అన్నదాత నేస్తం ! మీ వెంటే మేమంతా..

అన్నదాత నేస్తం !  మీ వెంటే మేమంతా.. - Sakshi


జగన్ రెండురోజుల దీక్షకు సైదోడు కానున్న జిల్లా

పార్టీ రహితంగా మద్దతు పలుకుతున్న రైతులు

నేడు మధురపూడి చేరుకుని, తణుకు వెళ్లనున్న వైఎస్సార్ సీపీ అధినేత


 

కాకినాడ : రుణమాఫీ హామీతో ప్రలోభపెట్టి, గద్దెనెక్కి, ఆనక అన్నదాతలను హతాశులను చంద్రబాబు సర్కార్ వంచనను ఎండగట్టేందుకు తణుకులో చేపట్టనున్న రెండురోజుల దీక్షాసమరంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సైదోడుగా నిలిచేందుకు ‘తూర్పు’ పార్టీ శ్రేణులు, రైతులు, అభిమానులు సన్నద్ధమయ్యారు. ఇంతవరకు జగన్‌ప్రజల పక్షాన  చేపట్టిన అన్ని ఆందోళనల్లోనూ జిల్లా వెన్నంటి నిలుస్తూనే ఉంది. అదే వరవడి తణుకు దీక్ష సందర్భంగానూ కొనసాగనుంది.



జగన్ హైదరాబాద్ నుంచి విమానంలో శనివారం ఉదయం 10 గంటలకు మధురపూడి ఎయిర్‌పోర్టుకు రానున్నారు. అక్కడి నుంచి రైతులు, పార్టీ నేతలు వెంట రాగా తణుకులో దీక్షా శిబిరానికి చేరుకుంటారు. రైతుపక్షపాతిగా వారికి జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపి సంపూర్ణ రుణమాఫీ అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో జగన్ చేయనున్న దీక్షకు పార్టీరహితంగా జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లే ఏర్పాట్లలో  నిమగ్నమయ్యారు. జిల్లా నేతలు మధురపూడి ఎయిర్‌పోర్టుకు చేరుకుని జగన్ వెంట దీక్షా శిబిరానికి వెళ్లనున్నారు. రుణమాఫీ మోసంపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు, అనుబంధ విభాగాల కన్వీనర్లు, మండల, గ్రామ కన్వీనర్లు, ద్వితీయ శ్రేణి నేతలు గ్రామాల్లో  విస్తృతంగాప్రచారం నిర్వహించి రైతుల కు అవగాహన కల్పించారు. పలు రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. దీక్షకు మొదటి రోజు శనివారం కొత్తపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు, నాయకులు, పార్టీ శ్రేణులు తరలివెళ్లనున్నారు.  

 

దీక్షతో సర్కారుకు వణుకు ఖాయం : జ్యోతుల




రైతులను మోసగించిన చంద్రబాబు సర్కార్ మెడలు వంచైనా అన్ని వ్యవసాయ రుణాలనూ మాఫీ చేయించే లక్ష్యంతోనే జగన్ తణుకులో దీక్షకు ఉపక్రమిస్తున్నారని శాసనసభాపక్ష ఉపనేత, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తొలిరోజైన శనివారం కొత్తపేట నియోజకవర్గం నుంచి రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వారితో పాటు జిల్లానేతలు తణుకు తరలివెళ్లనున్నారని చెప్పారు. రెండో రోజు ఆదివారం జిల్లావ్యాప్తంగా రైతులు, పార్టీ శ్రేణులు తరలి వెళ్లి జగన్‌కు సైదోడుగా ఉంటాయన్నారు. చంద్రబాబు హామీని నమ్మి మోసపోయిన రైతులు.. పార్టీలను, జెండాలను పక్కనబెట్టి జగన్ దీక్షకు మద్దతుగా నిలుస్తున్నారన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షనేతగా జగన్ రుణమాఫీ కోసం రైతులు, డ్వాక్రా మహిళల పక్షాన నిరంతరం పోరాడుతున్నారన్నారు. అసెంబ్లీలో కూడా ఈ విషయంలో చంద్రబాబు సర్కార్ మోసాన్ని ఆయన ఎండగట్టినందునే దీక్షకు రైతులు పార్టీరహితంగా మద్దతు ఇస్తున్నారన్నారు. రెండు రోజుల దీక్షతో చంద్రబాబు సర్కార్ వెన్నులో వణుకుపుట్టడం ఖాయమన్నారు.   

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top