జన నీరాజనం

జన నీరాజనం - Sakshi


సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనకు జనం నీరాజనాలు పట్టారు. శనివారం ఉదయం విశాఖ నుంచి రోడ్డుమార్గంలో వచ్చిన ఆయనకు నాయకులు,కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఆయన పర్యటించిన మార్గమంతా జనంతో నిండిపోయింది. తొలుత పైడిభీమవరంలో 9.45గంటలకు ఆయన వైఎస్ విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం  మాట్లాడుతూ చంద్రబాబు మోసాలకు పాల్పడుతున్నారంటూ తూర్పారబెట్టారు. ఆయన మాటలకు జనం నుంచి భారీ స్పందన కనిపిం చింది. డ్వాక్రా మహిళలు, నిరుద్యోగ యువత, రైతులకు జరుగుతున్న మోసాల్ని దెప్పి పొడిచారు.

 

 టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రజలకు ఏ ఒక్క పరిష్కారం లభించిందలేదని మండిపడ్డారు. టీడీపీ వల్ల ఏమైనా లబ్ది పొందారా అని జగన్ ప్రశ్నిస్తే జనం నుంచి లేదు అని సమాధానమే వచ్చింది. 10.30గంటలకు పతివాడపాలెంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. తర్వాత శ్రీకాకుళం మీదుగా ఆమదాలవలస టీఎస్సార్ కళాశాలకు 11.35గంటలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు ఆయనతో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. సెల్ఫీలు తీసుకున్నారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న జనం జగన్‌ను చూడగానే సంతోషపడ్డారు. పలువురు విజ్ఞాపన పత్రాలందించారు. రొట్టవలసలో గ్రామస్తుల్ని జగన్ పలకరించారు. 12.15గంటల సమయంలో సరుబుజ్జిలి చేరుకుని బాగోగులు అడిగి తెలుసుకున్నారు. దారిలో రైతుల్ని పలకరించారు.

 

 రైతుల మట్టికొట్టారు

 సరుబుజ్జిలి మార్గంలో గ్రామస్తులు తమ కష్టాల్ని చెబుతూ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తమ నోట్లో మట్టికొట్టారని శాపనార్ధాలు పెట్టారు. అర్హులకూ పెన్షన్లివ్వలేదని, రూ.25వేల లోపే మాఫీ జరిగింద ని చెప్పారు. సొంత భూమి ఉందా అని జగన్ అడిగినప్పుడు కౌలు చేస్తున్నామని అక్కడివారు చెప్పారు. డ్వాక్రా రుణాల్లోనూ మోసం జరిగిందన్నారు. ఒంటిగంట సమయంలో జగన్ హిరమండలం చేరుకున్నారు. బ్యారేజీ కూడలిలో వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల దీక్షా శిబిరాన్ని సందర్శించారు. సీపీఎం నేతల సహా అంతా సమస్యల్ని జగన్ దృష్టికి తీసుకువచ్చారు.

 

 ఏళ్లవుతున్నా పనులు పూర్తవుతున్నా ప్యాకేజీ అందలేదని, పరిహారం పూర్తిగా ఇవ్వలేదని, ఉద్యోగాలివ్వలేదని, చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో పూర్తిన్యాయం చేస్తామని ఇప్పుడు చేతులెత్తేస్తున్నారని బాధితులు వాపోయారు. నిర్వాసితుల సంఘం సభ్యులు జగన్‌కు విజ్ఞాపన పత్రం అందించారు. నిర్వాసితుల సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని, 2013ప్యాకేజీ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం అందజేయాలని జగన్ డిమాండ్ చేశారు. వంశధార వంటి చిన్న ప్రాజెక్టు నిర్వాసితులకే ప్రభుత్వం న్యాయం చేయలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు సంఘీభావంగా కొద్దిసేపు కూర్చున్నారు.  

 

 బాబూ మీరే సీఎం కావాలి

  పైడి భీమవరం నుంచి కొత్తూరు వెళ్లేంతవరకు జగన్ గ్రామస్తుల్ని పలకరిస్తూనే ఉన్నారు. వృద్ధుల తలపై నిమిరి భరోసా ఇచ్చారు. పిల్లల్ని ముద్దాడారు. యువతకు భరోసా ఇచ్చారు. కృష్ణాపురానికి చెందిన బూర్ల రామ్మూర్తి నాయుడు అనే సర్పంచ్ జగన్‌ను కలిసి స్థానిక సమస్యల్ని ప్రస్తావించారు. పారాపురం, పారాపురం-కొత్తూరు, గూనభద్ర ప్రాంత గ్రామస్తులతో జగన్ మాట్లాడారు.  సేవ్ గర్ల్ అనే సంస్థ పోస్టర్‌ను జగన్ ఆవిష్కరించారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో జగన్ కొత్తూరు మీదుగా మాతల చేరుకున్నారు. ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. వధూవరులను  ఆశీర్వదించారు.

 

  కొత్తూరు నుంచి వివాహ వేదికకు వెళ్లే దారిలో జగన్ కోసం జనం బారులు తీరారు. ఆయన్ను చూద్దామని ఉత్సాహంగా ఎండలోనూ నిల్చున్నారు. ఆయనే జగనన్న అంటూ పిల్లలకు చూపించారు.  మిద్దెల మీద, గోడల మీద, పొలం గట్లంట, ఇళ్ల ద్వారాల నుంచి జగన్‌ను చూసేందుకు తహతహలాడారు. వివాహ కార్యక్రమానంతరం జగన్ శ్రీకాకుళం కొత్త బ్రిడ్జివరకు తిరుగు ప్రయాణంలోనూ జనాన్ని పలకరిస్తూ, భవిష్యత్తు మనదే అంటూ అభయమిచ్చారు.

 

  జగన్ పర్యటనలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాధరావు, పార్టీనేతలు తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి, గుడివాడ అమరనాథ్(విశాఖ),  చెవిరెడ్డి భాస్కరరెడ్డి(చంద్రగిరి ఎమ్మెల్యే), మాజీ ఎమ్మెల్యేలు పిరియా సాయిరాజ్, మీసాల నీలకంఠంనాయుడు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు దువ్వాడ శ్రీనివాస్, గొర్లె కిరణ్, నర్తు రామారావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు రొక్కం సూర్యప్రకాశరావు, శిమ్మ రాజశేఖర్, అంధవరపు సూరిబాబు, వరుదు కళ్యాణి,  దువ్వాడ వాణి, టి.కామేశ్వరి, చింతాడ మంజు,  టొంపల సీతారాం, కిల్లి వెంకట సత్యన్నారాయణ, దుంపల శ్యామ్, అల్లంశెట్టి కె.వి.వి.సత్యన్నారాయణ, సాధు వైకుంఠరావు,సనపల నారాయణరావు, మామిడి శ్రీకాంత్, మండవిల్లి రవి, గొర్లె రాజగోపాల్, పైడి శ్రీనివాసరావు, సీపాన రామారావు, లంకలపల్లి ప్రసాద్, చింతాడ గణపతిరావు, ఎం.వి.స్వరూప్, కె.ఎల్.ప్రసాద్, బల్లాడ జనార్ధనరెడ్డి, కిల్లాన సాయి పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top