జన ఉప్పెన

జన ఉప్పెన - Sakshi


 రుణ విముక్తే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్  జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో నిర్వహించిన రెండు రోజుల రైతు దీక్ష ఆదివారం దిగ్విజయంగా ముగిసింది. సర్కారు నిర్లక్ష్యంపై తమ పక్షాన  పోరాడుతున్న విపక్ష నేత వైఎస్ జగన్‌కు సంఘీభావం తెలిపేందుకు దీక్ష స్థలికి రైతులతోపాటు అన్నివర్గాల ప్రజలు పోటెత్తారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ.. ఉదయం నుంచి సాయంత్రం దాకా తరలివచ్చిన అభిమాన జనవాహినితో తణుకు పట్టణం కిక్కిరిసిపోయింది.  చంద్రబాబు నయవంచక పాలనను చెండాడుతూ వైఎస్ జగన్ ప్రసంగిస్తున్నంత సేపూ చప్పట్లతో దీక్షా ప్రాంగణం  దద్దరిల్లింది. మాటల ప్రభుత్వంపై మరిన్ని పోరాటాలకు సిద్ధమవ్వాలనే స్ఫూర్తిని పార్టీ శ్రేణుల్లో రగిలించింది.

 

 తణుకు నుంచి సాక్షి ప్రతినిధి :సర్కారు దారుణాలపై రైతన్న తిరగబడ్డాడు. మహిళలు కదం తొక్కారు. యువకులు ఉప్పెనలా ఉరికారు. వెరసి తెలుగుదేశం ప్రభుత్వ నయవంచన విధానాలను నిరసిస్తూ జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో చేపట్టిన దీక్షకు మలిరోజు ఆదివారం జనశక్తి వెల్లువలా కదలివచ్చింది. రైతులు, మహిళలు, యువకులే కాదు అన్నివర్గాల ప్రజలు ఉద్యమమై కదలివచ్చారు. దీక్ష తొలిరోజు శనివారం వేదికపై వైఎస్ జగన్ మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం ప్రభుత్వ వంచనపై సుదీర్ఘంగా మాట్లాడతానని ప్రకటించడంతో మలిరోజు సభకు అశేషంగా జనం కదలివచ్చారు. ఆదివారం ఉదయం 10 గంటలకే  సభా ప్రాంగణం కిక్కిరిసిపోగా, మధ్యాహ్నానికి తణుకు పట్టణం జన సంద్రమైంది. ఉభయగోదావరి జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చిన జనప్రవాహంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. దీంతో  పోలీసులు వాహనాలను మూడు కిలోమీటర్ల దూరంలో నిలిపివేయడంతో జనం నడుచుకుంటూనే దీక్షా శిబిరానికి చేరుకున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు బ్యారికేడ్లు పెట్టినా, ఆంక్షలు విధించినా అవేమీ జన ప్రవాహాన్ని ఆపలేకపోయాయి.

 

 ఉప్పొంగిన అభిమానం

 పోలీసు అధికారులు ఆదివారం దీక్షా శిబిరం వద్ద వేదిక పైకి వెళ్లే మార్గాన్ని ప్రత్యేక బ్యారికేడ్‌లతో మూసివేశారు. దీంతో జగన్‌ను దగ్గరగా చూసేందుకు, దీక్షా వేదిక సమీపానికి వెళ్లేందుకు దూసుకువచ్చిన జనాన్ని నియంత్రించడం పోలీసులకు కష్టసాధ్యమైంది. బ్యారికేడ్‌లను ధ్వంసం చేసి లోపలికి వచ్చేందుకు అభిమానులు తోపులాటకు దిగుతుండగా జగన్ లేచి...  ముకుళిత హస్తాలతో అభివాదం చేశారు. అంతే ఒక్కసారిగా జైజగన్, జైజై జగన్ నినాదాలు దిక్కులు పిక్కటిల్లేలా మార్మోగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ నేతలు ప్రసంగిస్తూ ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగినప్పుడు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. సరిగ్గా సాయంత్రం 3.59 నిమిషాలకు ఉండ్రాజవరం గ్రామానికి చెందిన రైతు చిట్టూరి విశ్వనాథం జననేతకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జననేత ప్రసంగం మొదలు కాగానే  పెద్దపెట్టున జోహార్ వైఎస్సార్.. జై జగన్ నినాదాలతో సభా ప్రాంగణమే కాదు తణుకు పట్టణం దద్దరిల్లిపోయింది. ప్రధానంగా రుణవంచనపై, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు రూ. రెండువేల భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్ హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ జగన్ చేసిన ప్రసంగానికి బాబు డౌన్ డౌన్... జోహార్ వైఎస్సార్ నినాదాలతో జనం విశేషంగా స్పందించారు.

 

 పాదయాత్ర ఎందుకోసమో

 ఇటీవల ఇదే పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర చేశారు.. ఎందుకు చేశారో ఎవరికీ తెలియదు. చుట్టూ పోలీస్ బందోబస్తు.. ఎమ్మెల్యేలు, టీడీపీ కార్యకర్తల సంరక్షణలో ప్రజలకు సంబంధం లేకుండా పాదయాత్ర చేయడంలో అర్థమేమిటని జగన్ ప్రశ్నించారు. రైతు అయ్యా నాకు అప్పు మాఫీ కాలేదు.. అని బాబుకు చెప్పుకుందామంటే వీల్లేదు.. మహిళలు. యువకులదీ అదే పరిస్థితి.. మరి పాదయాత్ర ఎందుకు చేశారో ఆయనకే తెలియాలి అని జగన్ వ్యాఖ్యానించారు.

 

 పశ్చిమ నుంచే పోరాటం

 రైతు దీక్ష వేదిక నుంచే జగన్ మాట్లాడుతూ... ఈ పోరాటం ఇక్కడితో ఆగదు.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువద్దాం..  ప్రభుత్వం మెడలు వంచైనా హామీల అమలుకు నిరంతర పోరాటాలు చేద్దాం అని పిలుపునిచ్చారు.

 

 పార్టీ శ్రేణుల్లో స్థైర్యం


 శని, ఆదివారాల్లో వైఎస్ జగన్ చేపట్టిన రైతు దీక్ష చరిత్రాత్మకంగా నిలిచిపోవడంతో పాటు వైసీపీ శ్రేణుల్లో స్థైర్యాన్ని నింపింది. సర్కారు నిర్వాకాలతో ఇబ్బంది పడుతున్న పార్టీ నేతలు, కార్యకర్తలలో జగన్ దీక్ష జవసత్వాలు నింపింది.  దీక్షకు వచ్చిన ప్రజాస్పందన చూసిన పార్టీ నేతలు, కార్యకర్తలు మనోస్థైర్యంతో జిల్లాలో ఇక పోరాటాలకు శ్రీకారం చుడతామని ప్రకటించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top