బాబు దగాపై దండెత్తుదాం: ప్రజలకు వైఎస్ జగన్ పిలుపు

బాబు దగాపై దండెత్తుదాం: ప్రజలకు వైఎస్ జగన్ పిలుపు - Sakshi


చంద్రబాబు రుణమాఫీ మోసంపై ప్రజలకు వైఎస్ జగన్ పిలుపు

నేటి నుంచి మూడు రోజులపాటు అన్ని గ్రామాల్లో బాబు దిష్టి బొమ్మల దహనం

రైతన్నలు, డ్వాక్రా అక్క చెల్లెమ్మల కోసం అన్ని పార్టీలూ ముందుకు రావాలని విజ్ఞప్తి

రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని బాబు రెండు రాష్ట్రాల్లోనూ హామీ ఇచ్చారు

రెండు రుణాలూ కలిపి ఏపీలోనే 1,01,816 కోట్లు ఉన్నట్లు బ్యాంకర్లు బాబుకే చెప్పారు

బాబేమో రూ.30, 35 వేల కోట్లే మాఫీ అంటున్నారు..     అదీ ఎప్పుడో చెప్పడం లేదు

సకాలంలో రుణం చెల్లించకపోతే రైతులపై పడే రూ.13 వేల కోట్ల వడ్డీ ఎవరు కడతారు?

బాబు పుణ్యామా అని రైతులు పంటల బీమానూ కోల్పోతున్నారు




చంద్రబాబు ఎన్నికలప్పుడు ప్రతి మీటింగులో ‘రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాను.    బాబు వస్తాడు.. జాబు వస్తుంది’ అని మాట్లాడారు. ఎన్నికలయిపోయాయి ప్రజలతో పనేముంది అని చెప్పి.. ఇవాళ కొత్త రుణాలు కావాలంటే పాత రుణాలు చెల్లించండి.. చెల్లించకపోతే మీ అవస్థలు మీరు పడండి అని చెప్తున్నారు. మీరే ఇవాళ రుణాలు చెల్లించండి.. ఆ తర్వాత కుదిరితే మేం ఇస్తామంటున్నారు. అంటే కుదరకపోతే మీరివ్వరనేగా దానర్థం.  సీఎం అయ్యాక  బాబు అధ్యక్షతన ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్ జరిగింది. దీనిలో వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లని, డ్వాక్రా రుణాలు 14,204 కోట్లని బ్యాంకర్లు నివేదికిచ్చారు. రెండూ కలిపితే మాఫీ చేయాల్సిన రుణాలు 1,01,816 కోట్లు ఉంటే.. మీరేమో రూ.30-35 వేల కోట్లే మాఫీ చేస్తాననడం మోసం కాదా?

- వైఎస్ జగన్




సాక్షి, హైదరాబాద్ : రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక వంచనకు పాల్పడుతున్న చంద్రబాబునాయుడుపై ఉద్యమించాలని, రుణాలన్నింటినీ మాఫీ చేసేలా ఆయనపై ఒత్తిడి తేవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ‘నరకాసుర వధ’ పేరుతో చంద్రబాబునాయుడి దిష్టి బొమ్మలను దహనం చేయనున్నట్లు చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతన్నలు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలు, పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మల కోసం అన్ని పార్టీలూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిందొకటి, అధికారంలోకి వచ్చాక చేస్తున్నదొకటి అని ధ్వజమెత్తారు. రుణ మాఫీపై రోజుకో విధంగా అబద్ధాలాడుతూ రైతులు, బ్యాంకుల చెవుల్లో పూలు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...

(రుణమాఫీపై చంద్రబాబు చేసిన ప్రసంగాల వీడియో క్లిప్పింగ్‌లను బుధవారం హైదరాబాద్‌లో మీడియాకు చూపుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో పార్టీ నేతలు సత్యారావు, సోమయాజులు)



ఎన్నికలు జరిగినప్పుడు నేను పదే పదే అంటూ వచ్చాను. ఈ ఎన్నికలు విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరిగే ఎన్నికలని చెప్పాను. నిన్న మొన్న జరిగిన పరిస్థితులను గమనిస్తే, చంద్రబాబునాయుడుగారి నోటి నుంచి వచ్చిన మాటలను ఒక్కసారి వింటే.. ఇది నిజమని చెప్పడానికి వేరే నిదర్శనం అవసరంలేదు. చంద్రబాబునాయుడుగారు మాటిమాటికీ అంటున్నారు.. రాష్ట్రం విడిపోయిందని, ఆర్థిక సంక్షోభం ఉందని, కాబట్టి తాను రుణాలు మాఫీ చేయలేకపోతున్నాడు అన్నట్టుగా రకరకాల సంజాయిషీలు, మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. రాష్ట్రం విడగొడుతున్నప్పుడు, అన్యాయం జరుగుతోందని తెలిసి కూడా దగ్గరుండి మరీ ఎందుకు ఓటు వేయించి రాష్ట్రాన్ని విడగొట్టాడని అడుగుతున్నా. చంద్రబాబులాంటి వ్యక్తి, జగన్‌లాంటి వ్యక్తి రాష్ట్ర పరిస్థితులెలా ఉంటోయో తెలియని వారు కాదు. చంద్రబాబుగారికి బాగా తెలుసు రాష్ట్ర పరిస్థితి ఏమిటని. తెలిసిన తర్వాతే, పార్లమెంటులో తాను స్వయంగా ఓటేసి రాష్ట్రానికి తిరిగొచ్చిన తర్వాత చంద్రబాబుగారు రెండు రాష్ట్రాలకు విడివిడిగా రెండు మేనిఫెస్టోలు విడుదల చేశారు. పూర్తిగా వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని రెండింట్లోనూ చెప్పారు. ఏ మేనిఫెస్టోలోను, ఏ సందర్భంలోనూ ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు. ఈ మేనిఫెస్టోలు విడుదల తర్వాత చంద్రబాబు ఏప్రిల్ 11న ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.



ఈ హామీలను నెరవేరుస్తానని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వనరుల మీద పూర్తి అవగాహన ఉందని ఆ లేఖలో చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబునాయుడుగారు తన మనుషులు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లేట్టు చేశారు. ‘అమ్మా మీకెంత రుణాలున్నాయమ్మా... మీ ఇంట్లో డ్వాక్రా రుణాలున్నాయా.. వ్యవసాయ రుణాలున్నాయా.. బంగారు రుణాలు తెచ్చి పెట్టుకున్నారామ్మా.. లేకపోతే బంగారం పెట్టి రుణాలు తెచ్చుకోండమ్మా.. మీకింకా రుణాలు వస్తాయమ్మా.. మీ ఇంట్లో ఇంత మందున్నారా.. 4 లక్షలు రుణాలు మాఫీ అవుతాయమ్మా.. చంద్రబుబునాయుడుగార్ని తెచ్చుకోండమ్మా.. మీ రుణాలన్నీ మాఫీ చేస్తారమ్మా’ అని చెప్పి ఇంటింటికీ  చంద్రబాబు సంతకం చేసిన కరపత్రం ఇచ్చారు. ఆ కరపత్రంలో ఆయనన్నారు.. ‘రైతుల రుణాలు మాఫీపైన నా మొట్టమొదటి సంతకం చేస్తాను. 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు ఇస్తాను. ప్రతి కుటుంబం బాగుండాలంటే నా అక్కచెల్లెమ్మలు బాగుండాలి. అందుకోసం డ్వాక్రా సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాను అని. ఇంకా.. ఇంటింటికీ ఒక ఉద్యోగం ఇస్తాను.. ఇవ్వలేకపోతే 2 వేల రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తానని దాంట్లో అన్నాడు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే రోజున ఈనాడు దినపత్రికలో వచ్చి పెద్ద ప్రకటనలో కూడా చంద్రబాబునాయుడుగారు ఇవే చెప్పారు.



రుణాల లెక్కలు బ్యాంకర్లు చెప్పారుగా..

వ్యవసాయ రుణాల రద్దు, డ్వాక్రా రుణాల రద్దు అనే మాటలకు వస్తే.. చంద్రబాబుగారికి, జగన్‌మోహన్‌రెడ్డిగారికి రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పడానికి అవకాశం లేదు. కారణమేమిటంటే ప్రతి మూడు నెలలకోసారి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) మీటింగులు జరుగుతుంటాయి. ఈ సమావేశాలకు ముఖ్యమంత్రే అధ్యక్షత వహిస్తారు. అక్కడ రుణాలపై నివేదికలు ఇస్తారు. నెట్‌లో ఉంటాయి. డౌన్‌లోడ్ చేస్తే వస్తాయి. (181, 184 ఎస్‌ఎల్‌బీసీ సమావేశాల నివేదికలను జగన్ చూపారు.) ఇవన్నీ తెలిసే చంద్రబాబుగారు ఎన్నికల వేళ తానివ్వాల్సిన హామీలన్నీ ఇచ్చారు. అదొక్కటే జరగలేదు.. చంద్రబాబునాయుడుగారు ఎన్నికలప్పుడు ఓ 50 మీటింగుల్లో మాట్లాడారు. రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పారు. బాబు వస్తాడు రుణాలన్నీ మాఫీ చేస్తాడు, బాబు వస్తాడు జాబు వస్తుందని ప్రచారం చేశారు. (బాబు ప్రచారం డీవీడీ కాపీలను జగన్ విలేకరులకు ప్రదర్శించారు). ఇక 184వ ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్‌కు ముఖ్యమంత్రిగా చంద్రబాబే అధ్యక్షత వహించారు. ఈ మీటింగ్‌లో రుణాలపై బ్యాంకర్లు చాలా స్పష్టంగా చెప్పారు. వ్యవసాయ రుణాలు 87,612 కోట్ల రూపాయలని, డ్వాక్రా రుణాలు  14,204 కోట్లు చెప్పారు. రెండూ కలిపితే 1,01,816 కోట్ల రూపాయలు. రుణాలు రెన్యువల్ కాలేదు కాబట్టి రైతులకు పంటల బీమా వర్తించదని అదే మీటింగ్‌లో బ్యాంకర్లు చెప్పారు.



రుణాలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఇంతవరకు పావలా వడ్డీకే రుణాలున్న పరిస్థితి నుంచి 12.5 శాతం నుంచి 13 శాతం వడ్డీలు కట్టవలసిన పరిస్థితిలోకి ఇవాళ రైతాంగం పోతోంది అని చెప్పారు. నేనడగదల్చుకున్నా చంద్రబాబునాయుడుగార్ని.. అయ్యా.. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మొత్తంగా 1,01,816 కోట్లు ఉన్నాయని బ్యాంకర్లు 184వ ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్‌లో మీకే చెప్పారు. దీన్ని మీరెందుకు తగ్గిస్తున్నారు అని నేను అడగదల్చుకున్నా. మీరెందుకయ్యా కోటయ్య కమిటీ వేశారు? మీ ఎజెండాని కోటయ్య కమిటీ చేత చెప్పించే ప్రయత్నం చేసి, ఎందుకు ఇవాళ మీరు పరిమితులు పెట్టి ఎందుకు రుణాలను తగ్గించే కార్యక్రమం చేస్తున్నారు? తెలంగాణ ప్రభుత్వం ఈ రకంగానే తాను చేయాల్సింది చేయకుండా.. కేవలం 2012-13లో తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని ఒక మంత్రి చెప్పేసరికి.. ప్రతి గ్రామంలో దిష్టిబొమ్మలు దహనం చేశారు. దిష్టి బొమ్మలు దహనం చేసిన వారిలో తెలుగుదేశం పార్టీ ఉంది. మేమూ ఉన్నాం. బీజేపీ ఉంది. కాంగ్రెస్ ఉంది. అన్నీ పార్టీలూ ఉన్నాయి. వెంటనే కేసీఆర్‌గారే వచ్చి.. మాట తప్పడంలేదని చెప్పారు. 2012-13లో తీసుకున్న రుణాలనే మాఫీ చేస్తామన్న మాట వెనక్కి తీసుకున్నారు. అక్కడ కేసీఆర్‌గారు మాట తప్పినప్పుడు.. మాట తప్పితే ఒప్పుకొనేది లేదు అన్చెప్పి మీరు అన్నారు. బీజేపీ అంది, మేమన్నాం.. ప్రతి ప్రతిపక్ష పార్టీ అంది. మరి మీ దాకా వచ్చేసరికి.. పట్టపగలు ఈ మాదిరిగా మీరు మోసం చేస్తుంటే.. దాదాపు లక్షా రెండు వేల కోట్లు ఉన్న రుణాలను 30, 35 వేల కోట్లకు తగ్గిస్తామని నిస్సిగ్గుగా మీరు చెప్తుంటే మీకు ఇది వర్తించదా?



ఏ కేసు పెట్టాలో మీ మనస్సాక్షిని అడగండి బాబూ

మొన్న శ్రీకాకుళం, ఇంకా పలు చోట్లకు వెళ్లినప్పుడు కార్యకర్తలు చెబుతున్నారు.. ఎవరైనా పిక్‌పాకెట్, మోసం చేస్తే 420 కేసు పెడ్తారన్నా.. మరి ఏకంగా చంద్రబాబునాయుడుగారు ప్రజల్ని మోసం చేసి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటే ఆయన మీద 420 కేసు పెట్టాలా.. లేక 840 కేసు పెట్టాలా అన్చెప్పి ప్రజలడుగుతున్నారని. చంద్రబాబునాయుడుగారి మీద ఏ కేసు పెట్టాలా అని చంద్రబాబునాయుడుగారే ఆయన గుండెల మీద చెయ్యేసి తన మనస్సాక్షిని అడగాలని నేను అడుగుతున్నాను.



కుదిరితేనే రుణాలు కడతామనడంలో అర్థమేమిటి?

ఇవాళ పరిస్థితి ఎలా ఉంది అంటే.. లక్షా రెండు వేల కోట్ల రూపాయల రుణాలను 30, 35 వేల కోట్లకు తగ్గిస్తున్నారు. అంటే.. 30, 35 శాతానికి తగ్గిస్తున్నారు. ఆ తగ్గించిన సొమ్ము కూడా ఎప్పుడిస్తున్నారు అంటే అదీ చెప్పరు. ఎలా ఇస్తారంటే దాని మీదా స్పష్టత ఉండదు. గతంలో మీరే రుణాలు చెల్లించవద్దు అని చెప్పారు. మొన్నటి దాకా బాబొస్తాడు.. రుణాలు చెల్లిస్తాడు అని చెప్పారు. ఆశ్చర్యమేమంటే రుణాలు చెల్లించండి అని ఇప్పుడు మీరే చెప్తున్నారు. ఎన్నికలయిపోయాయి ప్రజలతో పనేముంది అని చెప్పి.. ఇవాళ కొత్త రుణాలు కావాలంటే రుణాలు చెల్లించండి.. చెల్లించకపోతే మీ అవస్థలు మీరు పడండి అని చెప్తున్నారు. మీరే ఇవాళ రుణాలు చెల్లించండి.. ఆ తర్వాత కుదిరితే మేం ఇస్తామంటున్నారు. అంటే కుదరకపోతే మీరివ్వరనేగా దానర్థం. ఆ 30, 35 వేల కోట్లకు కూడా కుదిరినప్పుడు ఇస్తాం.. కుదరకపోతే మీ అగచాట్లు మీరు పడండి అని చెప్పకనే చెప్తున్నట్టే కదా! ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే.. రైతులకు కొత్త రుణాలు అందాలంటే పాతవి వడ్డీతో సహా కడితే తప్ప రెన్యువల్ కావు. మరి మీ మాట నమ్మి రుణాలు కట్టకుండా ఉన్న రైతులను ఆదుకోవాల్సిన మీరే రుణాల కట్టండి లేదా మీ తిప్పలు మీరు పడండి అనడం ఎంతమటుకు సమంజసం అని నేను అడుగుతున్నా. మభ్య పెట్టే కార్యక్రమం ఎంత దారుణంగా జరుగుతోందంటే.. ఒక వైపు డబ్బుల్లేవంటారు. 


రాజధాని కోసం హుండీలు పెడతారు. అంతటితో ఆగరు.. అడవుల్లో పెరుగుతున్న కోయని చెట్లను అమ్మడానికి వీల్లేదని తెలిసి కూడా అవి కూడా తాకట్టు పెట్టి రుణాలు తీరుస్తామంటారు. ఎక్కడైనా కూడా అడవిలో ఎర్ర చందనం చెట్టుంటే ఆ పెరుగుతున్న చెట్లు.. కోయని ఆ చెట్లను కూడా మార్కింగులు పెట్టి అవి కూడా తాకట్టు పెట్టి బ్యాంకులకు అమ్మేస్తామంటున్నారు. బ్యాంకర్లు ఏమైనా చెవిలో పూలు పెట్టుకున్నారా? లేకపోతే బ్యాంకులకు, ప్రజలకు చెవిలో పూలు సులభంగా పెట్టొచ్చని మీరు అనుకుంటున్నారా? ఒక వైపు చెట్లను కోస్తే అది స్మగ్లింగు, ఇల్లీగలని కేసులు పెడతాం. అటువంటిది బ్యాంకులకు కోయని చెట్లను మార్కింగులు చేసి రుణాలు కోసం పెట్టేస్తామని, సెక్యూరిటైజేషన్ అని అంటున్నారు. ఏమి అన్యాయం? ప్రజలకు ఇంత దారుణంగా చెవుల్లో పూలు పెట్టడమన్నది ఎంతవరకు సమంజసం? రోజుకొక అబద్ధం. పూటకొక అబద్ధం.. ఇలా ప్రజలను మభ్యపెడుతూ పోవడం ఎంతవరకు సమంజసం అని నేను చంద్రబాబునాయుడుగారిని అడుగుతున్నా.



ఈ 13 వేల కోట్ల బాధ్యత ఎవరిది?

మీ మోసం వల్ల ఇవాళ రైతులకు జరుగుతున్న నష్టమేమిటో తెలుసా? ఇవాళ రైతులు, డ్వాక్రా రుణాలు కలిపితే రాష్ట్రంలో దాదాపు లక్షా రెండు వేల కోట్లు. దీనిమీద ఇంతకుముందు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కింద 3 శాతం వడ్డీ కట్టే పరిస్థితి నుంచి ఇవాళ 12.5 నుంచి 13 శాతం వడ్డీ కట్టే పరిస్థితికి వచ్చింది. 13 శాతం వడ్డీ అంటే దాదాపు 13 వేల కోట్ల రూపాయలు. ఈ 13 వేల కోట్లను ఇవాళ రైతుల నుంచి పిండి వసూలు చేయబోతున్నాయి బ్యాంకులు. లక్షా రెండు వేల కోట్లు అసలైతే ఈ సంవత్సరం వడ్డీ కింద రైతులు 13 వేల కోట్లు కట్టాలి. ఈ వడ్డీ కట్టవలసిన బాధ్యత ఎవరిదీ అని చంద్రబాబునాయుడుగారిని అడుగుతున్నా. మీ పుణ్యాన ఇవాళ రైతులకు పంటల బీమా పోయింది. బ్యాంకుల్లో రుణాలు రెన్యువల్ చేస్తేనే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఇవాళ రైతులు రుణాలు రెన్యువల్ చేసే పరిస్థితిలో లేరు. మీరేమో రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తారో చెప్పరు. దానివల్ల రైతులకు ఇన్సూరెన్స్ కూడా అందని పరిస్థితి.



కొత్త రుణాలు రావడంలేదు. ఇప్పుడు రైతులకు మీరే రుణాలు కట్టండి.. లేదంటే మీ తిప్పలు మీరు పడండి అని  చెప్తున్నారు. ఈ ఏడాది వ్యవసాయం ఎలా చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు మీ పుణ్యాన. మీ మోసాల వల్ల ఇవాళ డ్వాక్రా అక్కచెల్లెమ్మలు, రైతన్నలు ఇద్దరూ కూడా అస్తవ్యస్త పరిస్థితిలో ఉన్నారంటే దీనికి కారణం కేవలం చంద్రబాబునాయుడుగారే. మీ చేత కొత్త రుణాలు వచ్చేట్టుగా చేసేందుకు, పాత రుణాల మీద వడ్డీ భారం 13 వేల కోట్ల రూపాయలు కూడా మీ చేత కట్టించేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతాం. గురువారం నుంచి మూడు రోజులపాటు ప్రతి గ్రామంలోనూ చంద్రబాబునాయుడు గారి దిష్టిబొమ్మలు దహనం చేసే కార్యక్రమాలు చేపడతామని పిలుపునిస్తున్నాం. దీనికి ‘నరకాసుర వధ’ అని నామకరణం చేస్తున్నాం. ప్రతిపక్షంలోని పార్టీలన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రార్థిస్తున్నా. బీజేపీని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా.  రైతులు, అక్కచెల్లెమ్మలు దీన్లో పూర్తిగా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. రైతన్నలు, అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ సీపీ పూర్తిగా అండగా ఉంటుందని చెప్తున్నాం. మిగిలిన అన్ని ప్రతిపక్ష పార్టీలు.. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు ఇందులో పాల్గొనాలని కోరుతున్నాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top