గెలుపు గుర్రాలు

గెలుపు గుర్రాలు - Sakshi


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ప్రకటించారు. సంతనూతలపాడు, మార్కాపురం అసెంబ్లీ స్థానాలు, బాపట్ల పార్లమెంట్ స్థానానికి అభ్యర్థులను ప్రకటించాల్సి వుంది.



మహానేత వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా, పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేసే అభ్యర్థులనే పార్టీ ఎంపిక చేసిందని రాజకీయ మేధావులు విశ్లేషిస్తున్నారు.  సొంత టీమ్‌తో జగన్ సక్సెస్ బాటలో వెళుతున్నారని లెక్కలు కడుతున్నారు.

 

సాక్షి, ఒంగోలు: సార్వత్రిక సమరంలో ప్రజాదరణ పొందుతూ  దూసుకెళ్తోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆపార్టీ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదంతో హైదరాబాద్ కార్యాలయవర్గాలు అభ్యర్థుల జాబితా మీడియాకు విడుదల చేశారు. ఒంగోలు లోక్‌సభకు వైవీ సుబ్బారెడ్డి, నెల్లూరు ఎంపీ స్థానానికి మేకపాటి రాజమోహన్‌రెడ్డి పోటీ చేయనున్నారు.

 

బాపట్ల లోక్‌సభ అభ్యర్థి వ్యవహారాన్ని పెండింగ్‌లో ఉంచారు. అసెంబ్లీ అభ్యర్థుల విషయానికొస్తే..ఒంగోలు స్థానం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీఎల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డికి, అద్దంకి మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు గొట్టిపాటి భరత్, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, గిద్దలూరు ముత్తుమల అశోక్‌రెడ్డి, కనిగిరి బొర్రా మధుసూదన యాదవ్, కందుకూరు ఎమ్మెల్సీ పోతుల రామారావు, కొండపి(ఎస్సీ రిజర్వుడు) పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు జూపూడి ప్రభాకర్, యర్రగొండపాలెం (ఎస్సీ రిజర్వుడు) మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు, చీరాల యడం బాలాజీకి కేటాయిచారు. సంతనూతలపాడు, మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులెవరనేది త్వరలో తేలనున్నాయి.   

 

 

గెలుపుగుర్రాలపై శ్రేణుల్లో ఉత్సాహం..



లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఖరారైన పది నియోజకవర్గాల అభ్యర్థులందరూ గెలుపు గుర్రాలేనంటూ ఇప్పటికే ప్రచారం జోరుగా సాగుతోంది. సోమవారం ఉదయం నుంచే అభ్యర్థుల జాబితా కోసం టీవీ చానెళ్లను ఆసక్తిగా తిలకించిన ప్రజలు .. మధ్యాహ్నం 12.45 నిముషాలకు జాబితా విడుదల కాగానే జిల్లావ్యాప్తంగా సందడి చేశారు. గ్రామగ్రామాన పార్టీ నేతలు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుని.. తమ అభ్యర్థులు ఎన్నికల్లో గెలిచినంత స్థాయిలో వేడుకలు జరుపుకున్నారు.



చీరాలలో యడం బాలాజీ అనుచరులు, కందుకూరు పోతుల రామారావు వర్గం, కొండపిలో జూపూడి ప్రభాకర్‌రావు అభిమానులు బాణాసంచా కాల్చారు. హైదరాబాద్ నుంచి ఒంగోలుకు మధ్యాహ్నం రెండుగంటల తర్వాత చేరుకున్న వైఎస్సార్ సీఎల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డికి పార్టీశ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది.



ఒంగోలు నివాసానికి చేరుకోగానే ఆయనకు నేతలు, కార్యకర్తలు హారతులు పట్టి.. పూలదండలతో ముంచెత్తారు. చీరాల, కొండపి అసెంబ్లీ అభ్యర్థులు యడం బాలాజీ, జూపూడి ప్రభాకర్‌రావు, జిల్లాపార్టీ అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ, పార్టీ అనుబంధ కమిటీల నేతలు ఒంగోలులోని బాలినేని నివాసానికి వచ్చి ఆయనకు పుష్పగుచ్ఛాలందించి శుభాకాంక్షలు తెలిపారు.

 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కాలనీల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల జాబితా విడుదలకు సంబంధించి పండుగ వాతావరణం ఏర్పడింది. కనిగిరి, గిద్దలూరు, దర్శి, యర్రగొండపాలెం, పర్చూరు నియోజకవర్గాల్లో పార్టీశ్రేణులు ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారు. ప్రధానంగా ఖరారైన అభ్యర్థులంతా ఇంతకుముందే ఆయా నియోజకవర్గాల్లో పనిచేస్తూ.. పార్టీతరఫున ప్రజాసమస్యలపై పోరాడిన వారైనందున అన్నివర్గాల్లో అభిమానులు పెరిగారు.ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరఫున పార్టీనేతలు, క్రియాశీలక కార్యకర్తలు అన్నిప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ... వారి గెలుపు బాధ్యతను భుజానికెత్తుకుని పనిచేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top