నెట్టేస్తే 'డోంట్ టచ్ మీ' అన్నందుకు కేసా?

నెట్టేస్తే 'డోంట్ టచ్ మీ' అన్నందుకు కేసా? - Sakshi


కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓట్లకు కోట్లు కురిపించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని ఆయన మంగళవారం పరామర్శించారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ విలువలకు పాతర వేసిన చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. లంచాల సొమ్ముతో ఓట్లు కొనుగోలు చేశారని, ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లకు కోట్లు గుమ్మరించారన్నారు.



అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్ సీపీ నేతలను బెదిరించారని, తప్పు చేసి తిరిగి వాళ్లే కేసులు పెట్టారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. భూమా నాగిరెడ్డిపై కుట్ర చేసి కేసు పెట్టారని, ఎమ్మెల్యే అఖిలప్రియపై దురుసుగా ప్రవర్తించరన్నారు. మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా నెట్టడంతో పాటు, దుర్భాషలాడారని, ఇదేమిటని ప్రశ్నించినందుకు భూమా నాగిరెడ్డిపై కేసు పెట్టారని వైఎస్ జగన్ అన్నారు.



కన్న కూతురిని దుర్భాషలు ఆడితే.. తండ్రిగా ఆయన స్పందించారని, ఆ సమయంలో భూమా నాగిరెడ్డిని అక్కడ నుంచి పక్కకు నెట్టేశారని, దాంతో ఆయన తనను నెట్టొద్దంటూ 'డోంట్ టచ్ మీ' అన్నారని, ఆ పదాన్ని తీసుకుని భూమాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి చివరకు ఆయనకు బెయిల్ కూడా రాకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. అసలే భూమా నాగిరెడ్డికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందని, అయితే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్కు తరలించాలని వైద్యులు సూచించినా... కక్ష గట్టి కర్నూలులోనే ఉంచారన్నారు.



అదేమంటే హైదరాబాద్ వేరే రాష్ట్రం అంటున్నారని, మరి చంద్రబాబుకు అక్కడే నివాసం ఉందని, ఓటర్, ఆధార్ కార్డు కూడా హైదరాబాద్లోనే ఉందని, అలాంటప్పుడు అది వేరే రాష్టమన్న విషయం గుర్తు రాదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.  చంద్రబాబు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, ఎల్లకాలం టీడీపీ అధికారంలో ఉండదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. చంద్రబాబు సర్కారు బంగాళాఖాతంలో కలిసిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top