అక్కాచెల్లెళ్ల ఆత్మీయత

అక్కాచెల్లెళ్ల ఆత్మీయత - Sakshi


నంద్యాలలో జగన్‌ రోడ్‌షోకు పోటెత్తిన మహిళలు

అడుగడుగునా ముస్లిం మహిళల నీరాజనాలు

శాంతి కపోతాలను ఎగురవేసిన జననేత

కూల్‌డ్రింక్స్‌ అందజేసి అభిమానాన్ని చాటుకున్న ఆర్యవైశ్య దంపతులు

జనాభిమానం వెల్లువెత్తడంతో పాదయాత్రగా మారిన రోడ్‌షో




సాక్షి బృందం, నంద్యాల :నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రోడ్‌షోకు ఎనిమిదో రోజు బుధవారం  మహిళలు నీరాజనాలు పలికారు. అడుగడుగునా గజమాలలు వేస్తూ.. దారిపొడవునా గులాబీలు, ముద్దబంతి పూలు చల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.అన్ని కాలనీలలో మహిళలు వేల సంఖ్యలో పోటెత్తారు. జగనన్నను చూసి కేరింతలు కొట్టారు. ఎన్ని గంటలు ఆలస్యమైనా ఓపికతో వేచిచూసి.. జగనన్నను చూసిన తర్వాతే ఇళ్లకు వెళ్లారు. మహిళలతో పాటు యువత, వృద్ధులు..ఇలా వేలాదిమంది తరలివచ్చి నీరాజనాలు పలికారు.



 పట్టణంలోని హరిజనపేట నుంచి ప్రారంభమైన రోడ్‌షో మాల్దారిపేట, స్వాలిహీనమసీదు, నడిగడ్డ, నబీనగర్, కోటవీధి, జగజ్జననీ నగర్‌ మీదుగా ఆత్మకూరు జంక్షన్‌ వరకు కొనసాగింది. కేవలం మూడు కిలోమీటర్ల రోడ్‌షోకు 11 గంటల సమయం పట్టింది. హరిజన పేటలో  వెంకటలక్ష్మి, సుభద్ర, మరియమ్మ తదితరులు జననేతతో మాట్లాడారు. ‘జగనన్నా..మేం పూరిగుడిసెల్లో ఉంటున్నాం. మీరు గెలిస్తే పక్కాగృహాలు ఇవ్వాలని కోర’గా ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు. దీంతో వారంతా సంబరపడ్డారు. జగనన్నను చూడాలన్న ఉద్దేశంతో తాము కళాశాలకు కూడా వెళ్లలేదని పుణ్యావతి, పద్మావతి తదితర డిగ్రీ, జూనియర్‌ కళాశాల విద్యార్థినులు చెప్పడం ఆయన పట్ల ఉన్న అభిమానానికి నిదర్శనం. ప్రతి అవ్వ, ప్రతి యువతి ఇలా ప్రతి ఒక్కరూ జననేత నుదుటిపై తిలకం దిద్ది.. పూలమాలలు వేస్తూ నీరాజనాలు పలికారు.



పాదయాత్రగా మారిన రోడ్‌షో

జనాభిమానం వెల్లువెత్తడంతో రోడ్‌షో కాస్త పాదయాత్రగా మారింది. మాల్దారిపేట, స్వాలీహీన మసీదు, నడిగడ్డ ప్రాంతాల్లో ముస్లిం మహిళలు తమ ఇళ్లకు రావాలంటూ జగన్‌ను ఆహ్వానించారు. దీంతో ఆయన నడుచుకుంటూ వారి ఇళ్లకు వెళ్లారు. ఇలా కిలోమీటరుకుపైగా పాదయాత్రగానే పర్యటించారు. హారున్‌ బాషా అనే వ్యక్తి ఇంటికి వెళ్లగా.. వైఎస్‌ జగన్‌కు శాలువా కప్పి సన్మానం చేశారు. బ్రహ్మణవీధిలో పురోహితులు నర్సింహ, గుండాచారులు శాలువా కప్పి.. వేదమంత్రాలు చదివి ఆశీర్వదించారు. ఉసేన్‌ బీ అనే 75 ఏళ్ల వృద్ధురాలు ఇంటి ముందు కనిపించడంతో జగన్‌ ఆ ఇంటిలోకి వెళ్లి ఆ అవ్వను ఆప్యాయంగా పలకరించారు.



మరో ఇంట్లో ఉన్న మహమ్మద్‌ ఉస్సేన్‌ (80) అనే వృద్ధున్ని పలకరించగా... ‘మీ నాన్న (వైఎస్‌ రాజశేఖరరెడ్డి) ఫీజు రీయింబర్స్‌మెంట్, ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్‌ కల్పించడంతో మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయ’ని చెప్పారు. మీరు సీఎం అయితే ఈ పథకాలు కొనసాగించాలని కోరారు.  వీటిని కచ్చితంగా కొనసాగిస్తామని వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా హామీనిచ్చారు. నడవలేని వృద్ధురాలు అమినాబీ(85).. జగన్‌ను చూడాలని పట్టుబట్టడంతో కుటుంబ సభ్యులు ఇంట్లోకి రావాలని ఆహ్వానించారు. దీంతో జగన్‌ వెళ్లి ఆప్యాయంగా పలకరించడంతో అమినాబీ ఎంతో సంబరపడింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా తమ సోదరులు ఉన్నత చదువులు చదువుకున్నారని ముస్లిం యువకులు సలీం, మహముద్దీన్‌లు జగన్‌ దృష్టికి తెచ్చారు. అక్కడి నుంచి జాకీర్‌ ఉస్సేన్‌ ఇంటిలోకి జగన్‌ వెళ్లడంతో అక్కడ మత పెద్దలు ప్రార్థనలు నిర్వహించారు.



మా నినాదం శాంతి

పావురాలను ఎగురవేయాలని విద్యార్థులు తమ అభిమాన నేతను కోరారు. హరిజనపేటలో రోడ్‌ షో ప్రారంభించిన సందర్భంగా వైఎస్‌ జగన్‌ శాంతికి చిహ్నమైన పావురాలను ఎగురవేశారు. తమ నినాదం శాంతి అనే సందేశాన్ని పంపారు. రోడ్‌షో నడిగడ్డలో సాగుతున్న సందర్భంలో తమ ఇంటి వద్దకు జగన్‌ రావడంతో  ఆర్యవైశ్య దంపతులు జయకృష్ణ, లత సంబరపడిపోయారు. కూల్‌డ్రింక్‌ అందజేసి..అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి, పార్టీ నేతలు వైఎస్‌ వివేకానందరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దేశం సులోచన, సీఈసీ సభ్యుడు రాజగోపాల్‌ రెడ్డి, కౌన్సిలర్లు మహబూబ్‌ చాంద్‌బీ, వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top