ప్రభుత్వం మెడలు వంచైనా న్యాయం చేస్తాం


 దేవరపల్లి: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర వచ్చే వరకూ పోరాటం చేస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మెడలు వంచైనా న్యాయం చేస్తామని చెప్పారు. పొగాకు రైతుల కష్టాలు తెలుసుకునేందుకే పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇక్కడకు వచ్చారన్నారు. ఎన్నికల ముందు పొగాకు రైతుల రుణాలు రూ.600 కోట్లు మాఫీ చేస్తామని హమీ ఇచ్చిన చంద్రబాబు ఆరు పైసలు కూడా మాఫీ చేయలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు మాట్లాడుతూ మోసపూరితమైన హమీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని విమర్శించారు. హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

 

 రైతులను పట్టించుకోని చంద్రబాబు

 పార్టీ ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించమని రైతులు చంద్రబాబును కలిసి మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. మండల పార్టీ కన్వీనర్ గడా జగదీష్ మాట్లాడుతూ రైతులు, డ్వాక్రా మహిళలను చంద్రబాబునాయుడు నిలువునా ముంచారన్నారు. రైతు సంఘం ప్రతినిధి చవల సూర్యచంద్రం మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ పొగాకు రైతుల సమస్యలను తెలుసుకుని 2005-06లో ధరను రూ.172కు పెంచారని గుర్తుచేశారు. ఏఎంసీ మాజీ చైర్మన్ ఎన్.రాజేంద్రబాబు మాట్లాడుతూ గతేడాది జూలై 4 నాటికి 35 మిలియన్ కిలోల పొగాకు విక్రయూలు జరగ్గా ఈ ఏడాది 18 మిలియన్ కిలోలకే పరిమితమైపోరుుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయిల్ ఫామ్ పరిస్థితి ఇలానే ఉందన్నారు.  

 

 తీవ్ర సంక్షోభంలో రైతులు

 కొయ్యలగూడేనికి చెందిన రైతు జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ తాను 30 ఏళ్లుగా పొగాకు సాగు చేస్తున్నానని, ఇలాంటి పరిస్థితి ముందెన్నడూ చూడలేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారని తెలిసి శుక్రవారం మార్కెట్‌లో కిలోకు అదనంగా రూ.10, శనివారం మరో రూ.10 ధర పెరిగిందన్నారు. రైతు మధ్యాహ్నపు ఈశ్వరుడు మాట్లాడుతూ ఎన్నికల ముందు పొగాకు ధర కిలో రూ.199 ఉండగా అనంతరం రూ.100కు పడిపోయిందన్నారు. సహకార రుణాలపై 6 శాతం రాయితీని ఎత్తివేసి సీఎం చంద్రబాబు రైతులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top