బాబు వాగ్దాన భంగంపై... ఇక యుద్ధమే!


* తణుకు దీక్షలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

* చంద్రబాబు తీరు వల్ల రాష్ట్రంలో రైతులు రూ. 11,943 కోట్లు అపరాధ రుసుం కట్టాల్సి వస్తోంది

* ఈ ఏడాది రైతులకు రూ. 56 వేల కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యమైతే రూ. 13 వేల కోట్లే ఇచ్చారు

* మిగతా రూ. 43 వేల కోట్లు రైతులు అధిక వడ్డీకి ప్రైవేట్ వ్యాపారుల నుంచి అప్పు తెచ్చుకున్న దుస్థితి

* అప్పుల బాధ భరించలేక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నా బాబు ఒప్పుకునే పరిస్థితి లేదు

* ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల్సి వస్తుందని ఆయన ఒప్పుకోవట్లేదు



తణుకు రైతు దీక్షా శిబిరం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘చంద్రబాబు పుణ్యాన ఈ రోజు రాష్ట్రంలో రైతులు ఎంతో దారుణ పరిస్థితుల్లో ఉన్నారు. రుణాలు మాఫీ కాలేదు.. బ్యాంకులు కొత్త రుణాలివ్వలేదు.. పంటల బీమా రాలేదు.. సున్నా శాతం వడ్డీ రుణాలు పోయి.. 14 శాతం వడ్డీతో రుణాలు కట్టాల్సి వస్తోంది.. కరువొచ్చినా ఇన్‌పుట్ సబ్సిడీ ఊసు లేదు.. రెండు, మూడు రూపాయల వడ్డీలకు ప్రైవేట్ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి. పండించిన పంటకు కనీస మద్దతు ధర లేదు. వచ్చిన ధరకు అమ్ముకున్నా.. ఆ చెక్కులు తీసుకుని బ్యాంకుకు పోతే పాత బాకీ లో జమ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో రైతులు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటే.. ఆ ఆత్మహత్యలను ఒప్పుకుంటే రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల్సి వస్తుందని బాబు ఒప్పుకోవడం లేదు’’ అని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.



డ్వాక్రా రుణాలపై వడ్డీల మీద వడ్డీలు కట్టలేక డ్వాక్రా అక్కచెల్లెళ్లు ఎన్నో అవస్థలు పడుతున్నార న్నారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న సీఎం చంద్రబాబుపై తమ పోరాటం ఇంతటితో ఆగదని ఉద్ఘాటించారు. బాబు మనసు మార్చుకుని హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఏపీలో తీవ్ర ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. బాబు మెడలు వంచైనా రైతు, డ్వాక్రా రుణమాఫీ సాధించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పాటు సాగించిన దీక్షను ఆదివారం సాయంత్రం విరమించారు.



ఈ సందర్భంగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎన్నికల హామీల విషయంలో బాబు తీరుపై నిప్పులుచెరిగారు. చంద్రబాబు గత పాలనలో ఖజానా ఖాళీ అయిందంటూ ప్రజలపై మోపిన పెను పన్నుల భారాన్ని జగన్ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, రీయింబర్స్‌మెంట్ నిధులు ఎగ్గొట్టడానికి, ప్రజా సంక్షేమ పథకాలకు కోత పెట్టడానికి, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ అమలును కత్తిరించడానికి.. ముందస్తు ఎత్తుగడగానే ఖజానా ఖాళీ అయిందంటూ బాబు ప్రచారం చేస్తున్నారని తూర్పారబట్టారు. నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన వారందరికీ ఈ సందర్భంగా జగన్ కృతజ్ఞతలు తెలిపారు. దీక్షా వేదికపై జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...



తొలి ఐదు సంతకాలు ఏమాత్రం అమలయ్యాయి?

‘‘నేనడుగుతున్నా చంద్రబాబును.. ఎంతమం ది డ్వాక్రా అక్కచెల్లెళ్లకు రుణ మాఫీ చేశావు? ఎంతమంది రైతులకు రుణ మాఫీ చేశావు? దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఒక మాట చెప్పి ఆ మేరకు తొలి సంతకం పెడితే మరుసటి రోజే అన్నీ మాఫీ అయ్యాయి. సంతకం పెడితే శాసనంగా మరుసటి రోజే అమలవుతుందని జనం నమ్ముతారు. కానీ చంద్రబాబు సీఎంగా ప్రమాణ  స్వీకారం సందర్భంగా పెట్టిన తొలి ఐదు సంతకాలు ఏ మాత్రం అమలు కాలేదు. ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలవుతోంది. హామీలు నెరవేర్చలేక ఒక అబద్ధాన్ని కప్పి పుచ్చుకోవడానికి చంద్రబాబు రోజుకో కొత్త అబద్ధం చెబుతున్నాడు.’’



రుణ మాఫీ లేదు.. కొత్త రుణాలు లేవు...

‘‘చంద్రబాబు పుణ్యాన ఈ రోజు రాష్ట్రంలో రైతులు ఎంతో దారుణ పరిస్థితిలో ఉన్నారు. రుణాలు మాఫీ కాలేదు, కొత్త రుణాల కోసం రైతులు బ్యాంకుల గడప తొక్కే పరిస్థితి లేదు. పంటల బీమా రాలేదు, సున్నా శాతం వడ్డీ రుణాలు పక్కకుపోయి 14 శాతం వడ్డీతో రుణాలు కట్టాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. రైతు పండించే పంటకు కనీస మద్దతు ధర లేదు. ఎరువులు సక్రమంగా అందడం లేదు. ఇన్‌పుట్ సబ్సిడీ లేదు. 285 రూపాయలున్న బస్తా ఎరువు ఇదే తణుకులో ఇదే రోజు రూ. 400 నుంచి రూ. 450 పెట్టి బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరువొచ్చినా బాబు ఇన్‌పుట్ సబ్సిడీ గురించి ఒక్క మాట మాట్లాడటం లేదు.  రైతు పండించిన ధాన్యం కొనుగోలుకు చెక్కులు ఇస్తే వాటిని తీసుకుని రైతులు బ్యాంకుకు పోతే పాత బాకీలో జమ చేసుకుంటున్నారు. బ్యాంకులు బంగారాన్ని వేలం వేస్తుంటే చంద్రబాబు నోటినుంచి ఒక్క మాట రావడం లేదు.’’



ఆత్మహత్యల గురించీ ఒప్పుకునే పరిస్థితి లేదు...

రాష్ట్రంలో రైతులు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటే ఆత్మహత్యల గురించి కూడా చంద్రబాబు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఒప్పుకుంటే ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల్సి వస్తుందని ఆయన ఒప్పుకోవడం లేదు. రాష్ట్రంలో ఉపాధి పనులు లేవు. అప్పులు పుట్టక రైతులు, వ్యవసాయ కూలీలు వలసలు పోతుంటే చంద్రబాబు నోట ఒక్క మాట రావడం లేదు.’’



పంచ పాండవులు మంచం కోళ్లు సామెతలా చేశారు...

‘‘రైతు రుణాల మీద చంద్రబాబు నోటి వెంట వచ్చిన మాఫీ మాట చూస్తే.. ‘పంచ పాండవులు మంచం కోళ్లలా ముగ్గురు అంటూ రెండు వేళ్లు చూపినట్లు’ ఉంది. మొట్టమొదట కోటయ్య కమిటీ అన్నారు. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంకుతో మాట్లాడి రుణాలు రీషెడ్యూల్ చేయిస్తానన్నారు. ఆ తర్వాత రైతు సాధికార సంస్థ ద్వారా రూ. 5,000 కోట్లు రుణ మాఫీకి ఇస్తామన్నారు. ఆ తర్వాత ఆధార్‌తో ముడిపెట్టారు. ఆ తర్వాత రేషన్ కార్డు ఉంటేనే మాఫీ అన్నారు. ఒక బ్యాంకులో ఒక ఖాతాకే అనీ, ఒక గ్రామంలో ఒక పంటకే అనీ అన్నారు. ఆ తర్వాత స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు.



చంద్రబాబు సీఎం కాక ముందు రైతులు ఎవరికైనా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే తెలుసా? (తెలీదని జనం సమాధానం చెప్పారు.) అది బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ప్రాతిపదికగా పెట్టుకుంటే, చంద్రబాబు దాన్ని రైతు రుణ మాఫీ కత్తిరించడానికి పెట్టుకున్నాడు. లోన్లు కత్తిరించడానికి కుటుంబానికి ఒకే లోను మాఫీ అనీ, లక్షన్నర వరకే మాఫీ అనీ, ఉద్యాన పంటలకు మాఫీ లేదని అన్నాడు. ఇన్ని మాటలు చెప్పి చంద్రబాబు చివరకు ఏం చెప్పారంటే మీ రుణాలు మీరే కట్టుకోండన్నారు.’’



హైదరాబాద్‌లో ఆధార్ ఉన్న బాబు ఇక్కడ సీఎం ఎలా అయ్యారు?

‘‘ఉద్యోగం కోసమో, సద్యోగం కోసమో, పిల్లల చదువుల కోసమో ఇక్కడున్న భూములు కౌలుకు ఇచ్చి హైదరాబాదుకు పోతే అక్కడ ఉన్న వారు రైతులే కాదన్నారు. చంద్రబాబు వేసిన ఓటు హైదరాబాదులో, ఓటరు ఐడీ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు హైదరాబాదులోనే ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఇక్కడ సీఎం ఎలా అయ్యారు?’’



రెండు రాష్ట్రాల్లో రుణాలన్నీ మాఫీ చేస్తానన్నారు...

‘‘చంద్రబాబు సీఎం కాక ముందు రైతుల అప్పులెంత? డ్వాక్రా రుణాలు ఎంత? అన్నది చదువుకున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. బాబు సీఎం కాక ముందు రూ. 87,612 కోట్ల రైతు రుణాలు, రూ. 14,204 కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ మీటింగ్ చెప్పింది. ఇవన్నీ తెలిసే బాబు తన ఎంపీలతో ఓట్లు వేయించి రాష్ట్రాన్ని విడగొట్టించారు. ఇదే బాబు టీడీపీ ఆఫీసులో రెండు మేనిఫెస్టోలు చూపించి 2 రాష్ట్రాల్లోని రైతులు, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానన్నారు.



వనరుల గురించి తనకు పూర్తి అవగాహన ఉందనీ, ఈ రుణాల మాఫీకి తాను పూర్తి బాధ్యత తీసుకుంటానని ఈసీకి బాబు లేఖ రాశారు. ఎన్నికల సభల్లో రైతు, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పారు. ఇంట్లో టీవీ ఆన్ చేసి చూస్తే.. ‘బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలి, జాబు కావాలంటే బాబు రావాలి’ అని కనిపించింది. గ్రామాల్లో గోడల మీద, ప్రతి మీటింగ్‌లోనూ ఇవే మాటలు కనిపించి, వినిపించాయి. బాబేమో సీఎం అయ్యాడు. ఆయన వస్తే ఉద్యోగం వస్తుందని ఆశగా ఎదురు చూసిన యువకులు ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది.’’



బాబు తీరు వల్ల రూ. 11,943 కోట్ల అపరాధ రుసుం

‘‘చంద్రబాబు సీఎం కాక ముందు రాష్ట్రంలో 87,612 కోట్ల రైతు రుణాలున్నాయి. ఆయన సీఎం అయ్యాక సెప్టెంబర్ 30న జరిగిన 188వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ మీటింగ్ ఈ రుణాలు రూ. 99,555 కోట్లు అయ్యాయని చెప్పింది. అంటే చంద్రబాబు తీరు వల్ల రూ. 11,943 కోట్లు రైతులు అపరాధ రుసుం కట్టాల్సి వస్తోంది. దీనికి బాధ్యుడు చంద్రబాబు కాదా? ఈ ఏడాది రాష్ట్రంలో రైతులకు రూ. 56 వేల కోట్లు రుణాలు ఇవ్వాలని బ్యాంకులు కార్యాచరణ పెట్టారు. ఇప్పటికి తొమ్మిది నెలలైంది. ఖరీఫ్,రబీ సీజన్లు అయిపోతున్నాయి. ఇప్పటి దాకా కేవలం రూ. 13 వేల కోట్లే ఇచ్చారు. అంటే మిగిలిన రూ. 43 వేల కోట్ల అప్పుల కోసం రైతులు బయట రెండు, మూడు రూపాయల వడ్డీకి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.’’



డ్వాక్రా అక్కచెల్లెళ్లు అప్పులు కట్టలేక చేతులెత్తేశారు...

డ్వాక్రా మహిళలకు రూ. 12,274 కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకులు నిర్ణయిస్తే ఇప్పటి దాకా కేవలం రూ. వెయ్యి కోట్లే రెన్యువల్ అయ్యింది. వడ్డీల మీద వడ్డీలు కట్టలేక డ్వాక్రా అక్క చెల్లెళ్లు అప్పులు కట్టలేక చేతులెత్తేశారు. చంద్రబాబు సీఎం కాక ముందు రాష్ట్రంలో 5 లక్షల సంఘాలు ఏ-గ్రేడ్‌లో ఉండేవి. ఇప్పుడు కేవలం 708 సంఘాలు మాత్రమే ఏ-గ్రేడ్‌లో ఉన్నాయంటే అక్క, చెల్లెళ్ల పరిస్థితి ఏమిటో ఇంత కంటే ఉదాహరణ కావాలా? ఒక డ్వాక్రా సంఘానికి ఏ-గ్రేడ్ రావాలంటే 11 రకాల ప్రామాణికాలు తీసుకుంటారు. 70 శాతం మార్కులు రావాలి. ఇవాళ మిమ్మల్నే ప్రశ్నిస్తాను. సమాధానం ఇవ్వాలి. మీ వ్యవసాయ రుణాలు రద్దయ్యాయా? బ్యాంకుల్లోని మీ బంగారం ఇంటికొచ్చిందా? మీకు ఈ ఏడాది బ్యాంకు రుణాలు వచ్చాయా? పంటల బీమా వచ్చిందా? వడ్డీ అయినా మాఫీ అయ్యిందా? డ్వాక్రా మహిళలను అడుగుతున్నా.. మీకు ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా?’’



రైతులు, మహిళలను రానీయకుండా పాదయాత్ర చేశారు

చంద్రబాబు నోట్లో ఒక్క నిజం వచ్చినా ఆయన తల వెయ్యి ముక్కలవుతుందని మునిశాపం ఉంది. అందుకే ఆయన నిజం చెప్పరు. చంద్రబాబుకు ఎంత సిగ్గు లేదంటే, చంద్రబాబు ఈ జిల్లాలోనే (పశ్చిమగోదావరి) పాదయాత్ర చేశారు. పాదయాత్ర ఎలా చేశారంటే రుణ మాఫీ గురించి అడక్కుండా రైతులను, రుణ మాఫీ గురించి నిలదీయకుండా డ్వాక్రా మహిళలను, ఉద్యోగం ఎప్పుడిస్తావని నిలదీయకుండా యువకులను, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల గురించి అడక్కుండా విద్యార్థులను.. తన దగ్గరకు రానీయకుండా పోలీసులు, టీడీపీ నాయకులను చుట్టూ పెట్టుకుని పాదయాత్ర చేశారు.’’



రాబోయే రోజుల్లో షాక్ కొట్టేలా పన్నులు పెంచడానికే..

‘‘చంద్రబాబు గతంలో కూడా మద్య నిషేధం అని చెప్పి ఎన్నికల తర్వాత ఖజానా ఖాళీ అయ్యిందని చెప్పి రూ. 30 వేల కోట్ల బడ్జెట్ ఉన్న 1996లోనే ఒక్కసారిగా రూ. 2,150 కోట్ల పన్నులు వేశారు. నీటి తీరువా 300 శాతం, ప్రతి ఎకరాకు బస్తా ధాన్యం నీటి తీరువా కింద ఇవ్వాలని చెప్పాడు. వ్యవసాయానికి హార్స్‌పవర్ రూ. 50 ఉన్న కరెంటు చార్జీని రూ. 625కు పెంచాడు. ఇవాళ కూడా నాకు అదే భయమేస్తోంది. ఇప్పుడూ ఖజానా ఖాళీ అయ్యిందనీ, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని అంటున్నారు.



ఎందుకంటున్నారంటే.. రైతు, డ్వాక్రా రుణాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, అవ్వా తాతల పింఛన్లు, సంక్షేమ పథకాలకు కోత వేసేందుకు, నిరుద్యోగ భృతి చెల్లించకుండా మోసగించేందుకు ఈ మాటలు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో షాక్ కొట్టే విధంగా పన్నులు పెంచడానికి, ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పీఆర్‌సీని కత్తిరించడానికి ఈ మాటలు అంటున్నాడు. చంద్రబాబు సీఎం కాక ముందు ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలైతే నేడు మూడు వేలయ్యింది. గత ప్రభుత్వాలు వదిలేసిన రైతుల కరెంటు బిల్లులు కూడా చంద్రబాబు వసూలు చేయిస్తున్నాడు.’’



అంతా ఒక్కటై ఒత్తిడి తెస్తేనే.. కాస్తో కూస్తో చేస్తాడు...

‘‘చంద్రబాబు ఇవన్నీ చేస్తాడు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ చస్తే చేయడు. అంతా ఒక్కటై ఒత్తిడి చేస్తేనే కాస్తో, కూస్తో అయినా చేస్తాడు. చంద్రబాబు మెడలు వంచైనా రుణ మాఫీ సాధించుకుందాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. చంద్రబాబు మనస్తత్వం మారకపోతే మెడలు వంచైనా సాధించుకునే రీతితో ఆందోళన చేస్తాం. రెండు రోజుల నుంచి నిరాహార దీక్ష జరుగుతున్నా చికాకు లేకుండా చక్కని నవ్వుతో వచ్చి సంఘీభావం తెలిపిన వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.’’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top