నా పార్టీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టవచ్చా?

నా పార్టీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టవచ్చా? - Sakshi


హైదరాబాద్: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు తనను హంతకుడు, నరరూప రాక్షసుడు, ఉన్మాది అనవచ్చా?అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను స్మగర్లుగా పేర్కొంటూ.. పదే పదే రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా తాను సంయమనం పాటించిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడిన అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. టీడీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగిస్తేనే, తన వ్యాఖ్యలు కూడా తొలగించాలన్నారు. ఈ మూడు నెలల్లో జరిగిన హత్యలకే పరిమితం అవుదామని తాను భావిస్తే.. వారేమో అసలు విషయాన్ని ప్రక్కకు పెట్టారని మండిపడ్డారు. ఇప్పటివరకూ జరిగిన హత్యలపై బాధిత కుటుంబాలు ఆతృతగా ఎదురుచూస్తున్నాయని విజ్ఞప్తి చేసినా టీడీపీ సభ్యులు పట్టించుకోలేదన్నారు.


 


'పరిటాల హత్య కేసులో విచారణ జరిగింది. దోషులకు శిక్ష పడింది. ఇప్పటికే సంఘటన జరిగి పదేళ్లు అయింది. ఈ అంశానికి, నాకు సంబంధం లేదని చంద్రబాబుకూ తెలుసు.ఈ సంఘటనతో జేసీ సోదరులకు సంబంధం లేదనే వారికి టిడిపి టికెట్లు ఇచ్చారు'అని జగన్ స్పష్టం చేశారు. తనను ఉద్దేశించి టీడీపీ వాళ్లు మాట్లాడినట్లుగా మా పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబును మాట్లాడితే ఆ పార్టీ ఎమ్మెల్యేలు చూస్తూ ఊరుకునే వారేనా? అని నిలదీశారు. 'టీడిపి ఎమ్మెల్యేలు ఏది మాట్లాడినా ఫర్వాలేదా?, మమ్మల్ని విమర్శించిన వాళ్లనే అన్నాను తప్పా సభలో ఉన్న అందరిని కాదని జగన్ ఈ సందర్భంగా తెలిపారు.


 


'మా నాన్నను ఉద్దేశించి అంత దారుణంగా మాట్లాడారు. నేను ప్రతిపక్ష నాయకుడినన్న సంగతి వాళ్లకు తెలియదా?, వాళ్ల మాటలు రికార్డుల నుంచి తొలగిస్తేనే  నా మాటలు కూడా తొలగించాలని' జగన్ డిమాండ్ చేశారు. 'మృతుల కుటుంబీకుల స్థానంలో కూర్చుని మీరు ఆలోచించండి.అసెంబ్లీలో జరుగుతున్నది తప్పా? ఒప్పా?, న్యాయం ఎవరి వైపో మీడియా వారి వైపే ఉంటుంది. యాజమాన్య ఉద్దేశాలు పక్కనబెట్టి మీ మనస్పాక్షిగా రిపోర్ట్‌ చేయండి' అని మీడియా ప్రతినిధులకు జగన్ తెలిపారు.  పదకొండు హత్యలు ఏమైనా చిన్న సంఖ్యా?..ఇప్పటికై ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top