ప్రభుత్వ అజెండా దుర్మార్గం:వైఎస్ జగన్

వైఎస్ జగన్మోహన రెడ్డి - Sakshi


హైదరాబాద్:పింఛన్లకు కోత విధించడం అమానుషం అని,  ప్రభుత్వ అజెండా దుర్మార్గం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి అన్నారు. పార్టీలకు అతీతంగా పేదల పక్షాన నిలవాలని ఆయన బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో సామాజిక పింఛన్లు ఏరివేయడానికి ప్రభుత్వం తరపున జరుగుతున్న కుట్రలో భాగస్వాములు కావద్దని పెన్షనర్ల పరిశీలన కమిటీ అధ్యక్షునికి, సభ్యులకు ప్రతిపక్ష నేతగా విజ్ఞప్తి చేశారు.



బహిరంగ లేఖ సారాంశం:

2014 మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గ్రామగ్రామాన తిరుగుతూ 200 రూపాయల పింఛను వెయ్యి రూపాయలు చేస్తానని, 500 రూపాయల పింఛనును 1250 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు చేస్తానని హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పింఛనుదార్ల మీద కక్షకట్టినట్లు, పగబట్టినట్లు ప్రవర్తిస్తూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నేతన్నలూ, గీతన్నల పింఛను కత్తిరించే కార్యక్రమం ప్రారంభించింది. నిన్నటి వరకు పింఛన్లు అందుకున్నవారి పింఛన్ను తొలగిస్తే, వారు ఎలా బతుకుతారన్న ఆలోచన కూడా చంద్రబాబుకు లేదు.రాష్ట్రంలో 43,11,688 పింఛన్ల కోసం ఈ ఏడాది కనీసం 3600 కోట్ల రూపాయలు కావలసి ఉందగా, బడ్జెట్లో కేటాయించింది కేవలం 1300 కోట్ల రూపాయలు మాత్రమే.



సామాజిక పెన్షన్ల పూర్తి వివరాలు:



ఏపిలో ప్రస్తుతం 43,11,688 మంది పెన్షన్ తీసుకుంటున్నారు.

వృద్ధుల పెన్షన్లు : 20,30,131 (ప్రస్తుతం రు.200- అక్టోబరు నుంచి రు.1000 ఇవ్వాలి)

వితంతు పెన్షన్లు : 13,21,986  (ప్రస్తుతం రు.200- అక్టోబరు నుంచి రు.వి1000 ఇవ్వాలి)

వికలాంగ పెన్షన్లు : 5,36,837 (ప్రస్తుతం రు.500 - అక్టోబరు నుంచి సగం మందికి రు.1000, మిగిలినవారికి రు.1500 ఇవ్వాలి)

అభయహస్తం :2,87,897 (ప్రస్తుతం రు.500 - అక్టోబరు నుంచి వెయ్యి రూపాయలు ఇవ్వాలి)

ఇతర కేటగిరి : 90వేలు (ప్రస్తుతం రు.200 - అక్టోబరు నుంచి వెయ్యి రూపాయలు ఇవ్వాలి)



ఈ ఆర్థిక సంవత్సరంలో సామాజిక పింఛన్లకు కేటాయించవలసింది మొత్తం 3,730 కోట్ల రూపాయలు. కానీ బడ్జెట్లో కేటాయించింది కేవలం 1338 కోట్ల రూపాయలు మాత్రమే.

లోటు (తేడా ) 2400 కోట్ల రూపాయలు.

ఈ మేరకు పింఛన్లు కత్తిరించి, కొందరికి మాత్రమే పింఛన్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభించారు. పార్టీలు, ప్రాంతాలు, కులమతాలకు అతీతంగా ఈ కత్తిరింపుల కార్యక్రమానికి సహకరించవద్దు. మానవతా దృక్పధంతో వ్యవహరించాలి. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో పరిశీన పేరిట ఏడు లక్షల సామాజిక పెన్షన్లకు కోత పెట్టింది. వాస్తవానికి మరో 15 లక్షల మంది సామాజిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకొని ఏళ్లతరబడి ఎదురు చూస్తున్నారు. అర్హులందరికీ పింఛన్ అందించడానికి వీలుగా మహానేత శాచురేషన్ విధానాన్ని అవలంభించారు.17 లక్షల మందికి మాత్రమే ఇస్తున్న పెన్షన్లను  వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత అదనంగా మరో 55 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇచ్చారు. పింఛన్ను 75 రూపాయల నుంచి 200 రూపాయలకు పెంచారు.



ఆధార్ కార్డు ఉపయోగించి రేషన్ ఇవ్వకుండా ఆపుతారా.. ఖబడ్దార్ అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ పింఛన్లకూ ఆధార్ను ప్రాతిపదికగా మార్చి, రకరకాల ఆంక్షలు పెడుతూ అర్హుల పొట్టగొట్టేందుకు కత్తి దూస్తున్నారు. ఇంతకు మించిన దుర్మార్గం ఉందా? దుర్మార్గమైన, అమానుషమైన తొలగింపు కార్యక్రమానికి సహకరించవద్దని, అర్హులైన అందరినీ పింఛన్ల జాబితాలో చేర్చడానికి సహకరించాలని గ్రామ సర్పంచులు, మండలాధ్యక్షులు, మునిసిపల్ చైర్మన్లు, వార్డు మెంబర్లు, మునిసిపల్ కార్పోరేషన్ చైర్మన్లు, కార్పోరేటర్లకు, వారి నేతృత్వంలోని సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాను.

**

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top