జనం రాళ్లతో కొట్టే రోజులొస్తాయి: వైఎస్ జగన్‌


చంద్రబాబుకు జగన్ హెచ్చరిక

రోజుకో అబద్ధంతో ప్రజలను మోసం చేస్తున్నారు

రుణ మాఫీపై దగాతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు

రైతులు, డ్వాక్రా మహిళలు లక్షకు రూ. 13 వేల వడ్డీ కట్టాల్సి వస్తోంది

వారి పొదుపు సొమ్మునూ లాగేసుకుంటున్నారు

బాబు మోసాలను ఎండగడదాం.. ప్రజల తరఫున ఉద్యమిద్దాం

పార్టీ నేతలు, కార్యకర్తలకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత పిలుపు




సాక్షి, గుంటూరు:
‘‘ప్రతి అడుగులో మోసం.. నోరు తెరిస్తే అబద్ధం.. పూటకో అబద్ధం చెప్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనాన్ని నిలువునా దగా చేస్తున్న చంద్రబాబును రాబోయే రోజుల్లో అదే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. బాబు మాటలు నమ్మిన రైతులు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రుణాలు తిరిగి చెల్లించాల్సిన గడువు ముగియటంతో లక్ష రూపాయలపై ఏకంగా రూ.13 వేలు వడ్డీగా కట్టాల్సిన పరిస్థితి దాపురించిందని.. ఖరీఫ్ వ్యవసాయానికి కొత్త రుణాలు కూడా బ్యాంకులు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. రైతులతో పాటు, డ్వాక్రా మహిళలపైనా ఇంతే మొత్తంలో భారం పడుతోందని చెప్పారు.

 

 వారు పైసా పైసా చొప్పున పొదుపు చేసుకున్న సొమ్మును సైతం చంద్రబాబు మోసపూరిత వైఖరి ఫలితంగా బ్యాంకులు బకాయిల కింద తీసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ రకంగా చంద్రబాబు సర్కారు చెప్తున్న అబద్ధాలు, చేస్తున్న మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని.. ప్రజల తరఫున ఉద్యమించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గుంటూరు లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ నేతలు, కార్యకర్తలతో జగన్‌మోహన్‌రెడ్డి గురువారం గుంటూరులో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు అవసరమైన సూచనలు, సలహాలు అన్నీ పాటిస్తామని.. కానీ అధికార కాంక్షతో చంద్రబాబులా అబద్ధాలు మాత్రం ఆడనని స్పష్టంచేశారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలివీ...

 

 పదవి కోసం బాబు ఏ గడ్డి తినటానికైనా సిద్ధం...


 ‘‘సంస్థాగతంగా మనం తప్పులు చేసి ఉంటే అవి పునరావృతం కాకూడదు. ఇటీవలి ఎన్నికల్లో బాబు కూటమికి, మనకి తేడా 5.6 లక్షల ఓట్లు మాత్రమే. అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడడానికి, ఎన్ని మోసాలైనా చేయడానికి, ఏ గడ్డి అయినా తినడానికి బాబు వెనుకాడలేదు. మనం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఉంటే ప్రజలకు న్యాయం చేయగలమా? రాష్ట్రంలోని ప్రతి రైతు మనల్ని తిట్టుకునేవాడు. ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తరువాత 30 ఏళ్ల పాటు ఎంత మంచి చేయాలంటే.. నేను చేసిన మంచి చూసి చనిపోయిన తరువాత కూడా ప్రతి ఇంట్లో నాన్న ఫొటోతో పాటు నా ఫొటో ఉండాలి.

 

 పొదుపు సొమ్మునూ లాగేసుకుంటున్నారు...


 చంద్రబాబు అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీలు ఒక్కటై ఆయనను సీఎం పీఠంపై కూర్చోబెట్టాయి. ఇప్పుడు బాబు మోసం ప్రజలకు కనిపిస్తోంది. ఆయన ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదు. గ్రామాల్లోకి వెళితే రైతులు రుణ మాఫీ గురించి అడుగుతున్నారు. రైతులు పంటలు వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. పాత రుణాలు కడితే గానీ, కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. జూన్ 30వ తేదీ లోపు రుణాలు కట్టలేదు కాబట్టి 13 శాతం వడ్డీ సహా బకాయిలు చెల్లించాలని రైతులకు బ్యాంకులు చెప్తున్నాయి. కొత్త రుణాలు ఇవ్వడం లేదు.

 

పంట బీమా కట్టడం లేదు. ఇంత దారుణంగా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడు. డ్వాక్రా మహిళల పొదుపు నుంచి సొమ్మును బ్యాంకులు తీసుకుంటున్నాయి. రూ. లక్షకు రూ. 13,000 వడ్డీ కడితేగానీ రుణం రెన్యువల్ కాని పరిస్థితి నెలకొంది. అలాంటి బాబును రక్షించేందుకు టీవీ9, ఈనాడు, ఆంధ్రజ్యోతి కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఈ మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. మనకున్నది చంద్రబాబుకు లేనిది దేవుడి దయ, ప్రజల గుండెల్లో స్థానం. చంద్రబాబు, టీడీపీ సర్కారు చేస్తున్న మోసాలను, వాస్తవాలను ప్రజలకు చెప్పాలి. బాబును నిలదీయాలి.

 

 బాబు నిజం చెప్తే తల వెయ్యి వక్కలవుతుంది...

 ‘పొరపాటుగా అయినా చంద్రబాబు నోట్లో నుంచి నిజం చెప్తే తల వెయ్యి ముక్కలవుతుంది’ అని చంద్రబాబుకు ఓ ముని శాపం ఉంది. అందుకే ఆయన నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తున్నారు. ఇంటికో ఉద్యోగం.. ‘బాబు వస్తాడు - జాబు తెస్తాడని’ ప్రచారం చేశారు. నిరుద్యోగులకు రూ. 2,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. కానీ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో యూటర్న్ తీసుకున్నారు. తానెప్పుడూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పలేదని మాట మార్చుతున్నారు. ప్రైవేటు ఉద్యోగాలు అయితే ఎవరైనా ఇస్తారు.. దానికి బాబు ఎందుకు? నిరుద్యోగ భృతి గురించి బాబు అసలు మాట్లాడటం లేదు. ఇలా అడుగడుగునా ప్రజలను మోసం చేస్తున్నారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని జగన్‌మోహన్‌రెడ్డి ఉద్బోధించారు. ఈ సమీక్షలో వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top