పరామర్శిస్తూ... భరోసానిస్తూ...

పరామర్శిస్తూ... భరోసానిస్తూ... - Sakshi


నెల్లూరు జిల్లా వరద బాధిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ విస్తృత పర్యటన

చెట్ల కింద బతుకుతున్నామని చెప్పిన ప్రజలు

బియ్యం కాదు కదా.. మంచినీళ్లు కూడా ఇవ్వలేదని ఆవేదన

రోజుకు ఒకటి, రెండు ప్యాకెట్ల నీళ్లిచ్చి సర్దుకోమన్నారని ఫిర్యాదు

నివాసాలకు తీసుకెళ్లి కూలిన ఇళ్లను చూపిన బాధితులు... తమకు ప్రభుత్వ సాయం అందేలా పోరాడాలని విజ్ఞప్తి

తక్షణసాయమందేలా చూస్తానని జగన్ హామీ


 

నెల్లూరు: వరదల వల్ల సర్వం కోల్పోయిన వారిని పరామర్శిస్తూ, వారికి తక్షణ సాయం అందేలా చూస్తానని భరోసానిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. గూడూరు నియోజకవర్గ పరిధిలోని వాకాడు, చిల్లకూరు మండలాల్లోని పలు గ్రామాల్లో ఆయన పర్యటన సాగింది. వాకాడు మండలం గొల్లపాళెంలోని పాపారెడ్డి మనోజ్‌కుమార్‌రెడ్డి నివాసం నుంచి బయలుదేరిన జగన్ అశోకస్తూపం కూడలిలో వరద బాధితుల్ని పరామర్శించారు. అనంతరం వెంకన్నపాళెం వద్ద వేచిఉన్న రైతులు, మహిళా రైతుల్ని పలకరించారు. కోటలో ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. కోట-గూడూరు మార్గంలో రోడ్డు పక్కన ఉన్న నక్కలోళ్లు, డక్కలోళ్లను పరామర్శించారు. రెండేళ్లుగా 50 కుటుంబాలు అక్కడ నివసిస్తున్నామనీ, వర్షాలకు పూరిగుడిసెలన్నీ కూలిపోయాయని వారు తెలిపారు. ఇళ్లు పోగొట్టుకుని చెట్లకింద చీకట్లో బతుకుతున్నామన్నారు. పాములు, పురుగులు వస్తున్నాయని, కొందరు పాముకాటుకు గురైనట్లు చెప్పి కన్నీరుమున్నీరయ్యారు. బియ్యం కాదుకదా... కనీసం మంచినీళ్లు కూడా ఇచ్చే దిక్కులేదని బోరుమన్నారు. వారందరికీ తక్షణమే సాయం అందేలా చూస్తానని జగన్ భరోసానిచ్చారు. అనంతరం కడివేడులో ఇల్లిల్లూ తిరిగారు. వర్షాలకు ఇంటికప్పు కూలిపోయి మరణించిన రమణయ్య కుటుంబాన్ని పరామర్శించారు. సర్వం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న శేషమ్మ తాము ఎదుర్కొంటున్న బాధలు చెప్పుకుంటూ కన్నీరుపెట్టింది. వానలకు సర్వం కోల్పోయామని గీతమ్మ, కృష్ణవేణమ్మ, వెంకటరమణమ్మ, సుబ్బమ్మ వాపోయారు. కష్టాలకు భయపడవద్దనీ, అందరికీ సాయం అందేలా పోరాడతానని జగన్ వారికి భరోసానిచ్చారు.



గిరిజన కాలనీలో కలియదిరిగిన జగన్

పారిచర్లవారిపాళెం గిరిజన కాలనీ మీదుగా వెళ్తున్న వైఎస్ జగన్ రోడ్డుపై వేచి ఉన్నవారిని చూసి కాన్వాయ్‌ను ఆపారు. గిరిజనులంతా ఆయన చుట్టూచేరి తమ సమస్యలను వివరించారు. వానలకు పూర్తిగా మునిగిపోయి ఇబ్బందులు పడుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదని చెప్పారు. బియ్యం కొంతమందికి ఇచ్చి.. మరి కొంతమందికి ఇవ్వలేదన్నారు. ఇళ్లు పడిపోయినా రూపాయి సాయం చేయలేదని చెప్పారు. రోజుకు ఒకటి, రెండు ప్యాకెట్ల నీళ్లిచ్చి సర్దుకోమని చెప్పారని కన్నీరుపెట్టుకున్నారు. జగన్ కాలనీ మొత్తం నడుచుకుంటూ కలియదిరిగారు. శీనయ్య, చెంచమ్మ, చెంచయ్యల నివాసాల్లోకి వెళ్లి పరిశీలించారు. అనంతరం పారిచర్లవారిపాళెం కూడలిలో భారీగా వేచి ఉన్న స్థానికులను పలుకరించారు. వరదలకు తీవ్రంగా నష్టపోయామని, తమకు ప్రభుత్వ సాయం అందేలా పోరాడాలని వారు విజ్ఞప్తి చేశారు.



వంతెనలు సరిగా నిర్మించలేదు

అనంతరం చింతవరం వద్ద ఉన్న బల్లవోలు డ్రైన్‌ను జగన్ పరిశీలించారు. కోట, చిల్లకూరు మండలాల పరిధిలోని ఎగువ ప్రాంతాల్లో నీరంతా బల్లవోలు కాలువ ద్వారా ప్రవహించి కండలేర ు క్రీక్‌లో కలుస్తున్నాయని స్థానికులు వివరిం చారు. ఆ క్రీక్ ద్వారా సముద్రం నుంచి వచ్చే బ్యాక్‌వాటర్ రివర్స్‌లో వచ్చి 550 ఎకరాలకుపైగా నీటిమునకలో ఉన్నాయని తెలిపారు. కృష్ణపట్నం పోర్టు వద్ద కట్టిన వంతెనలు సరిగా నిర్మించకపోవటంతో నీరు సముద్రంలో కలవటం లేదన్నారు. దీంతో ఆ నీరు వెనక్కొచ్చి రొయ్యల గుంతలను ముంచెత్తుతున్నాయని రైతులు కన్నీరుపెట్టుకున్నారు. అనంతరం మోమిడిలో పలువురిని జగన్ పరామర్శించారు. తర్వాత వరదలకు భారీగా దెబ్బతిన్న చెన్నై- విజయవాడ జాతీయరహదారిని పరిశీలించారు. ప్రయాణికులు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులనడిగి తెలుసుకున్నారు. అక్కడ్నుంచి నెల్లూరు నగరానికి చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన వాకాడులో సీజీసీ సభ్యుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి, కోటలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసాలకు వెళ్లి పలుకరించారు. కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాద్, జిల్లా పార్టీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాశం సునీల్‌కుమార్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, అల్లూరు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, పార్టీ నేత ఎల్లసిరి గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

 

రేపు గోదావరి జిల్లాల్లో జగన్ పర్యటన

హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి శుక్ర వారం ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాగా దెబ్బతిన్న ప్రాంతాల్ని జగన్ సందర్శించి ప్రత్యక్షంగా పంటనష్టం వివరాల్ని, ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందుల్ని స్వయంగా తెలుసుకుంటారని పార్టీ కార్యక్రమాల రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ బుధవారం తెలిపారు. జగన్ గత 3రోజులుగా చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తొలుత 23, 24 తేదీల్లోనే పర్యటన ఉంటుందని భావించినా, వరదనష్టం తీవ్రంగా ఉన్నందున మరో రెండు రోజుల పాటు ఈజిల్లాల్లో పర్యటనను జగన్ పొడిగించారు. గురువారం వరకు ఆయన నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. గురువారం రాత్రికి అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరిగివస్తారు. శుక్రవారం ఉదయం హైద రాబాద్ నుంచి గోదావరి జిల్లాలకు వెళ్తారని పార్టీవర్గాలు తెలిపాయి.

 

ఆక్వా రైతుకు కష్టం.. నష్టం

ఏరూరులో తీవ్రంగా నష్టపోయిన రొయ్యల రైతులను జగన్ పరామర్శించారు. ముందుగా చేవూరు నాగరాజుకు చెందిన రొయ్యల గుంతను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

 

వైఎస్ జగన్: అన్నా వరదల వల్ల రొయ్యల గుంతల పరిస్థితి ఏంటి?

 నాగరాజు: సార్, నేను 20 ఎకరాలు సాగుచేశాను. ఎకరాకు రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.1.20 కోట్లు అయ్యింది. ఒక్కో గుంటలో 2 లక్షల పిల్లలు వదిలాను. సీడు, ఫీడు, ఏరియేటర్లు, చేతికొచ్చే సమయంలో మొత్తం రొయ్యలన్నీ కొట్టుకుపోయాయి. పెట్టిన పెట్టుబడి మొత్తం నీళ్లపాలైంది.



జగన్: ప్రభుత్వం తరఫున ఏం చేస్తున్నారు?

 నాగరాజు: రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో విద్యుత్ యూనిట్‌కు 90 పైసల చొప్పున ఇచ్చే వారు. ప్రస్తుతం రూ.5.10 చేశారు. దీనికి తో డు అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్‌ను అదనంగా వాడుకుంటే యూనిట్‌కు రూ.11 చొప్పున కట్టించుకుంటున్నారు. దీంతో నెల కు మొత్తంగా రూ.2 లక్షల విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నాను. ఇప్పుడు వరదల వల్ల మొత్తం నీళ్లపాలైంది. ప్రభుత్వం ఆదుకునేలా చూడండి.

 

వెంకన్నపాళెం వద్ద ఉన్న రైతులు జగన్‌మోహన్‌రెడ్డి వాహనాన్ని ఆపి నీటమునిగిన పొలాలను చూపించారు. అధికారులు వచ్చినా తమ వద్ద వివరాలు తీసుకోలేదని తెలిపారు. వారు చేసే సర్వే సక్రమంగా లేదన్నారు. అనంతరం జగన్ శ్యామసుందరాపురంలో వేచి ఉన్న సంధ్య, సుబ్బమ్మ, క్రిష్ణవేణి, దొబ్బరయ్య బొబ్బులయ్య, పొండమ్మ, సుజాతలను పలుకరించారు.



వైఎస్ జగన్: ఎంత నష్టమైందమ్మా?

మహిళా రైతులు: చాలా పోయింది. మీరే ఆదుకోవాలయ్యా.

 

వైఎస్ జగన్: మీకు రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేశారా?


 రైతులు: లేదు సార్. అప్పులు కట్టమని ఒత్తిడి చేస్తున్నారు. మేం ఈ పరిస్థితుల్లో ఉంటే అప్పులు ఎలా కట్టాలి సార్.

 సంధ్య: మాకేం సాయం అందలేదు సార్. మా ఊర్లో ఒక్కపనీ జరగలేదు.

 వైఎస్ జగన్: చంద్రబాబు అన్నీ జన్మభూమి కమిటీలకు అప్పగించారు కదా? సర్పంచ్‌లకు అధికారం ఇవ్వటం లేదు.

 

పుస్తకాలు పాడయ్యాయి..  మళ్లీ కొనుక్కున్నాం


జగన్ వస్తున్నారని తెలుసుకున్న చిన్నారులు తిమ్మనవారిపల్లెలో రోడ్డుపై వేచి ఉన్నారు. వర్షాలకు ఎలా ఉన్నారు? స్కూలుకు వెళ్తున్నారా? లేదా? అంటూ ఆయన శివ, యశ్వంత్, గీతిక, కిషోర్‌లను ఆత్మీయంగా పలకరించారు. వర్షాలకు పుస్తకాలన్నీ నీళ్లలో మునిగి పనికిరాకుండా పోయాయని వారు తెలిపారు. అమ్మానాన్న అప్పుచేసి పుస్తకాలు కొని ఇచ్చారని చెప్పారు. పిల్లలకు పుస్తకాలు కూడా ఇవ్వలేదా? ఇంత దారుణం ఎక్కడైనా ఉందా? అంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top