పది పైసలు వాటా ఇస్తే సంతకం పెడతా

పది పైసలు వాటా ఇస్తే సంతకం పెడతా - Sakshi


సీఎం, మంత్రులకు విపక్షనేత జగన్‌ సవాల్‌

కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై నాపై కేసులు పెట్టాయి

‘సాక్షి’ పెట్టుబడిదారులకు లాభాలే..

శాసనసభలో ప్రతిపక్షనేత స్పష్టీకరణ




సాక్షి, అమరావతి:

తన ఆస్తుల విషయమై టీడీపీ నేతలు చేసిన ఆరోపణలపై ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘రూ. 43 వేల కోట్ల ఆస్తులు అంటున్నారు కదా. అందులో పది పైసలు భాగం ఇస్తారేమో చెప్పమనండి. నా ఆస్తులపై ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకం పెడతా..’ అంటూ అధికార పక్ష నేతలకు విపక్ష నేత జగన్‌ సవాల్‌ విసిరారు. మంగళవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీ సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతుండగా మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన 43 వేల కోట్ల ఆస్తులను సీబీఐ జప్తు చేసిందంటూ ఆరోపణలు చేశారు.



దీనిపై స్పందించిన జగన్‌ ‘నోరు తెరిస్తే అబద్దాలు చెబుతున్నారు. నాకు సంబంధించిన రూ. 43 వేల కోట్ల ఆస్తులను సీబీఐ అటాచ్‌ చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు అంటున్నారు కదా. అందులో పదిపైసలు వాటా ఇమ్మనండి వారు ఎక్కడ అడిగితే అక్కడ సంతకాలు పెడతా. సిద్దమా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడి నుంచి అందరికీ నేను సవాల్‌ విసురుతున్నా...’ అని జగన్‌ ఛాలెంజ్‌ చేశారు.



కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై నాపై కేసులు..



కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై తనపై కేసులు పెట్టాయని జగన్‌ గుర్తు చేశారు. ‘ రెండోది సీబీఐ ఛార్జిషీట్లు అని అంటున్నారు. ఆ విషయానికి వస్తే అసలు నామీద కేసులు ఎప్పుడు పెట్టారు. రాజశేఖరరెడ్డి బతికున్నంతకాలం జగన్‌మోహన్‌రెడ్డి, రాజశేఖరరెడ్డి మంచివారే. రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత నేను కాంగ్రెస్‌ను వదిలేసిన తర్వాత నాపై కేసులు పెట్టింది ఎవరు. కాంగ్రెస్‌ పార్టీ వారు చంద్రబాబు నాయుడికి చెందిన టీడీపీ వారు కుమ్మక్కై నాపై కేసులు పెట్టారు. (మేం కేసులు పెట్టామా అని టీడీపీ నేతలు రన్నింగ్‌ కామెంట్రీ చేయగా) అవును ఇదే అచ్చెన్నాయుడు అన్న ఎర్రన్నాయుడు కేసులు పెట్టించారు. కాంగ్రెస్, టీడీపీ వారిద్దరూ కుమ్మక్కై కేసులు పెట్టారు.’ అని జగన్‌ నొక్కి చెప్పారు.



టీడీపీ నేతల ఆరోపణలపై జగన్‌ స్పందన ఆయన మాటల్లోనే... ‘43,000 కోట్ల ఆస్తులని మీరు అంటున్నారు. కదా అందులో పదిపైసల వాటా ఇస్తారోమో చెప్పమనండి నా ఆస్తులు ఎక్కడంటే అక్కడ సంతకం పెడతా. మొత్తం 11 ఛార్జిషీట్లు కూడా లెక్కకడితే తేలేది ఆరోపణల కింద చూపించింది కేవలం రూ. 1200 కోట్లు. ఇది కూడా నిర్ధారణ అయింది కాదు. ఆరోపణల కింద చూపిన రూ. 1200 కోట్లలో కూడా క్రైమ్‌ పిరియడ్‌ (2004 – 2009)తో సంబంధం లేని విషయాలు ఉన్నాయి.


2009 తర్వాత కూడా సాక్షి అనే సంస్థ దేశంలోనే ఎనిమిదో స్థానంలో ఉంది. దేశంలో ఏబీసీ రిపోర్టుల ప్రకారం ‘సాక్షి’ దేశంలో ఎనిమిదో స్థానంలో ఉంది. ‘ఈనాడు’ అనే సంస్థ వంద రూపాయల షేరును రూ. 5.26 లక్షలకు అమ్మింది. రూ. 1860 కోట్ల నష్టాలతో (అక్యుమలేటెడ్‌ లాసెస్‌తో) ఉన్న ఈనాడు సంస్థ వంద రూపాయల షేరును 5.26లక్షలకు విక్రయించింది. అలాంటి పరిస్థితుల్లో ఈనాడు షేరు విలువ కంటే సగం ధరకే ‘సాక్షి’ పెట్టుబడిదారులకు షేర్లు ఇచ్చింది. ఎక్కడా దీంట్లో స్కామ్‌లేదు. అందరూ లాభాల్లోనే ఉన్నారు. దీనికి ఈ బ్రాండ్‌ ఇమేజ్‌ కూడా ఉంది. ఈనాడు, సాక్షిలో పెట్టుబడులు పెట్టిన వారెవరూ నష్టపోలేదు. పెట్టుబడిదారులంతా లాభాల్లోనే ఉన్నారు. దయచేసి మీ రికార్డులన్నీ పూర్తిగా మార్చుకునే కార్యక్రమం చేసుకోండి.

ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత టెండర్లా?

విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు టెండర్లలో పాల్గొనాలని అచ్చెన్నాయుడు ఇచ్చిన సూచనపై జగన్‌ మండిపడ్డారు. ప్రాజెక్టులు అయిపోయిన తర్వాత టెండర్లలో పాల్గొనాలని సూచించడం ఏమిటని ప్రశ్నించారు. ‘పక్కన తెలంగాణలో మెగావాట్‌ రూ. 4.46 కోట్లు లెక్కన చేశారు. గుజరాత్‌లో మెగావాట్‌ రూ. రూ. 4.76 కోట్లకు చేశారు. ఇంకా వేరే చోట్ల మెగావాట్‌ రూ. 3.96 కోట్లుకు చేశారు. చరిత్ర ఇది కాగా ఇక్కడ మీ వద్ద మాత్రం మీ హయాంలో కృష్ణపట్నంలో మెగావాట్‌కు రూ. 6.35 కోట్లు ఇచ్చారు. వీటీపీఎస్‌లో మెగావాట్‌కు 5.86 కోట్లు ఇచ్చారు. ఇందులో మెగావాట్‌కు రెండు కోట్లు ‘‘కిక్‌బ్యాక్స్‌’’ (ముడుపులు) అందాయి. ఆల్‌రెడీ ఎప్పుడో ప్రాజెక్టులు అయిపోయాయి. కిక్‌బ్యాక్స్‌ అందాయి. క్విడ్‌ప్రోకో అర్థం ఏదో నా వద్ద నుంచి వచ్చిందంటున్నారు. అవును బ్లాక్‌ మనీ తీసుకుని సూట్‌ కేసుల్లో పెట్టి తీసుకెళ్లి ఆడియో టేపులు, వీడియో టేపుల్లో దొరికిపోయింది నేనే... అని జగన్‌ ఇంకా చెబుతుండగానే స్పీకర్‌ మైక్‌ కట్‌ చేశారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top