బషీర్బాగ్ అమరులకు వైఎస్ జగన్ నివాళి

బషీర్బాగ్ అమరులకు వైఎస్ జగన్ నివాళి - Sakshi


హైదరాబాద్ : విద్యుత్‌ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి గురువారం నివాళులు అర్పించారు. బషీర్‌బాగ్‌ కాల్పులకు 14 ఏళ్లు నిండిన సందర్భంగా షహీద్‌ చౌక్‌లో అమరులకు ఆయన ఈరోజు ఉదయం శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల స్ఫూర్తి తమకు ఆదర్శమన్నారు.


ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ విద్యుత్ కోసం అవస్థలు పడుతున్న ప్రజలు, రైతులు, ప్రతిపక్షాలు ఏకమై బాబు నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తే వారిని చంద్రబాబు పిట్లల్ని కాల్చినట్లు కాల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నాటి ఘటనకు గుర్తు చేసుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుందన్నారు. వైఎస్  జగన్‌తోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు స్థూపం దగ్గర నివాళులు అర్పించారు.



కాగా విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన బషీర్‌బాగ్‌ కాల్పుల దుర్ఘటన జరిగి నేటికి 14 ఏళ్లు పూర్తయ్యాయి. చంద్రబాబు నాయుడు ప్రారంభించిన విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఆనాడు వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు... బషీర్‌బాగ్‌ చౌరస్తాలో గుమికూడిన ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పాయారు.



వామపక్ష నేతలు సురవరం సుధాకరరెడ్డి, బీవీ రాఘవులు, కె.నారాయణ, గాదె దివాకర్‌ సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై నమోదైన కేసులు సైతం ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. విద్యుత్‌ ఉద్యమంలో అసువులు బాసిన వారి గుర్తుగా బషీర్‌బాగ్‌ చౌరస్తాలో స్థూపం నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అనుమతించారు. ఉద్యమంలో మరణించిన వారి కుటుంబసభ్యులకు ఆర్థికసాయం అందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top