పల్లెలు కన్నీరు పెడుతున్నాయి

పల్లెలు కన్నీరు పెడుతున్నాయి - Sakshi


వరద ప్రాంతాల పర్యటనలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

వర్షాలకు ఇల్లు కూలిపోవటంతో ప్రజలు నీళ్లలో గడుపుతున్నారు

రెండు వారాలుగా పనులు దొరక్క పస్తులుంటున్నారు

ఏ ఒక్కరికీ సాయం అందలేదు... వారెలా బతకాలి?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను మోసం చేస్తున్నారు

డబ్బులు ఇవ్వకుండా అధికారులపై అరుస్తున్నారు

బాధితులను ఆదుకోకుంటే పోరాటం తప్పదు

నెల్లూరు జిల్లాల్లో పర్యటించిన విపక్ష నేత .. బాధితులకు పరామర్శ




ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

నెల్లూరు: ‘‘వరదలకు గ్రామాలకు గ్రామాలు మునిగిపోయాయి. వేలాది ఇళ్లు కూలిపోయాయి. సర్వం కోల్పోయి అనేక కుటుంబాలు వీధినపడ్డాయి. వారంతా 12 రోజులుగా నీళ్లలోనే ఉన్నారు. పనుల్లేక పస్తులుంటున్నారు. వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోంది. చంద్రబాబు వచ్చారు, చూశారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగారు డబ్బులు ఇవ్వకపోతే బాధితులకు వారెలా సాయం చేస్తారు? అందుకే వారు సర్వే చేయడానిక్కూడా వెళ్లలేదు. కొన్ని ప్రాంతాలకు వెళ్తున్నారు. మరికొన్ని ప్రాంతాలకు వెళ్లలేదు. కష్టాల్లో ఉన్న వరద బాధితులకు ప్రతి కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.5వేల చొప్పున ఇవ్వాలి. పనులు దొరికేంతవరకు ఆ డబ్బులతో కడుపైనా నింపుకుంటారు’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా  గూడూరు నియోజకవర్గ పరిధిలోని వాకాడు, చిల్లకూరు మండలాల్లోని వరద బాధిత ప్రాంతాల్లో ఆయన బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తీవ్రంగా నష్టపోయి వీధినపడ్డ వరద బాధితులకు సాయం అందించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.



తక్షణసాయం అందించాలి

ఇళ్లు కూలిపోయి.. పనుల్లేక అనేకమంది పస్తులతో గడుపుతున్నారని.. ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించాల్సి ఉన్నా పట్టించుకోలేదని జగన్ మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణ సాయం కింద కుటుంబానికి రూ.5 వేలు చొప్పున అందించాలని డిమాండ్ చేశారు. ఎడతెరిపి లేని వర్షాలతో నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో రైతులు పంటలు కోల్పోయారని తెలిపారు. రొయ్యల రైతులైతే తీవ్రంగా నష్టపోయారని, రూ.కోట్లు విలువచేసే రొయ్యలు, పిల్లలు కొట్టుకుపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.



వరద బాధితులందరికీ ప్రభుత్వం సాయం అందించాల్సింది పోయి.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తూనే రూ.1,690 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పిన చంద్రబాబు తర్వాత లేదని చెప్పారని గుర్తుచేశారు. కరువు మండలాల ప్రకటన సెప్టెంబర్, అక్టోబర్‌లో ప్రకటించాల్సిన వాటిని వరదలొచ్చి వెళ్లాక ప్రకటించారని విమర్శించారు. కరువు మండలాలను ఇప్పుడు ప్రకటిస్తే అధికారులు సర్వే ఎప్పుడు చేయాలి? ఈ సమయంలో సర్వే చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. చంద్రబాబు అడుగడుగునా మోసం, దగా చేస్తున్నారని మండిపడ్డారు. వరద బాధితులకు ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకోకపోతే పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top