జగన్ దీక్షకు మద్దతు వెల్లువ

జగన్ దీక్షకు మద్దతు వెల్లువ - Sakshi


* జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లిన ముఖ్య నేతలు

* స్వచ్ఛందంగా సంఘీభావం తెలిపిన పార్టీ శ్రేణులు, ప్రజలు

* ప్రభుత్వ తీరును ఎండగట్టిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


సాక్షి ప్రతినిధి తిరుపతి:  వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు మద్దతుగా   జిల్లా నుంచి పెద్ద ఎత్తున పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, మహిళలు, రైతులు స్వ చ్ఛందంగా తరలివెళ్లారు. వంచించిన ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన నిలదీసేందుకు చేస్తున్న దీక్షకు సంఘీభావాన్ని తెలిపారు. ముఖ్యంగా జిల్లా నుంచి వెల్లువలా పార్టీశ్రేణులు తరలడం విశేషం.



మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజం పేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాద్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు  ఎమ్మెల్యే  నారాయణస్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా, మదనపల్లె ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతలరామచంద్రారెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్,  చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ నాయకురాలు సామాన్యకిరణ్, సత్యవేడు నియోజక వర్గ  సమన్వయకర్త  ఆదిమూలం,   ట్రేడ్‌యూనియన్ జిల్లా నాయకుడు బీరేంద్ర వర్మ, పార్టీ ముఖ్య నేతలు రెడ్డిశేఖర్‌రెడ్డి, చక్రపాణిరెడ్డి, పోకల అశోక్‌కుమార్, మునిశేఖర్‌రెడ్డి, మునిరత్నం, బాజ్జాన్‌తో పాటు పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు, మహిళలు తణుకులో జరిగిన దీక్షలో పాల్గొన్నారు.

 

బాబు రియల్ వ్యాపారం- పెద్దిరెడ్డి

చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఉన్నారా? లేరా? అనే అనుమానం కలుగుతోందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఆయన తణుకు దీక్ష శిబిరంలో ప్రసంగిస్తూ  కేంద్రం పదేళ్ల   పాటు హైదరాబాద్ నుంచి  పాలన కొనసాగించుకోవచ్చని చెప్పినా, రెండేళ్లలో రాజధాని కడతామంటూ గుంటూరు జిల్లా రైతులను పారదోలే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చాలా ఇబ్బందుల్లో ఉన్నామని, జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నామని మోసం చేస్తూ ఎన్నికల హామీలను తుంగలో తొక్కడంతో పాటు పన్నులు పెంచుతూ  పథకాల్లో కోత పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.



రాజధాని పేరుతో రియల్ వ్యాపారం చేస్తూ లక్షల కోట్ల రూపాయలు దోచుకునేందుకు ప్రణాళికను రచిస్తున్నారన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం వరదలతో అతలాకుతలం అయ్యిందని ,  కరువుతో  నీళ్లు లేక రాయలసీమ ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అవుతారని, మనందరి కష్టాలు తీర్చుతారని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా తిరుపతి ఎంపీ వరప్రసాద్, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ నాయకురాలు సామాన్య కిరణ్,చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి, రాష్ట్రకార్యదర్శి పోకల ఆశోక్ కుమార్ దీక్ష శిబిరంలో ప్రసంగించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top