భగ్నంపై భగ్గు.. భగ్గు..

భగ్నంపై భగ్గు.. భగ్గు.. - Sakshi


నిరవధిక దీక్షలో ఉన్న వైఎస్ జగన్‌ను

ఆస్పత్రికి తరలించడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు

జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన ర్యాలీలు

గుండెపోటుకు గురై నర్రావారిపాలెంలో ఒకరు మృతి

భవిష్యత్ పోరాటాన్ని  వెల్లడించిన వైఎస్సార్ సీపీ నేతలు

నేడు విజయవాడలో ‘నిరసన మార్చ్’

17 నుంచి నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు


 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు వేదికగా చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను టీడీపీ ప్రభుత్వం దుర్మార్గంగా భగ్నం చేసినా, ఈ పోరాటాన్ని కొనసాగించేందుకు పార్టీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. దీక్షను భగ్నం చేసిన తీరును, ప్యాకేజీల కోసం ముఖ్యమంత్రి పడుతున్న ఆరాటాన్ని ప్రజల్లోకి తీసుకువెళాలని నిర్ణయించింది. ఈ నిరవధిక నిరాహార దీక్షకు వివిధ వర్గాల నుంచి సానుకూల స్పందన వ్యక్తం కావడంతో పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంతో భవిష్యత్ కార్యాచరణను అమలు పరిచేందుకు సిద్ధమవుతున్నాయి. మరో వైపు దీక్ష భగ్నంపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు టీడీపీ ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్నారు.



 తెల్లవారుజామున శిబిరంలోకి ప్రవేశించిన పోలీసులు

 జగన్ ఆరోగ్యం విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున 4.10 గంటలకు పోలీసులు ఆయనను బలవంతంగా ప్రభుత్వ  ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే చికిత్స ప్రారంభించేందుకు వైద్యులు సిద్ధం కాగా, జగన్ వ్యతిరేకించారు. అయినప్పటికీ వైద్యులు బలవంతంగా ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ ఎక్కించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి, సోదరి షర్మిల, మామయ్య డాక్టర్ గంగిరెడ్డిలు ఆస్పత్రికి చేరుకున్నారు.

 

గుండెపోటుతో ఒకరు మృతి...


జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేసే దృశ్యాలను టీవీలో చూసిన బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం నర్రావారిపాలెంలో సంగు వెంకట చిన సుబ్బారెడ్డి(40) అనే వ్యక్తి భా వోద్వే గానికిలోనై గుండెపోటుతో మృతి చెందారు. దీక్ష భగ్నాన్ని నిరసిస్తూ మంగళగిరి, తాడికొండ, తెనాలి, గుంటూరులో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరు తూ తెనాలిలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించారు.



 పార్టీ నాయకుల అత్యవసర సమావేశం ..

 జగన్ దీక్షను భగ్నం చేసిన నేపథ్యంలో వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు గుంటూరులోని పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశమయ్యారు.  భవిష్యత్ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జగన్‌కు వివరించారు. దీక్షను భగ్నం చేసినందుకు నిరసనగా బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వరకు ‘నిరసన మార్చ్’ నిర్వహించ తలపెట్టారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.

 

భవిష్యత్ కార్యాచరణ ఇలా..

 ఈ నెల 17వ తేదీ నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. 18వ తేదీన రిలే నిరాహార దీక్షా శిబిరాలకు నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తరలివెళతారు. అక్కడ నిర్వహించే సమావేశాల్లో ప్రత్యేక హోదా ఆవశ్యకతపై పార్టీ నేతలు ప్రసంగిస్తారు. 19న ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి, 20వ తేదీ సాయంత్రం నియోజకవర్గ కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు, 21న ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నా చేపడతారు. ఈ నెల 22న రాజధాని శంకుస్థాపనకు హాజరుకానున్న ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకువెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు నాయకులు తెలిపారు. రాజధాని శంకుస్థాపనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరుతూ జగన్ లేఖ రాయనున్నారు.

 

పెద్ద ఎత్తున తరలిరాక...

 గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జగన్‌ను పరామర్శించేందుకు పార్టీకి చెందిన సీనియర్ నాయకులతోపాటు మేధావి వర్గం ఇతర నాయకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీక్షనుభగ్నం చేసినందుకు నిరసనగా వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం మంగళవారం గుంటూరు నగరంలోని విద్యాసంస్థలను  మూయించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, దేవళ్ల రేవతి తదితరులు పాల్గొన్నారు.

 

గుంటూరులో

 పట్నంబజారు(గుంటూరు) :  పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం అరండల్‌పేట నుంచి భారీ ప్రదర్శన నిర్వహిస్తూ జగన్‌కు చికిత్స చేస్తున్న ప్రభుత్వాసుపత్రికి నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలి వెళ్ళారు. జగన్‌ను చూసేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో ఆగ్రహించిన కార్యకర్తలు అక్కడే రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top