. 402 కోట్ల లెక్కన 12 నెలలకు రూ. 4,800 కోట్లు పైబడి అవసరం. కానీ.. బడ్జెట్‌లో కేవలం రూ. 3,741 కోట్లే కేటాయించారు. అంటే.. పెన్షన్లకు అవసరమైన మొత్తంలో కూడా రూ. 1,100 కోట్లు కోతపెట్టారు’’ అని ప్రభుత్వంపై విపక్ష నేత విమర్శలు గుప్పించారు.

 



డ్వాక్రాల విషయంలో గతం పునరావృతం

డ్వాక్రా సంఘాలకు ఆధ్యులమని టీడీపీ నేతలు గొప్పగా చెప్పుకోవడాన్ని జగన్ ఎద్దేవా చేశారు. ‘‘గతంలో చంద్రబాబు హయాంలో డ్వాక్రా సంఘాలకు 14-18 శాతం వడ్డీకి రుణాలు ఇచ్చే వారు. అప్పుడు 1,26,717 డ్వాక్రా సంఘాలు ఉండగా, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. వైఎస్ హయాంలో 2,86,780 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు గత పాలన పునరావృతమవుతోంది. డ్వాక్రా అక్కచెల్ల్లెమ్మలు 14-18 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తోంది’’ అని వివరించారు. ‘‘మార్చి 31, 2014 నాటికి డ్వాక్రా మహిళలు రూ. 14,204 కోట్లను బ్యాంకులకు బకాయిపడ్డారు.





డ్వాక్రా రుణాలను రద్దు చేస్తానని చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మి అక్కచెల్లెమ్మలు మోసపోయారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళల రుణాల్లో రూ. 3,542 కోట్లు నిరర్థక ఆస్తులు (నాన్ పెర్‌ఫార్మింగ్ అసెట్స్)గా మిగిలిపోయాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. 2014-15లో డ్వాక్రా మహిళలకు రూ. 13,791 కోట్ల రుణాలను పంపిణీ చేస్తామని 184 ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకర్లు చంద్రబాబుకు వివరించారు.





కానీ, 30 సెప్టెంబర్ 2014 నాటికి డ్వాక్రా మహిళలకు రూ. 2,028 కోట్లను మాత్రమే రుణాలుగా పంపిణీ చేశారంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో తెలుస్తోంది. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు. దాని కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించిన దాఖలాలు ఎక్కడా కనిపించ లేదు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కోసం.. ఈ ఏడాది రుణంగా పంపిణీ చేసిన రూ. రెండు వేల కోట్లకు ఏడు శాతం వడ్డీపై రూ. 140 కోట్లు, రూ. 12 వేల కోట్ల పాత రుణాలపై 14 శాతం వడ్డీ లెక్క వేస్తే రూ. 1,680 కోట్లు కలిపి కనీసం రూ. 1,820 కోట్లను కేటాయించాలి. కానీ.. వడ్డీ లేని రుణాల కోసం బడ్జెట్‌లో కేటాయించింది సున్నా’’ అని జగన్ దుయ్యబట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top