నేనున్నానని..

నేనున్నానని.. - Sakshi


* నేటి నుంచి వైఎస్ జగన్ ఐదో విడత రైతుభరోసా యాత్ర

* తాడిపత్రి, కదిరిలో పర్యటించనున్న ప్రతిపక్ష నేత

* ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసా

* ఏర్పాట్లు పూర్తి చేసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు

* రైతు భరోసా యాత్ర ప్రారంభం

* పెద్దవడుగూరు మండలం మిడుతూరు నుంచి


సాక్షి ప్రతినిధి, అనంతపురం: అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతుభరోసా యాత్రలో భాగంగా ఐదవ విడత యూత్ర బుధవారం జిల్లాలో ప్రారంభం కానుంది.  



ఇప్పటికే జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఆత్మహత్యలు చేసుకున్న 70 మంది రైతు, చేనేతల కుటుంబాలకు భరోసానిచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి.. ఐదో విడతలో తాడిపత్రి, కదిరి నియోజకవర్గాల్లో ఆత్మహత్య చేసుకున్న  వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. భరోసాయాత్రకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చే శాయి. ఆత్మహత్య చేసుకున్న రైతులు, చేనేతల కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైనా, ప్రతిపక్ష నేతగా భరోసా కల్పించేందుకు వస్తున్న వైఎస్ జగన్‌ను జిల్లా ప్రజలు స్వాగతిస్తున్నారు.

 

అప్పుల బాధతోనే ‘అనంత’ ఆత్మహత్యలు

అప్పులబాధ తాళలేక జిల్లాలో 145 మంది రైతులు, 26 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు తెగించారు. వీరంతా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న రైతులే!   నాలుగేళ్లుగా ‘అనంత’లో వరుస కరువులతో జిల్లా ైరె తాంగం తీవ్రంగా నష్టపోయారు. అప్పుల ఊభిలో కూరుకుపోయారు. ఈ క్రమంలో తాను అధికారంలోకి వస్తే రైతుల వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. దీంతో ఆశపడిన రైతులు చంద్రబాబును గద్దెనెక్కించారు. అయితే చంద్రబాబు మాత్రం అధికారం చేతిరాగానే రైతాంగాన్ని మరోసారి మోసం చేశారు.  



జిల్లాలో 10.24 లక్షల ఖాతాల్లో  రూ. 6,817 కోట్ల రుణాలు బకాయిలున్నాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తొలివిడతలో కేవలం రూ. 780.16 కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేసింది. ఈ క్రమంలో గోరుచుట్టుపై రోకలిపోటులా  2013కు సంబంధించిన  రూ.227 కోట్ల  వాతావరణ బీమాను బ్యాంకర్లు పాతబకాయిల కింద జమ చేసుకున్నారు. అలాగే 2013-14కు సంబంధించి రూ. 643 కోట్ల ఇన్‌పుట్‌సబ్సిడీ  ఇవ్వలేమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ పరిస్థితుల వల్ల ఆత్మస్థైర్యం కోల్పోయిన రైతన్నలు ఆత్మహత్యలకు తెగించారు.

 

తొలిరోజు పర్యటన ఇలా..

వైఎస్ జగన్ ఐదోవిడత రైతు భరోసా యాత్ర తొలిరోజు తాడిపత్రి నియోజకవర్గంలోని మిడుతూరు నుంచి మొదలవుతుంది. అనంతరం పెద్దవడుగూరు చేరుకుంటారు. అక్కడ రైతుసమస్యలపై ముఖాముఖి నిర్వహిస్తారు. అక్కడి నుంచి చిన్నవడుగూరు మీదుగా దిమ్మగుడి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతు నాగార్జునరెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆపై కండ్లగూడూరు మీదుగా చింతలచెరువు చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న జగదీశ్వరరెడ్డి, వెంకట్రామిరెడ్డి కుటుంబాలను పరామర్శిస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top