నిర్భయంగా దండెత్తండి

నిర్భయంగా దండెత్తండి - Sakshi


సోషల్‌మీడియా సైనికులకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు

- అండగా ఉంటాం... అణచివేతను తిప్పికొట్టండి

- ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు..వైఎస్సార్‌ అభిమానులు పోస్టులు పెట్టండి

- ఇది ప్రజాస్వామ్యయుత తిరుగుబాటు.. మాది అహింసాయుత యుద్ధం..




సాక్షి,అమరావతి: ఉక్కుపాదంతో అణచి వేద్దామనుకున్న తెలుగుదేశం ప్రభుత్వానికి దిమ్మతిరిగేలా నిర్భయంగా దండెత్తాలని సోషల్‌మీడియా సైనికులకు ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. అండగా తానుంటానని అభయమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు  చేస్తున్న అప్రజాస్వామిక, అరాచకాలపై అన్ని మీడియా మాధ్యమాల ద్వారా ప్రజాస్వామికమైన యుద్ధం ప్రకటించాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యం, పౌరులకున్న భావ ప్రకటన స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కుల్ని గౌరవించే ప్రతి ఒక్కరూ సోషల్‌ మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దాడిని తీవ్రంగా ప్రతిఘటించాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దురాగతాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు, వైఎస్సార్‌ను అభిమానించే ప్రతి ఒక్కరూ పోస్టింగులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.



ఏ మీడియా కుదిరితే ఆ మీడియాను ఉపయోగించుకోండి..

ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా, సోషల్‌ మీడియా, అందుబాటులో ఉన్న ఏ మీడియా లో కుదిరితే ఆ మీడియా ద్వారా చంద్రబాబు అరాచకాల మీద నిర్భయంగా,నిర్మొహ మాటంగా దండెత్తండి అని కోరారు. తెలుగుదేశం పార్టీ, దాని సోషల్‌ మీడియా విభాగం గత కొన్నేళ్లుగా తనపై,  మహానేత వైఎస్సార్‌ మీద, తమ వ్యతిరేకుల మీద అత్యంత హేయమైన, అసత్య ప్రచారాలకు దిగిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. చంద్రబాబు చేస్తున్న అసత్యాల దాడిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు సమర్థంగా తిప్పి కొట్టడంతో పాటు ఎదురుదాడికి దిగేసరికి ఏకంగా పోలీసుల్ని రంగంలోకి దింపారని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా కార్యాలయం మీద దాడికి దిగారని, సోదాలతో భయపెడ దామనుకున్నారని పేర్కొన్నారు.



బలంగా ప్రతిఘటిద్దాం..

‘దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీని తీసుకున్నా..అంతెందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తీసుకున్నా సోషల్‌ మీడియా ద్వారా వారు చేస్తున్న ప్రచారాలు తెలిసినవే. చంద్రబాబు సిద్ధాంతం ఏమిటంటే తాను తప్పు చేసినా ఒప్పు...ఇతరులు ఒప్పు చేసినా తప్పు. అధికార మదం తలకెక్కిన స్థితిలో పోలీసుల్ని పంపి దాడిచేస్తే.. ఎవరూ భయపడేది లేదని, ప్రజలు తమ గొంతుగా, తమ వాణిగా సోషల్‌ మీడియా ద్వారా చేస్తున్న ప్రతిఘటనను మరింత శక్తివంతంగా, మరింత బలంగా చేయాలి’ అని జగన్‌ పిలుపునిచ్చారు. ‘వాయిస్‌ ఆఫ్‌ ద పీపుల్‌ ఈజ్‌ ద వాయిస్‌ ఆఫ్‌ ద గాడ్‌’ అని నానుడి. ప్రజల అభిప్రాయం దేవుడి మాటతో సమానం. అని జగన్‌ పేర్కొన్నారు. ‘ఎల్లో మీడియా ద్వారా పత్రికలు, టీవీ చానళ్లలో తాను, తన ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను, అసత్య ప్రచారాలను లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఆడుకునే మరో మీడియాగా... నేరుగా ప్రజల వాయిస్‌గా రూపొంతరం చెందిన సోషల్‌ మీడియాను తట్టుకునే శక్తి లేక పోలీసు బలాన్ని, కండ బలాన్ని చంద్రబాబు ఆశ్రయిస్తున్నాడు. జనం గొంతు నొక్కే దుర్మార్గాల మీద అన్ని మాధ్యమాలనూ వాడుకుని ప్రజాస్వామికంగా తిరగబడండి.. అహింసాయుతంగా యుద్ధం ప్రకటించండి’ అని  జగన్‌ విజ్ఞప్తి చేశారు.



ట్వీటర్‌లోనూ జగన్‌ పిలుపు

సోషల్‌ మీడియాకు సంకెళ్లు వేయాలన్న చంద్రబాబు ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని,  అదే సోషల్‌ మీడియాను అస్త్రంగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు.. చంద్రబాబు అప్రజాస్వామిక విధానా లపై కలసికట్టుగా పోరాడాలని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top