అండగా ఉండేందుకే

అండగా ఉండేందుకే - Sakshi


*రైతు దీక్షపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

*ప్రతిపక్ష నేత దీక్షకు మద్దతుగా జన సంద్రంగా మారిన తణుకు

*ఉదయం 10 గంటలకే పూర్తిగా నిండిపోయిన దీక్షా ప్రాంగణం

*వేలాదిగా తరలివచ్చిన రైతులు, మహిళలు

*జగన్‌కు సంఘీభావంగా అంచనాలకు మించి మహిళల వెల్లువ

*వైఎస్‌ఆర్ విగ్రహానికి నివాళులర్పించి దీక్ష ప్రారంభించిన జగన్

 *ఆత్మహత్య చేసుకున్న రైతులకు మౌనం పాటించి సంతాపం

 

 రైతు దీక్షా శిబిరం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతిలో రాష్ట్ర వ్యాప్తంగా మోసపోయిన రైతులు, డ్వాక్రా సంఘాల అక్క, చెల్లెమ్మలకు అండగా నిలవడానికే దీక్ష చేపట్టామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. తణుకులో శనివారం రైతు దీక్ష ప్రారంభించిన సందర్భంగా ప్రజల కోరిక మేరకు మాట్లాడిన జగన్ తన ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించారు. రైతులు, మహిళలు, ఇతర అన్ని వర్గాల వారికి చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే మండల, జిల్లా స్థాయిల్లో పార్టీ తరఫున ఆందోళనలు నిర్వహించామని పేర్కొన్నారు. ఈ ఆందోళన కొనసాగింపుగానే ప్రభుత్వం మీద  తీవ్రఒత్తిడి తేవడం కోసమే దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. రుణ మాఫీ పేరుతో చంద్రబాబునాయుడు ఎలా అబద్ధాలు చెప్తూ పోయారో, ఎలా మోసం చేస్తున్నారో రైతులు, డ్వాక్రా మహిళలు వేదికనెక్కి మైకులు తీసుకుని తాము చంద్రబాబు చేతిలో ఏ విధంగా మోసపోయామో చెప్పాలని ఆయ న పిలుపునిచ్చారు. ఎండలో కూడా వేలాది మంది మహిళలు, రైతులు, చిన్నారులు, అవ్వలు, తాతలు తరలివచ్చి సంఘీభావం ప్రకటించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

 

 జన సంద్రమైన తణుకు...

 

 రైతు రుణ మాఫీపై ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలకు కోతలు వేస్తుండటంపై మండిపడుతున్న ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతు దీక్షకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 9 గంటల నుంచే వేలాది మంది దీక్షా స్థలికి తరలివచ్చారు. సుమారు రెండు కిలోమీటర్ల మేరకు ఈ మార్గంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. భారీ సంఖ్యలో రైతులు, మహిళలు స్వచ్ఛందంగా దీక్షకు తరలివచ్చారు. దీక్షా స్థలికి చాలా దూరంలో వాహనాలు నిలిపి వేయాల్సి రావడంతో అక్కడి నుంచి కాలినడకన చేరుకున్నారు. వేదిక ఎదుట కొంత మేరకే వేసిన టెంట్ ఉదయం 10 గంటలకే నిండిపోయింది. దీంతో జనం దీక్షా స్థలికి పక్కగాను, ఎదురుగా రోడ్డు మీద బారులుతీరి నిలబడ్డారు. జగన్ దీక్షా స్థలికి చేరుకునే సరికి ఆ ప్రాంగణమంతా జనంతో కిక్కిరిసిపోయింది. జగన్ అక్కడికి రాగానే జనం ఒక్కసారిగా ఉత్సాహంతో ముందుకు కదలటంతో తోపులాట జరిగింది. దీంతో జగన్ వాహనం రోడ్డు మీద నుంచి వేదిక మీదకు రావడానికి సుమారు అరగంట సమయం పట్టింది. ఆయన వేదిక మీదకు వచ్చి అందరికీ ముకుళిత హస్తాలతో నమస్కారం చేయడంతో దీక్షా వేదిక మొత్తం జోహార్ వైఎస్సార్, జై జగన్ నినాదాలతో మార్మోగింది. ఉదయం 9 గంటల నుంచి దీక్షా స్థలిలో ఎదురు చూసిన జనం.. జగన్ మాట్లాడాలని పట్టుబట్టారు. వేదిక వద్దకు వచ్చి జగన్‌కు సంఘీభావం తెలపడం కోసం జనం పోటీ పడ్డారు. రాత్రి పొద్దు పోయే వరకు జనం జగన్‌ను పలుకరిస్తూ దీక్షకు తమ సంఘీభావం ప్రకటించారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన రైతు, డ్వాక్రా రుణ మాఫీ హామీల మోసం గురించి వేదిక మీద నాయకులు ప్రసంగించిన సమయంలో జనం పెద్ద ఎత్తున చప్పట్లు, కేరింతలతో స్పందించారు.

 

 వేలాది మంది మహిళల రాక

 

 జగన్‌మోహన్‌రెడ్డి దీక్షా వేదిక వద్దకు ఉదయం 9 గంటలకే వేలాది మంది మహిళలు తరలివచ్చారు. జగన్‌ను చూడాలనీ, ఆయన మాటలు వినాలనే ఆకాంక్షతో వారు సాయంత్రం దాకా ఓపిగ్గా కూర్చుని సంఘీభావం ప్రకటించారు. వైఎస్సార్ సీపీ నేతల అంచనాలకు అందనంత భారీ సంఖ్యలో మహిళలు దీక్షకు తరలిరావడం పార్టీ నేతలకు చెప్పలే ని ఆనందం కలిగించింది. రబీ సీజన్ ప్రారంభమైనందువల్ల రైతులు వ్యవసాయ పనుల్లో ఉంటారనే అభిప్రాయం వ్యక్తమయినప్పటికీ రైతులు కూడా వేలాది మంది తరలివచ్చి చంద్రబాబు మోసపు హామీల కారణంగా తమకు కొత్త రుణాలు అందక పోవడం, పాత రుణాలు వడ్డీతో సహా చెల్లించాలని బ్యాంకులు చేస్తున్న డిమాండ్ల వల్ల తాము పడుతున్న ఇక్కట్లను వివరించారు.

 

 వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి దీక్ష ప్రారంభం

 

 మధ్యాహ్నం 12-38 గంటల సమయంలో వేదిక మీదకు చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి.. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్ష ప్రారంభమైంది. మహిళలు వందేమాతరం గీతాలాపన చేశారు.

 

 మరణించిన రైతులకు సంతాపం

 

 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో 86 మంది రైతులు అప్పుల బాధలు తాళలేక, రుణ మాఫీ కాకపోవడం వల్ల ఎదురైన ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారని పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. వీరందరి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించాలని సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. వేదిక మీద, వేదిక కింద ఉన్న వారంతా మౌనం పాటించి సంతాపం ప్రకటించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top