అందరి అభ్యున్నతే.. నా అభిమతం

అందరి అభ్యున్నతే.. నా అభిమతం - Sakshi


► నంద్యాల ప్రజలకు అండగా ఉంటా

► మీరు చూపిన ప్రేమాభిమానాలు, ఆప్యాయత మరువలేనివి

► ఇంతకు ముందు చంద్రబాబు ఒక్కసారైనా నంద్యాల వచ్చారా?

► రోడ్‌షోలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

► దిగ్విజయంగా ముగిసిన ఉప ఎన్నిక ప్రచారం

►  చివరిరోజూ పోటెత్తిన జనం




సాక్షి బృందం, నంద్యాల : ‘నంద్యాల అభివృద్ధి విషయం నాకు వదిలేయండి. పట్టణంలోని మార్కెట్‌యార్డులో పేదల నుంచి ఈ టీడీపీ ప్రభుత్వంలో పన్నులు వసూలు చేస్తున్నారు. దేవుడి దయతో మనం అధికారంలోకి  వస్తే ఏ ఒక్కరూ పన్నులు చెల్లించే అవసరం ఉండద’ని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అలాగే ఆటోనగర్‌లో ఏ ఒక్కరికీ స్థలాలు పోవని, వారికి అండగా ఉంటామని, అవసరమైతే రిజిష్టర్‌ కూడా చేయిస్తామని హామీ ఇచ్చారు.  అగ్రిగోల్డ్, కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. పేదవారందరికీ సొంతిళ్లు నిర్మిస్తామన్నారు. నంద్యాలను జిల్లా చేసి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని స్పష్టం చేశారు.


నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన సోమవారం పట్టణంలోని గాంధీ చౌక్‌లో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. తాను 13 రోజులుగా నంద్యాల పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించానని, మీరు చూపిన ప్రేమాభిమానాలను, ఆత్మీయతను రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారని అన్నారు. దీంతో చంద్రబాబు వెన్నులో భయం పుట్టుకొచ్చిందన్నారు. ఆయన భయం ఎలాంటిదో తనకు ఓ అభిమాని చెప్పాడని, నంద్యాలలో ఇన్ని రోజులు  జగన్‌కు పనేంటని చంద్రబాబు అన్నట్లు తెలిపాడన్నారు.  ఉప ఎన్నిక ముందు  చంద్రబాబు  ఒక్కసారైనా నంద్యాల ముఖం చూశారా అని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా నందిగామ ఉపఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీ పోటీ పెట్టినప్పుడే  అక్కడి వెళ్లారని గుర్తు చేశారు.  



అభివృద్ధి అంటే సీఎం దృష్టిలో ఇదేనా?

సీఎం చంద్రబాబు దృష్టిలో నంద్యాల అభివృద్ధి అంటే రెండు, మూడు కిలోమీటర్ల మేర దుకాణాలను టపాటపా పగులగొట్టడమేనా అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. రోడ్డు వేసే సమయంలో బాధితులకు న్యాయం చేయకుండా ప్రభుత్వం ముష్టి వేసినట్లు గజానికి రూ.18 వేలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. రోడ్డు విస్తరణలో సర్వం కోల్పోయిన బాధితులకు తాము అధికారంలోకి వచ్చాక గజానికి రూ.లక్ష చొప్పన పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.  



దిగ్విజయంగా ముగిసిన ప్రచారం  

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నంద్యాల నియోజకవర్గంలో 13 రోజుల పాటు చేపట్టిన ఉప ఎన్నిక ప్రచారం దిగ్విజయంగా ముగిసింది. చివరి రోజు సోమవారం రోడ్‌షోకు కూడా ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చారు. పట్టణంలోని ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ సర్కిల్‌  వద్ద రోడ్‌షో ప్రారంభమైంది. తమ అభిమాన నేతను చూసి యువకులు, ప్రజలు, రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులు కేరింతలు కొట్టారు. ఆ కళాశాలకు చెందిన విద్యార్థినులు శివలక్ష్మీ, మమత, ముంతాజ్, వరలక్ష్మి, నిష.. జగనన్నను కలిసి  సెల్ఫీలు తీసుకుని సంబరపడ్డారు. రోడ్‌షోలో రాధ అనే మహిళ తన కుమారుడు సుమన్‌ను అందించి సెల్ఫీ తీసుకుని పొంగిపోయింది.


హసీన, ముంతాజ్‌లు పూలమాల వేసి సెల్ఫీలు తీసుకున్నారు.నాసర్‌అలీ అనే వికలాంగుడు జననేతకు పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి ఆనందపడ్డాడు. సుబ్బమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలిని ఇంటి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించడంతో ‘బాగున్నావా నాయనా’ అంటూ సంబరపడింది. తన మనవడు అల్లిషెరన్‌ను జగన్‌ తీసుకోవడంతో మంజుపీర్‌ రహిమాన్‌ అనే ముస్లిం సోదరుడు సంబరపడ్డారు.  ఇలా రోడ్‌షో మున్సిపల్‌ పార్క్, ఫాతిమా స్కూల్, మున్సిపల్‌ హైస్కూల్, బైర్మల్‌ సెంటర్, కల్పనా సెంటర్, సాహెబ్‌ దర్గా, ముల్లాన్‌పేట, పెద్దమార్కెట్‌ మీదుగా గాంధీచౌక్‌ వరకు కొనసాగింది.


అన్ని కాలనీల్లో జనం పోటెత్తారు. వేల సంఖ్యలో తరలివచ్చారు. ఎండ తీవ్రంగా ఉన్నా అభిమానులు ఏమాత్రమూ లెక్కచేయకుండా వీధుల వెంట పోటెత్తారు. పట్టణంలో రోడ్‌షో ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ఈ కార్యక్రవకుంలో పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి,  మాజీ ఎమ్మెల్సీలు శిల్పా చక్రపాణిరెడ్డి, రెహమాన్, పసుపల బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



రామకృష్ణ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ మద్దతు

 వైఎస్‌ జగన్‌ రోడ్‌షో నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల మీదుగా వెళ్తుండగా ఆ కళాశాల కరస్పాండెంట్‌ రామకృష్ణారెడ్డి జననేతకు దుశ్శాలువా అందించి తమ కాలేజీలోకి సాదరంగా ఆహ్వానించారు. అలాగే పార్టీ అభ్యర్థి మోహన్‌రెడ్డిని ఆప్యాయంగా పలకరించారు. ఎన్నికల్లో పూర్తి సహకారం అందిస్తామంటూ మద్దతు తెలిపారు.మహమ్మద్‌ ముస్తాక్‌ కుటుంబ సభ్యులు తమ ఇంట్లోకి జగన్‌ను ఆహ్వానించారు. ముస్తాక్‌కు జగన్‌ వైఎస్‌ఆర్‌సీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.  కల్పనా సెంటర్‌లో మంజుపీర్‌ రహంతుల్లా దర్గాలోకి జననేత వెళ్లి..  ముస్లిం సోదరులతో కలిసి దువా చేశారు. 



ముస్లింలకు అండగా ఉంటా : శిల్పా

నంద్యాల నియోజకవర్గంలో ప్రతి ముస్లిం సోదరుడికి అండగా ఉంటానని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నంద్యాలలోని గాంధీ చౌక్‌లో జరిగిన రోడ్‌ షోలో ఆయన మాట్లాడారు. తాను ఎవరినీ ఎప్పుడు కూడా ఒక్క మాట అనలేదన్నారు. టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని, ఇది సరైంది కాదని అన్నారు. తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టానన్నారు. 


ఇందులో ప్రధానంగా నంద్యాల ప్రజల దాహార్తి తీర్చేందుకు ఉచితంగా మినరల్‌ వాటర్‌ను అందిస్తున్నామని గుర్తు చేశారు. అన్ని కాలనీలకు నీటి సమస్య లేకుండా చేశామన్నారు. శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు, వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు.  శిల్పా సేవా సమితి, సేవా సంస్థలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించడంలో నిజం లేదన్నారు. శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. నేడు ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని అనాథ అని  ముఖ్యమంత్రి పేర్కొనడం ఎంతవరకు సమంజసమన్నారు. ఆయనకు తల్లిదండ్రులు ఉన్నారని, ఎలా అనాథ అవుతారని ప్రశ్నించారు. నంద్యాల అభివృద్ధికి తాను అనునిత్యం కృషి చేస్తానన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top