నువ్వు కూడానా... చంద్రబాబూ?

నువ్వు కూడానా... చంద్రబాబూ? - Sakshi

► ద్రోహం చేసిన ముఖ్యమంత్రికి తెలుగుజాతి సూటి ప్రశ్న

► అభివృద్ధి చెందిన నగరాలతో మనం ఎలా పోటీ పడగలం


► లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ చంద్రబాబు మోసం చేస్తున్నారు


► ఎవరికి పడితే వాళ్లకు సూటు, బూటు వేసి ఎంఓయూలు చేశామని చూపించారు


► గుంటూరు యువభేరిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి


 


గుంటూరు:

రోమన్ చక్రవర్తి సీజర్‌ను తన స్నేహితుడు బ్రూటస్ కత్తితో వెన్నుపోటు పొడిచినప్పుడు ''యూ టూ.. బ్రూటస్'' అంటారని, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తెలుగుజాతి కోసం పోరాటం చేయాల్సిన ఈ వ్యక్తి వెన్నుపోటు పొడిచినప్పుడు యావత్ తెలుగుజాతి ''నువ్వు కూడానా చంద్రబాబూ'' అని ప్రశ్నిస్తోందని వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం గుంటూరు సమీపంలోని నల్లపాడులో గురువారం నిర్వహించిన 'యువభేరి' కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

 

  • ఎన్ని అడ్డంకులు పెట్టినా, మా శ్వాస, హక్కు ప్రత్యేక హోదా అంటూ మీరంతా వచ్చారు

  • పేరుపేరునా అందరికీ చేతులు జోడించి, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా

  • ప్రత్యేక హోదా సాధన కోసం మనమంతా ఇక్కడ ఏకమయ్యాం

  • మామూలుగా ఎక్కడైనా దేశం కోసం త్యాగాలు చేస్తే వాళ్లను స్వాతంత్ర్య సమరయోధులు అంటాం

  • రాష్ట్రం కోసం ఎవరైనా త్యాగాలు చేస్తే వాళ్లను అమరజీవులు అంటాం

  • ఇక్కడ ఉన్న ప్రతి చెల్లెమ్మ కోసం, ప్రతి తమ్ముడి కోసం త్యాగాలు చేసేవాళ్లను తల్లిదండ్రులు అంటాం

  • దేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న వచ్చినట్లుగా మనందరికీ తెలుసు

  • అప్పుడు దేశ జనాభా 33 కోట్లు. ఇప్పుడు దగ్గర దగ్గర 130 కోట్ల మంది వరకు ఉన్నారు

  • అప్పటితో పోలిస్తే మన ఆదాయాలు మారాయి, మన ఆహారధాన్యాల ఉత్పత్తి మారింది, విద్యుత్ వినియోగం పెరిగింది, వాహనాల అందుబాటులో కూడా చాలా తేడాలున్నాయి

  • రోడ్ల నిర్మాణంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి, ఉద్యోగావకాశాలు పెరిగాయి

  • ఏ అంశం చూసినా ఈ 70 ఏళ్లలో చాలా మార్పులు వచ్చాయి

  • ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు ఆలోచించాలి





     

  • ఏ దేశమైనా, రాష్ట్రమైనా, గ్రామమైనా కుటుంబమైనా ఏం కోరుకుంటుంది

  • మొన్నటి కంటే నిన్న, నిన్నటి కంటే నేడు, నేటికంటే రేపు బాగుండాలనే కోరుకుంటారు

  • దీన్నే ఆర్థికశాస్త్రంలో చెప్పాలంటే సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ అంటారు

  • ఇంతకుముందు సాధించిన అభివృద్ధిని నిలబెట్టుకుంటూ, మరింత ప్రగతి సాధించడం దాని అర్థం

  • ఒక కుటుంబాన్నే తీసుకుంటే తాత కంటే తండ్రి, తండ్రి కంటే కొడుకు ఎక్కువ చదువుకోవాలి, ఆర్థిక పరిస్థితి, నివసించే ఇల్లు, మొత్తం జీవితం నాణ్యత మెరుగుపడాలి. దీన్ని సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ అంటారు

  • ఒక్క ఉదాహరణ చెప్పాలంటే, ఇక్కడున్న చాలామందిలో 3జీ, 4జీ మొబైల్స్ కనిపిస్తాయి

  • మీ తల్లిదండ్రుల చిన్నతనం గురించి అడిగితే.. 40 ఏళ్ల క్రితం ఇంట్లో ఫోన్ ఉంటే చాలా సంపన్నుల కుటుంబం అనేవారు

  • ట్రంక్ కాల్ బుక్ చేస్తే ఆ రోజు కనెక్ట్ కాదు, మర్నాడు వచ్చేది

  • బైకులు అందుబాటులో లేవు, కార్లు కూడా అరుదుగా ఉండేవి

  • కరెంటు లేని ఇళ్ల కథ దేవుడెరుగు, కరెంటులేని గ్రామాలు కనిపించేవి

  • టీవీ చూడాలంటే ఊరంతా ఒక్కచోట ఏకం కావాలి.. ఆ ఒక్క ఇంట్లోనే దూరదర్శన్ మాత్రమే చూసేవారు

  • పూరిగుడిసెలు ఉండేవి తప్ప మేడలంటే ఏంటో తెలిసేది కాదు

  • ప్రభుత్వ బడుల్లో కూడా చదివించే స్థోమత లేక తల్లిదండ్రులు అగచాట్లు పడేవారు

  • కడుపు మాడ్చుకుని, తమ కనీస అవసరాలను కూడా త్యాగం చేసి పైసలు లెక్కపెట్టి పిల్లల్ని చదివించిన మహానుభావులు మనందరి తల్లిదండ్రులు

  • వాళ్ల గతం ఏంటో వాళ్లనే ఒక్కసారి అడిగి చూడండి.. మీ పెద్ద చదువుల వెనక పెద్ద మనసులు, వాళ్లు చేసిన పెద్ద త్యాగాలు ఉన్నాయి

  • ఆ తల్లిదండ్రులకు సెల్యూట్ చేస్తూ యువభేరి కార్యక్రమం మొదలుపెడుతున్నా

  • ప్రభుత్వం బాగుంటే పురోగతి బాగా కనిపిస్తుంది, అది బాగోకపోతే వెనక్కి వెళ్లే పరిస్థితి ఉంటుంది

  • హైదరాబాద్ నగరాన్నే మనం గమనిస్తే.. బీడీఎల్, హెచ్ఏఎల్, బీహెచ్ఈఎల్ ఫ్యాక్టరీలు, ఇక్రిశాట్, మిధాని, సీసీఎంబీ, ఐఐసీటీ, ఈసీఐఎల్, హెచ్ఎంటీ, డీఆర్‌డీఓ, డీఆర్‌డీఎల్, డీఎంఆర్ఎల్.. ఇలా అనేక సంస్థలు కనిపిస్తాయి

  • హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అన్నీ ఈ 70 ఏళ్లలో ప్రభుత్వాలు అందించిన తోడ్పాటుతో అభివృద్ధి చెందిన నగరాల జాబితాలో నిలిచాయి

  • ఇప్పుడు ఈ నగరాలతో మనం పోటీ పడాల్సి వస్తోంది.. ప్రభుత్వ సాయం లేకుండా ఎలా చేయగలమని ప్రశ్నిస్తున్నాను

  • రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లపోతే, 20-30 ఏళ్లు వెనక్కి వెళ్తే మన పరిస్థితి ఏంటని అడుగుతున్నా

  • సాధించిన అభివృద్ధిని నిలబెట్టుకోవాలి, మరో మెట్టు ఎదగాలి

  • ఇలా ఎదగాలంటే దీనికి ప్రత్యేక హోదా అనే ఒకే ఒక్కటి బ్రహ్మాస్త్రంగా తోడయితేనే ఇది సాధ్యం అవుతుంది

  • ఇవన్నీ ఈ ప్రభుత్వాలకు తెలియనివి కావు.. 

  • గతంలో ఎన్నికలకు ముందు వెంకయ్య నాయుడు, చంద్రబాబు కూడా హోదా గురించి మాట్లాడారు

  • ప్రత్యేక హోదా అంటే ఏంటన్న విషయానికి వస్తే.. అది మన పిల్లలకు మన ప్రాంతంలోనే, మన జిల్లాలోనే, మన రాష్ట్రంలోనే మంచి జీతంతో మంచి ఉద్యోగాలు రావడం





     

  • ఉద్యోగాల కోసం మన పిల్లలు వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి కాకుండా, ఉద్యోగాలే వేరే రాష్ట్రాల నుంచి మన ప్రాంతానికి రావడమే ప్రత్యేక హోదా

  • ఇలాంటి ప్రత్యేక హోదాను దగ్గరుండి చంద్రబాబు కత్తితో పొడుస్తున్నారు

  • తాను పోరాటం చేయకపోగా చేసేవాళ్లను కూడా అణిచేస్తున్నారు

  • ప్రత్యేక హోదా కోసం బంద్ చేస్తే, దగ్గరుండి ఆర్టీసీ బస్సులు తిప్పిస్తారు

  • ధర్నాలు చేస్తే దగ్గరుండి ధర్నాలను నీరుగార్చే కార్యక్రమాలు చేస్తారు, ఎవరైనా వస్తే పిల్లలని కూడా చూడకుండా వాళ్ల మీద పీడీయాక్ట్ పెట్టాలని ఆదేశిస్తారు

  • జనవరి 26న కొవ్వొత్తులతో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా ర్యాలీలు చేయాలని తలపెడితే ఇదే చంద్రబాబు దగ్గరుండి ర్యాలీలో పాల్గొనకుండా ప్రతిపక్ష నాయకుడిని కూడా ఎయిర్‌పోర్టులోనే రన్‌వే మీదే ఆపడాన్ని చూశాం

  • మనం బస్సు రోకో, రైల్ రోకో చూసి ఉంటాం.. విమానాల రోకో కూడా చంద్రబాబు హయాంలో తొలిసారి చూశాం

  • గతంలో రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్‌ అన్న మాటలు గుర్తుకొస్తాయి 

  • సీజర్‌ను తన స్నేహితుడు బ్రూటస్ కత్తితో వెన్నుపోటు పొడిచినప్పుడు ''యూ టూ.. బ్రూటస్'' అంటారు

  • ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తెలుగుజాతి కోసం పోరాటం చేయాల్సిన ఈ వ్యక్తి వెన్నుపోటు పొడిచినప్పుడు యావత్ తెలుగుజాతి ''నువ్వు కూడానా చంద్రబాబూ'' అని ప్రశ్నిస్తోంది

  • హోదాయే సంజీవని అని ఆవాళ చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు

  • ఇదే చంద్రబాబు, ఇదే వెంకయ్య నాయుడు ఇద్దరూ కలిసి ఐదున్నర కోట్లమంది ప్రజలను వెన్నుపోటు పొడుస్తుంటే యావత్ రాష్ట్రం నివ్వెరపోయి చూస్తోంది

  • తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు

  • తెలుగు వాళ్ల ప్రయోజనాలను ఢిల్లీలో కాళ్ల మీద పారేస్తే ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుందేమో అనిపిస్తోంది

  • ఇంత దారుణంగా మన జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు

  • ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు పెట్టారు

  • గత సంవత్సరం 2016 జనవరిలో కూడా ఇలాంటి కార్యక్రమం పెట్టారు, అప్పుడు రూ. 4.67 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీలో వస్తున్నాయని, ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెప్పారు

  • ఇన్ని ఎంఓయూలు చేస్తే.. ఇందులో 2.82 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని కూడా చంద్రబాబు అబద్ధాలు చెప్పారు

  • ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతుంటే వ్యవస్థలో మార్పు ఎలా వస్తుంది

  • సాధారణంగా ఎంఓయూలు అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తారు, దాన్ని ఐఈఎం అంటారు. ఇది రెండో దశ

  • ఇది చేయకపోతే పీసీబీ క్లియరెన్సులు రావు, బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వవు

  • 4.67 లక్షల కోట్లకు ఎంఓయూలు చేశామని, 2.82 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని చంద్రబాబు అబద్ధాలు చెబుతుంటే, కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం 2016 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు మొత్తం ఫైల్ అయిన ఐఈఎంలు కేవలం 34,464 కోట్ల రూపాయలు మాత్రమే

  • కానీ ఐఈఎంలు ఫైల్ చేసిన ప్రతి ఒక్కరూ పరిశ్రమలు పెడతారని కూడా కాదు

  • ఇదే 2015లో అయితే 21,300 కోట్ల ఐఈఎంలు ఫైల్ చేశారు.. 2014లో 21,526 కోట్లు ఫైల్ అయ్యాయి

  • వీటిలో ఎన్ని ఇంప్లిమెంట్ అయ్యాయంటే, 2014లో 2,804 కోట్లు మాత్రమే. 2015లో రూ. 4,542 కోట్లు మాత్రమే

  • దీన్ని బట్టి చూస్తే 2016 సంవత్సరానికి మహా అయితే మరో 7వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వస్తాయి

  • చంద్రబాబు ఇంతలా అబద్ధాలు చెబుతుంటే, మోసాలు చేస్తుంటే ఈ పెద్దమనిషిని చూసి నవ్వాలో, ఏడవాలో అర్థం కావట్లేదు

  • 2016లో 4.67 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఇంత మోసం చేసి, 2017లో ఇంకా పెద్దమోసం చేయడానికి సిద్ధమయ్యారు

  • 2017 జనవరిలో ఏకంగా 10.54 లక్షల కోట్ల ఎంఓయూలు సంతకాలు చేశామంటూ అబద్ధాలు మొదలుపెట్టారు

  • ఆయన ఎవరికి పడితే వాళ్లకు సూటు, బూటు వేసి, వాళ్లతో ఎంఓయూలు చేసేసుకున్నారు

  • త్రిలోక్ కుమార్ అనే వ్యక్తి చంద్రబాబుతో ఎంఓయూ సంతకం చేశారు. ఈయన విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందినవారు. ఈయన చేసే పని పారిశ్రామిక వేత్త గంధం నందకుమార్ వద్ద నుంచి ప్రెస్‌నోట్లు తెచ్చి, విలేకరులకు ఇస్తారు. అంటే కంపెనీ పీఆర్వో.

  • ఇతడికి సొంత వాహనం కూడా లేదు. ఈ మనిషి.. మొన్న చంద్రబాబుతో ఎంఓయూ చేసుకున్నారు

  • మరోవ్యక్తి పేరు సుధీర్. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడుకు చెందినవాడు. పాత పెంకుటిల్లు, భార్య అంగన్‌వాడీ టీచర్. ఈయన చేసేది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఏజెంటు. ఈయనకు కూడా సూటు, బూటు తగిలించి చంద్రబాబు ఎంఓయూ చేసుకున్నారు

  • రాష్ట్రం బాగుండాలని, పెట్టుబడులు రావాలని అందరూ ఆశిస్తాం. కానీ ప్రజలను మోసం చేయాలన్న ఉద్దేశంతో ఎవరితో పడితే వాళ్లతో ఎంఓయూలు చేసేసి 10.54 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెబుతుంటే ఆయన ప్రభుత్వంలో సాల్మన్ ఆరోఖ్యరాజ్ అని పారిశ్రామిక శాఖ కార్యదర్శి ఉన్నారు. ఆయన అసలు సంతకాలు పెట్టనని నిరాకరించారు

  • పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కు రావాలంటే చంద్రబాబు దావోస్, సింగపూర్, చైనా, జపాన్‌లకు వెళ్లాలనుకోవడం మూర్ఖత్వం

  • చంద్రబాబు సుందర ముఖారవిందాన్ని చూసి ఎవరూ పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రారు, జగన్ చెప్పాడని ముందుకు రారు


  • పరిశ్రమలు పెడితే ప్రత్యేక హోదాతో మాత్రమే వచ్చే పారిశ్రామిక రాయితీలు ఇస్తేనే వస్తారు

  • ఇన్‌కం టాక్స్, ఎక్సైజ్ డ్యూటీ కట్టక్కర్లేదు, రవాణా వెనక్కి ఇస్తారు, బ్యాంకు రుణాల్లో 3 శాతం వడ్డీ సబ్సిడీ ఉంటుంది

  • ఇలాంటి రాయితీలు ఇస్తేనే ఎవరైనా పరిశ్రమల కోసం ముందుకొస్తారు

  • ఇదే చంద్రబాబు రాష్ట్రమంతా బ్రహ్మాండంగా ఉందని, హోదా లేకపోయినా పెట్టుబడులు వస్తున్నాయని, హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రంలో ఉన్నవాళ్లకు సంకేతాలు ఇస్తున్నారు

  • కేంద్రంలో ఉన్నవాళ్లు చంద్రబాబు ఎలా ఆడమంటే అలా ఆడుతున్నారు

  • పరిశ్రమలు రావాలంటే అవి పెట్టడానికే రెండు మూడేళ్లు పడుతుంది కాబట్టి ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలని చెప్పారు

  • వెంకయ్య నాయుడు కూడా ఐదు కాదు.. పదేళ్లు హోదా ఇవ్వాలని పార్లమెంటులో చెప్పారు

  • అలాంటి వాళ్లిద్దరూ ఇప్పుడు హోదా గురించి పచ్చి అబద్ధాలు చెబుతూ, మాటలు మారుస్తున్నారు

  • ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఏమొస్తుందని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు

  • ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు దేశంలో 11 మాత్రమే ఉన్నాయి. వీటి జనాభా కేవలం 7.5 కోట్లు

  • 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో ఇది 6.5 శాతం 

  • ఈ రాష్ట్రాలకు 76980 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి గ్రాంటులు ఇచ్చారు

  • మిగిలిన 93.5 శాతం జనాభాకు 186820 కోట్లు కేంద్రం నుంచి గ్రాంటులు ఇచ్చారు

  • అంటే, 6.5 శాతం జనాభాకు 30 శాతం గ్రాంటులు ఇస్తున్నారన్న మాట

  • కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా చూద్దాం

  • ఏపీ విడిపోకముందు 8.54 కోట్ల జనాభా ఉండేది

  • 2013-14లో చూసుకుంటే కేంద్రం నుంచి వచ్చిన నిధులు 32460 కోట్లు వచ్చాయి

  • అంటే, ఆ 11 రాష్ట్రాలకు కలిపినా ఆంధ్ర రాష్ట్రం కంటే జనాభా తక్కువ. కానీ వాళ్లకు 91980 కోట్లు వచ్చాయి

  • ఇదంతా చంద్రబాబుకు కనిపించడం లేదా

  • కేంద్రప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి శనక్కాయలు, పప్పు బెల్లాల్లా చిన్న చిన్న పారిశ్రామిక రాయితీలు ఇచ్చారు. వాటిని చూసి ఎవరూ ముందుకు రావట్లేదు

  • ఇవే రాయితీలను పక్కన తెలంగాణ, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలకూ ఇచ్చారు

  • చంద్రబాబు ఎప్పుడూ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటారు

  • పక్కన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఉన్నాయి. ప్రత్యేక హోదా లేకుండా వాటితో మనం ఎలా పోటీ పడగలం?

  • ప్రత్యేక హోదా అన్నది ఒక్క జగన్ మాత్రమే పోరాడితే సాధ్యమయ్యే పనికాదు.. మనం అడగడం మానేస్తే ప్రత్యేక హోదా అడిగేవాడు ఎవ్వరూ ఉండరు

  • మనం గట్టిగా నిలదీస్తేనే వాళ్లు మర్చిపోకుండా ఉంటారు

  • రాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్లు సాధించుకున్నారు, పార్లమెంటు సాక్షిగా మనకిచ్చిన మాటను మనమంతా గట్టిగా నిలబడితే ఎందుకు సాధ్యం కాదని అడుగుతున్నా

  • రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా ఒత్తిడి తీసుకొస్తాం

  • రేపు జూన్, జూలై నెలల్లో మూడేళ్ల పాలన ముగుస్తుంది.. అప్పుడు పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు ఏర్పాటైతే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా రాజీనామా చేస్తారు, దేశం మొత్తం చూసేలా చేస్తారు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top