పొంతనలేని లెక్కలు!


* ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన జగన్

* బడ్జెట్‌పై శాసనసభలో తన ప్రసంగం ముగించకుండానే మైక్ కట్ చేశారని ఆవేదన

* ముగించే అవకాశం ఇవ్వాలని సభలో 20 నిమిషాలపాటు వేడుకున్న విపక్షనేత

* అవకాశం ఇవ్వకపోవడంతో వాకౌట్

* తర్వాత విలేకరుల సమావేశంలో ప్రభుత్వ బడ్జెట్‌ను ఎండగట్టిన ప్రతిపక్షనేత

* మీరైనా ప్రజలకు తమ వాదన వినిపించాలని మీడియాకు విజ్ఞప్తి

* సహనం కోల్పోయే పరిస్థితులు వస్తే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం తప్పదని స్పష్టీకరణ

 

సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 2014-15 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పొంతనలేని లెక్కలపై ప్రతిపక్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలుకు నిధులు ఏ మేరకు అవసరం? బడ్జెట్‌లో కేటాయింపు చేసిందెంతో సవివరంగా చెబుతూ ప్రభుత్వ తీరును తూర్పార పట్టారు. అంశాలవారీగా ఒక్కొక్కటీ విడమరుస్తూ అధికారపక్షాన్ని ఎండగట్టారు.



బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా జగన్ తన ప్రసంగం ముగియలేదని, మరో అరగంట సమయమిస్తే ముగిస్తానని స్పీకర్‌ను కోరారు. ఆ రకంగా 20 నిమిషాల పాటు వేడుకున్నా ఫలితం లేకపోగా మైక్ కట్ చేశారు. దీంతో సభనుంచి వాకౌట్ చేసిన ప్రతిపక్షనేత మీడియా సమావేశంలో బడ్జెట్‌లోని ప్రభుత్వ అంకెల గారడీని బట్టబయలుచేశారు. ఏ ఒక్క అంశంలోనూ అవసరమైన నిధులు కేటాయించకపోవడాన్ని నిలదీశారు. సభలో ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, ప్రతిపక్షం లేకుండా చేయాలన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మీరైనా ప్రజల వాదన వినిపించాలని ఆయన మీడియాను కోరారు. దాదాపు గంటంపావు సేపు బడ్జెట్‌లోని లొసుగులను చెండాడుతూనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, స్పీకర్ తీరును తీవ్రంగా నిరసించారు. స్పీకర్ తీరు ఇదే మాదిరిగా కొనసాగితే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని స్పష్టంచేశారు. తాను ఇచ్చిన హామీలు అమలు చేయడంలో చిత్తశుద్ధిలేని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై దూషణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే...



వైఎస్సార్‌లా పాలించగల దమ్ముందా?

*  పొద్దున లేస్తే చాలు వైఎస్సార్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబును ఒక్కటే అడుగుతున్నా... వైఎస్ మాదిరిగా మీరు  ఒక్కరూపాయి కరెంటు ఛార్జీ పెంచబోమని చెప్పగలరా? ఒక్క రూపాయి కూడా ఆర్టీసీ ఛార్జీలు వేయమని చెప్పగలరా?, వ్యాట్ పెంచబోమనగలరా? వాటర్ చార్జీలు, మున్సిపల్ పన్నులు పెంచబోమని ఆయన మాదిరిగా సభలో చెప్పగలరా? ఉద్యోగస్థులకు అండగా ఉంటూ ప్రభుత్వరంగ సంస్థలను అమ్మబోమని చెప్పగలరా? ఆయన మాదిరిగా పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అర్హులైన అందరికీ (శాచురేషన్ పద్ధతిలో)సంక్షేమ పథకాలు అందించగలరా? అలా చెప్పగల దమ్మూ ధైర్యం చంద్రబాబుకు ఉందా?



పాలన అన్నది ప్రజలు హర్షించేదిగా ఉండాలి. అందుకు మొదట ఇచ్చిన మాటను నిలబెట్టుకొని నెరవేర్చాలి. అప్పుడే ప్రజలు హర్షిస్తారు. రైతులకు కొత్త రుణాలు అందడం లేదు. బకాయిలు కట్టనిదే బ్యాంకులు ఇవ్వడం లేదు. రెండు మూడు రూపాయల వడ్డీలకు బయటనుంచి తెచ్చుకుంటున్నారు. డ్వాక్రా మహిళల పరిస్థితీ అంతే. రైతుల పంటల బీమా కూడా అగమ్యగోచరంగా మారింది. ఇపుడు మీ రుణాలు మీరే కట్టుకోండని రైతులకు చెబుతున్నారు. ఇదేనా రైతులకు మీరిచ్చే భరోసా? ఇదేనా హామీలు నెరవేర్చే పద్ధతి? ఈ మూడునెలల్లో ఒక్కటన్నా మంచి పనిచేశారా?



* 11 మంది వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాజకీయంగా హత్యలకు గురై శాంతిభద్రతలపై చర్చకు మేము పట్టుబడితే దాన్నీ పక్కదోవ పట్టించేలా వ్యవహరించారు. చర్చ జరుగుతుండగా గుంటూరు, అనంతపురం జిల్లాల్లో మరో ముగ్గురిని చంపేశారు. చంద్రబాబూ... గుండెల మీద చేతులేసి ప్రశ్నించుకోండి. ప్రజలకు మంచి చేస్తున్నారా? మా గొంతు నొక్కుతున్నారా? అధికారంలో నేడు మీరున్నారు. రేపు మేముంటాం. ఎవరున్నా మన పాలన చూసి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. మంచి పాలన అందిస్తే వారిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. వారు చనిపోయాక కూడా బతికిన వారవుతారు. ఈరోజు మీ పాలన ఎలా ఉందో మీ ఆత్మసాక్షిని ప్రశ్నించుకోండి.



సహనం నశించేలా చేస్తే స్పీకర్‌పై అవిశ్వాసం తప్పదు

* చరిత్రలో ఎన్నడూ లేని మాదిరిగా ప్రతిపక్షానికి బడ్జెట్ చర్చలో గంటన్నర మాత్రమే ఇస్తామని, అంతకుమించి ఇచ్చేది లేదని స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెబుతున్నారు. ఇంతకన్నా నియంతృత్వ పోకడలు ఎక్కడుంటాయి? స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టాలని భావించినా దానిపై మళ్లీ చర్చ అవసరం. ఇప్పటికే మాకు చర్చలో తక్కువ సమయం ఇచ్చారు. కటింగ్‌లు మీద కటింగ్‌లు పెట్టారు. ఇలాంటి సమయంలో అవిశ్వాసం ఎందుకని ఓపికతో ఉంటున్నాం. ఓపిక నశించేలా వ్యవహరిస్తే మాత్రం అవిశ్వాసం పెట్టక తప్పదు.



* ప్రజలు ఏమీ వినరాదు. కనరాదు. వారిచ్చిన హామీలు, చేస్తున్న  కేటాయింపులు కనిపించకూడదన్న కుట్ర చేస్తున్నారు. ఇలాంటివారికి ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం చెబుతారు. ప్రజలకు ఏ మేరకు అవసరమో, బడ్జెట్లో ఏమేరకు  కేటాయింపులు చేశారో ప్రజలకు తెలియాలి. మీడియా ప్రజల తరఫున పోరాడాలి. వారికి వాస్తవాలు వివరించాలి.



* కాంగ్రెస్‌ను మేము తొలినుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించేయాలని మేము అవిశ్వాసం పెడితే చంద్రబాబునాయుడే కూలిపోకుండా మద్దతు ఇచ్చి నడిపించుకుంటూ వచ్చారు.



* అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఈ సమావేశంలో వైఎస్సార్సీఎల్పీ నాయకులు జ్యోతుల నెహ్రూ, పీడిక రాజన్నదొర, ఉప్పులేటి కల్పన, అమర్‌నాధ్‌రెడ్డి, కొడాలినాని, శ్రీకాంత్‌రెడ్డి, గిడ్డి ఈశ్వరి, జోగులు,విశ్వేశ్వరరెడ్డి గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, జంకె వెంకట్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top