బాబు ప్రసంగం పూర్తి గ్యాస్‌ అధ్యక్షా!

బాబు ప్రసంగం పూర్తి గ్యాస్‌ అధ్యక్షా! - Sakshi


సర్కారును ఎండగట్టిన వైఎస్‌ జగన్‌



బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిందెంత? ఖర్చు పెట్టింది ఎంత?

రెయిన్‌గన్ల నిర్వహణకు రూ.103 కోట్లకు జీవో ఇచ్చారా? లేదా?

నిరుద్యోగ భృతికి ఇవ్వాల్సింది ఎంత? ఇప్పుడు ఇచ్చింది ఎంత?

కాపులకు వేయి కోట్లని చెప్పి రూ.338 కోట్లు ఖర్చు చేస్తారా?




సాక్షి, అమరావతి: గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై జరిగిన చర్చకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పిన అనంతరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వివరణలు అడిగే సమయంలో సభలో తీవ్ర గందరగోళం జరిగింది. విపక్ష నేత జగన్‌ అడిగిన వివరణలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. జగన్‌ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ... ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా రెండు గంటల 51 నిమిషాల పాటు ప్రసంగించారని, అందులో ఏవైనా కొద్దో గొప్పో నిజాలు చెప్తే సంతోషపడే వారమన్నారు.



చంద్రబాబు ప్రసంగమంతా పూర్తి గ్యాస్‌తో నిండి ఉందని ఎద్దేవా చేశారు.  నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్లయిడ్‌ ఎకనమిక్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీఏఈఆర్‌) నివేదికలోని 199వ పేజీలో పేర్కొన్న ప్రకారం అవినీతి పాలనలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉండగా... చంద్రబాబు మాత్రం తన ప్రభుత్వానికి అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అవార్డులు, రివార్డులు ఇస్తున్నాయని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నీతి ఆయోగ్‌ సిఫార్సుల మేరకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామని కేంద్ర మంత్రి అరుణ్‌జెట్లీ లేఖ రాశారంటూ ఇంగ్లీషులో రాసిన లేఖను సభలో చదివి వినిపించిన చంద్రబాబు –అదే లేఖలో... రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే అప్పగించామన్న వాస్తవాన్ని విస్మరించి తమదైన శైలిలో అసత్యాలు చెబుతారని, దీన్నిబట్టి ఆయనకు ఇంగ్లీషు రాదనుకోవాలో, వచ్చినా ఎవ్వరూ అడగరనుకుంటారో, లేక తానేమి చెప్పినా బుల్‌డోజ్‌ చేయవచ్చనుకుంటారో అర్థం కావడం లేదన్నారు.



రెయిన్‌గన్ల వ్యయంపైనా అసత్యాలే...

కరువు పీడిత ప్రాంతాల్లో పంటల్ని కాపాడేందుకు ఉద్దేశించిన రెయిన్‌గన్ల వ్యయంపైనా ముఖ్యమంత్రి సభను తప్పుదోవ పట్టించేలా అసత్యాలు చెప్పారంటూ... గత ఏడాది ఖరీఫ్‌లో ఉపయోగించిన రెయిన్‌గన్ల నిర్వహణకు ఈ ఏడాది ఫిబ్రవరి 13న రూ.103 కోట్లకు జీవో–19 విడుదల చేశారని జగన్‌ వివరించారు. ఈ దశలో చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు  జోక్యం చేసుకుంటూ జగన్‌పై ఆరోపణలు చేశారు. రెయిన్‌గన్ల నిర్వహణకు రు.30 కోట్లు మించి ఖర్చు చేయలేదని కాల్వ  చెప్పగా, రు.12 కోట్లకు మించి వ్యయం కాలేదని ప్రత్తిపాటి తెలిపారు. తామెక్కడ రు.103 కోట్లు ఖర్చు పెట్టామో నిరూపించాలన్నారు.



ఆ తర్వాత జగన్‌ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ... గత ఫిబ్రవరిలో జీవో ఇచ్చింది ప్రభుత్వమేనని, తాము ఈ అంశాన్ని పెద్దది చేయడంవల్లే ఆమేరకే ఖర్చును పరిమితం చేసి ఉంటారని, లేకుంటే ఏమీ మిగిలేది కాదని చెప్పారు. తప్పుడు లెక్కలు చూపించే అలవాటు, ఖర్మ చంద్రబాబుకే ఉందంటూ... గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టుపై మూడు రోజుల పాటు జరిగిన చర్చలో కావాలనే తప్పుడు లెక్కలు చెప్పానని చంద్రబాబే ఆనాడు అసెంబ్లీలో ఒప్పుకున్న విషయాన్ని ఈ సందర్భంగా జగన్‌ గుర్తు చేశారు.



ఈ ప్రభుత్వం చూపించే లెక్కలన్నీ తప్పులే...

కేటాయింపుల్నే సవరించిన అంచనాల్లోనూ చూపుతూ మొత్తానికి మొత్తం ఖర్చు చేసినట్టు చూపుతున్నారని, విడుదల చేసే మొత్తాలకు, ఖర్చు చేసే మొత్తాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటోందని, అసలు వాస్తవం తెలిసే సమయానికి పుణ్యకాలం గడిచిపోతోందని జగన్‌ వివిధ రంగాల వారీగా కేటాయింపులు, చేసిన ఖర్చును సోదాహరణంగా వివరించారు.  కాపులకు వేయి కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించిన సీఎం వాస్తవానికి వారికి ఖర్చు చేసింది కేవలం రూ.338 కోట్లేనని మండిపడ్డారు.    



నిరుద్యోగ భృతి పెద్ద దగా ..

ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతి గురించి పెద్దఎత్తున ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు చాలా గొప్పగా రు.500 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్టు చెప్పుకుంటున్నారని జగన్‌ ఎద్దేవా చేశారు. జాబు రావాలంటే బాబు రావాలంటూ ఇంటింటికీ తాను సంతకం చేసిన కరపత్రాన్ని పంచి పెట్టారని, ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికీ నెలకు రెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పారని, ఈ లెక్కన రాష్ట్రంలోని కోటీ 75 లక్షల ఇళ్లకు నెలకు రూ.3500 కోట్ల చొప్పున ఏడాదికి రూ.40 వేల కోట్లకు పైగా కావాల్సి ఉందని అంటుండగా స్పీకర్‌ మైక్‌ కట్‌ చేసి బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌ రాజుకు ఇచ్చారు. దీనికి ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం చెబుతూ స్పీకర్‌ పోడియం ఎదుట నిరసన తెలిపారు. ఆ గందరగోళం మధ్యనే చంద్రబాబు లేచి విపక్ష నేత ప్రశ్నలకు వివరణ ఇచ్చారు.


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top