జగన్‌ చేపట్టే రైతు దీక్షకు మద్దతివ్వండి

జగన్‌ చేపట్టే రైతు దీక్షకు మద్దతివ్వండి - Sakshi


మార్కాపురం : వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 26, 27 తేదీల్లో గుంటూరులో చేపట్టే రైతు దీక్షకు రైతులు, ప్రజా సంఘాలు మద్దతివ్వాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సంతనూతలపాడు ఎమ్మెల్యే డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ విజ్ఞప్తి చేశారు. మార్కాపురం పట్టణంలోని ఎన్జీఓ హోంలో గురువారం నిర్వహించిన ఏపీ రైతు సంఘ డివిజన్‌ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా మిర్చి, పొగాకు, కంది రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు.



ఈ నేపథ్యంలో రైతులకు న్యాయం జరిగేందుకు ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేలా జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష చేపడుతున్నారన్నారు. రాష్ట్రంలో రైతు వ్యతిరేక విధానాలు అమలవుతున్నాయని, అన్నదాతలు విలవిల్లాడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతన్నకు అండగా ఉండి వారికి ఆత్మస్థైర్యం కల్పించేందుకు వైఎస్సార్‌ సీపీ ముందుంటుందన్నారు. రైతన్నకు న్యాయం జరిగేంత వరకు పోరాటాలు చేస్తామని, వామపక్షాలు చేసే ఉద్యమాలకు మద్దతిస్తామని సురేష్‌ తెలిపారు. జిల్లాలో కరువు మండలాల ప్రకటనలో కూడా ప్రభుత్వం రాజకీయం చేసిందని విమర్శించారు.



 టీడీపీ హయాంలో వ్యవసాయం చేయాలంటే రైతులు భయపడుతున్నారన్నారు. మూడేళ్లలో తీవ్రమైన కరువు ఏర్పడిందని, ప్రభుత్వ హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయని, రైతులకు ఎటువంటి ప్రయోజనాన్ని కల్పించడం లేదని మండిపడ్డారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకంలో బీమా ప్రీమియం చెల్లించినా పంట నష్టపరిహారం ఇవ్వకుండా కాలక్షేపం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఇలాగే చేస్తే గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందన్నారు.



 జిల్లాలో పొగాకు, మిర్చి రైతులకు తక్షణమే ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాలని, రుణమాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సురేష్‌ డిమాండ్‌ చేశారు. వెలిగొండపై ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే మరో టన్నెల్‌ అంటూ డ్రామాలు ఆడుతున్నారన్నారు.



 కార్యక్రమంలో పాల్గొన్న రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకట్రావు మాట్లాడుతూ జిల్లా రైతు మహాసభలకు సన్నాహకంగా ఈ సభ ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో పెద్దదోర్నాల జెడ్పీటీసీ సభ్యుడు అమిరెడ్డి రామిరెడ్డి, రైతు సంఘ డివిజన్‌ అధ్యక్షుడు గాలి వెంకట్రామిరెడ్డి, సీపీఎం కార్యదర్శి సోమయ్య, బాలనాగయ్య, రఫి, తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top