'భూములు ఇచ్చి కన్నీరు పెట్టుకున్నారు'

'భూములు ఇచ్చి కన్నీరు పెట్టుకున్నారు' - Sakshi


హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని ప్రాంతంలో రేపు ఉదయం 8 గంటల ప్రాంతంలో పర్యటించనున్నట్టు ఆ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) తెలిపారు. సోమవారం ఆయన లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పర్యటనలో భాగంగా కౌలురైతులు, కూలీలు పడుతున్న బాధలను వైఎస్ జగన్ స్వయంగా చూడనున్నారని ఆర్కే తెలిపారు. ఉండల్లి, పెనుమాక, ఎర్రబాలెం, బేతపూడి గ్రామాల మీదుగా వైఎస్ జగన్ పర్యటన సాగుతుందని చెప్పారు.  వైఎస్ జగన్ను కలిసేందుకు గొర్రె కాపరులు, జాలర్లు కూడా సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు.



రాష్ట్ర ప్రభుత్వం అక్రమమైన ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిందని విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించింది మొదలు.. రైతులకు కంటిమీద కునుకులేకుండా పోయిందని అన్నారు. అధికారులను ఉపయోగించి రైతులను భయభ్రాంతులకు గురిచేశారని ఆర్కే ఆరోపించారు. పోలీస్టేషన్ గడప ఎక్కని రైతులను విచారణ పేరుతో హింసించారని మండిపడ్డారు. భూసేకరణ చట్టంలో సవరణలపై చర్చ జరగుతుండగానే.. ఇక్కడ భూమిని సేకరిస్తామని చెప్తున్నారని తెలిపారు. ల్యాండ్ పూలింగ్ చివరి రెండురోజుల్లో రైతులను విపరీతంగా భయపెట్టారని చెప్పారు. భూములను ఇచ్చిన చాలామంది రైతులు ఇప్పుడు కంటనీరు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయని ఆర్కే గుర్తుచేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top