అభయమిస్తూ...

అభయమిస్తూ... - Sakshi


శ్రీకాకుళం : జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను పరామర్శించేందుకు వచ్చిన వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఆద్యంతం బాధితుల భుజం తడుతూ.. వారిలో మనోధైర్యం కల్పిస్తూ పర్యటించారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు తొలుత అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామిని దర్శించుకున్న ఆయన, అక్కడి నుంచి పెదగణగళ్లవానిపేట బయలుదేరారు. దారిలో కిల్లిపాలెం, కల్లేపల్లిలో బాధితులను ఉద్దేశించి ప్రసంగించారు. బాధితులు మనోస్థైర్యాన్ని మాత్రం కోల్పోవద్దని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష నేతగా మీ తరఫున పోరాటం చేస్తామంటూ.. తమ పోరాటానికి మద్దతు తెలపాలని ప్రజలను కోరారు. తుపాను బీభత్సానికి పంటలు, ఇళ్లు పోయి పుట్టెడు కష్టంలో ఉన్నా.. ఎండతీవ్రతను సైతం లెక్కచేయక తనను చూసేందుకు వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ముందుకు సాగారు.

 

 5న మండలాల్లో ధర్నాలు

 తుపాను సాయం పంపిణీలో విఫలమైన ప్రభుత్వ తీరుకు నిరసనగా మండలస్థాయిలో నవంబరు 5న జరిగే ధర్నాలో పెద్ద ఎత్తున బాధితులు పాల్గొనాలని జగన్ పిలుపునిచ్చారు. ఉద్యమించకుంటే న్యాయం జరగదని, ఇప్పటికే ప్రజలను చంద్రబాబు ఎన్నో రకాలుగా దగా చేశారని ప్రజలకు ఉదాహరణలతో సహా వివరించారు. దారిపొడవునా తమను కలిసేందుకు   వచ్చిన వారిని నిరాశ పరచకుండా ఆప్యాయంగా పలకరిస్తూ భవిష్యత్‌లో మంచే జరుగుతుందని చెబుతూ వారికి ధైర్యం చెప్పారు. కల్లేపల్లిలో ఓ రైతు ధాన్యం గాలిపోస్తుండగా అతనిని పలకరించి దిగుబడి తగ్గిందని తెలుసుకుని ఆవేదన చెందారు. పెద్దగణగళ్లవానిపేటలో మత్స్యకారుల దుస్థితిని గమనించి ఆందోళన చెందారు. శ్రీకాకుళం పట్టణంలోని తురాయిచెట్టు వీధి, వైష్ణపువీధి, మహిళామండలి వీధుల్లో ఇంటింటికీ వెళ్లి బాధితులను పరామర్శించడంతో... ఇప్పటి వరకు తమ ఇంటికి వచ్చి పలకరించిన తొలి వ్యక్తి మీరేనంటూ మహిళలు తమ బాధలను మరిచి జగన్‌కు స్వాగతం పలికారు. అల్లినగరంలో ఓ వికలాంగుడు ఇచ్చిన వినతిని తీసుకుని అతనికి భరోసా కల్పించారు.

 

 మురపాక వెళ్తుండగా మార్గంమధ్యలో కలసిన వ్యవసాయ కూలీలను పలకరించి, ఏ మేరకు పనులు జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఇదే గ్రామంలో అరటితోట తుపానుకు నేలకొరగ్గా పొలంలోనికి వెళ్లి నిశితంగా పరిశీలించి రైతుకు ఎంత నష్టం జరిగిందోనంటూ వాకబు చేశారు. చంద్రబాబు కపటమాటలు చెబుతూ కాలవెళ్లదీస్తున్నారని, ఇంత కష్టకాలంలోనూప్రజలను ఆదుకోవడంలేదని జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇలా ప్రతి గ్రామంలోనూ జగన్ ప్రసంగిస్తూ పర్యటిస్తుండగా మహిళలు పెద్ద ఎత్తున స్వాగతించారు. రైతులు, రైతుకూలీలు, డ్వాక్రా మహిళలు తమ కష్టాలను జగన్‌కు చెప్పుకొని తమ గుండెల్లో గూడుకట్టుకున్న బాధ నుంచి సాంత్వన పొందారు. ప్రతిపక్షంగా మీ తరఫున మేము పోరాటం చేస్తామని  జగన్ అంటున్నుప్పుడల్లా ప్రజల నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సాయంత్రం ఆరున్నర గంటలకు జగన్ తన పర్యటనను ముగించుకుని విశాఖపట్నం బయలుదేరారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top