ధైర్యం ఉందా బాబూ... ప్రజల దగ్గరకెళ్దాం : వైఎస్ జగన్




ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికలకు రావాలని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మరోసారి సవాలు చేశారు. ''ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ అధికారం ఉంది కదా అని పోలీసులను ఉపయోగించి, అడ్డగోలుగా డబ్బులు గుమ్మరించి పరోక్ష ఎన్నికల్లో నాలుగు ఓట్లతో మూడు సీట్లు గెలిచినంత మాత్రాన గొప్ప విజయంగా చెప్పుకొంటున్న చంద్రబాబుకు మరోసారి సవాలు విసురుతున్నా... దమ్ము, దైర్యం ఉంటే ఎన్నికలకు సిద్ధపడాలి'' అన్నారు.



బుధవారం అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన వారితో ధైర్యం ఉంటే చంద్రబాబు రాజీనామా చేయించి లేదా వారిపై అనర్హత వేటు వేయించి ఎన్నికలకు రావాలని సవాలు విసిరారు. పరోక్ష ఎన్నికల్లో మూడు ఎమ్మెల్సీ సీట్లు గెలిచామని అదేదో గొప్ప విజయంగా చెప్పుకున్న చంద్రబాబు ప్రజలతో ప్రత్యక్ష ఎన్నికల్లో చావుదెబ్బ తింటే ఒక్క మాట మాట్లాడలేదని జగన్ ఎద్దేవా చేశారు. గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఎందుకు ఒక్కమాట కూడా మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రజలతో ప్రత్యక్షంగా జరిగే ఎన్నికల్లో నిలబడే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. అయిదు చోట్ల ఎన్నికలు జరిగితే నాలుగు చోట్ల టీడీపీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని, చదువుకున్న వాళ్లు, ఉపాధ్యాయులు తమకు ఓటు వేశారని చెబుతూ ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని ప్రస్ఫుటం చేసే తీర్పు అని వ్యాఖ్యానించారు. ఇది ప్రజల తీర్పు అని చంద్రబాబు ఘనంగా చెప్పుకున్న విజయం 2500 ఓట్లలోపే, సీఎం హోదాలో ఉండి పోలీసులను ఉపయోగించి, డబ్బు గుమ్మరించి కొనుక్కొని గెలిచారని ధ్వజమెత్తారు.



''అదేదో విజయంగా అసెంబ్లీలో మాట్లాడుతున్న చంద్రబాబుకు మరోసారి సవాలు చేస్తున్నాం. పార్టీ ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలతో  రాజీనామా చేయించండి. లేదా వాళ్లపై అనర్హత వేటు వేయించండి. దమ్మూ ధైర్యం ఉంటే ఎన్నికలకు రావాలి. ప్రజల దగ్గరకు పోదాం. అభ్యర్థులను పెడదాం. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇంగితం ఉంటే ఉప ఎన్నికలకు రావాలి.. ఈ ఎన్నికలను మేం రెఫరెండంగా తీసుకుంటాం..'' అని జగన్ తన సవాలును పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఒక విలేకరి జోక్యం చేసుకుంటూ, చంద్రబాబు 67 స్థానాల్లో (వైఎస్సార్ కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో మాత్రమే) ఎన్నికలు నిర్వహిద్దామని అంటున్నారని ప్రస్తావించారు. దానిపై జగన్ స్పందిస్తూ,  కేవలం 67 స్థానాల్లోనే ఎందుకు... ధైర్యం ఉంటే రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాల్లో ఎన్నికలకు వెళ్లమనండి.. మేం సిద్ధంగా ఉన్నాం అని సమాధానమిచ్చారు. కమాన్ రమ్మనండి... మేం సిద్ధంగా ఉన్నాం... అంటూ తన సవాలును మరోసారి పునరుద్ఘాటించారు.



జాతిని జాగృత పరుస్తాం

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవడమే అత్యంత కీలకమైన అంశమని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ, జూన్ వరకు ఎదురుచూస్తాం. మేం చేసే పోరాటాన్ని దేశం మొత్తం చూడాలి. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నది మా ఉద్దేశం. దేశాన్ని జాగృత పరుస్తా... అని చెప్పారు.



అసెంబ్లీలో ఇలాగేనా ప్రవర్తించేది?

బుధవారం శాసనసభలో జరిగిన విషయాలను జగన్ ప్రస్తావిస్తూ తనను మాట్లడనీయకూడదన్న ఉద్దేశంతోనే అసెంబ్లీని వాయిదా వేశారని మండిపడ్డారు. ప్రతిపక్షాలకు ఇవ్వకుండానే ఏదో పేపర్లు తెచ్చి ప్రతిజ్ఞ అంటూ ఒక ప్రకటన చేయడాన్ని ఆయన పేర్కొంటూ రాష్ట్రం పట్ల చంద్రబాబువి నిజాయితీ, అంకిత భావం లేని మాటలు. నా ఇల్లు... నా ఓటు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. చంద్రబాబులా హైదరాబాద్ లో లేదు. అసెంబ్లీలో ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబుకు నిజాయితీ, అంకితభావం లేవు. వరల్డ్ వాటర్ డే పురస్కరించుకుని చంద్రబాబు చేసిన ప్రకటనపై ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాట్లాడుతుంటే అరగంట పాటు అంతా విన్నాం. ఏదో ప్రకటన చేసి వెళ్లిపోతామంటే ఎలా? సీఎం అంటే సానుకూలంగా ఉండాలే తప్ప రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. ఆయన ఉద్దేశపూర్వకంగానే 2004-09 విషయాలను కావాలనే ప్రస్తావించారు. సీఎం ప్రసంగం మొత్తం అలాగే ఉంది. ఆత్మస్తుతి, పరనింద తప్ప అందులో ఏమీ లేదు.



"ప్రకటన చేసిన తర్వాత ఇక ఎవరికీ అవకాశం ఇవ్వరు. ఇంత దారుణంగా సీఎం మాట్లాడుతున్నప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తాలనుకున్నా అవకాశం ఇవ్వడం లేదు. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలని అడిగినప్పుడు మైకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కనీసం రెండు నిమిషాలు కూడా సమయం ఇవ్వడం లేదు.కనీసం పాయింట్ ఆఫ్ ఆర్డర్ విషయాన్ని వినడానికి కూడా సిద్ధంగా లేరు. సీఎం ప్రకటన చేసినప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేదంటూ తప్పుగా చెబుతున్నారు. (ఈ సమయంలో అసెంబ్లీ రూల్స్ పుస్తకాన్ని చూపించి, ఈ విషయం చెప్పారు) ప్రతిపక్ష నాయకుడన్న గౌరవం కూడా చూపడం లేదు. అందుకే బాబు ప్రసంగం అయ్యాక మేమంతా సభలోకి వెళ్లాం. అప్పుడు కూడా మా వాదన వినలేదు. అవకాశం ఇవ్వకపోగా రాజకీయం చేశారు. మళ్లీ ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ చేయని వారు నీటి సంరక్షణ చేయరా?" అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 



నీటి సంరక్షణ విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉండి ఉంటే... ఇప్పటికే 80 శాతం పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తయ్యేవని చెప్పారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి రాకముందే రాష్ట్రంలోని చాలా ప్రాజెక్టుల 80 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. హంద్రీనీవా, పోలవరం కెనాల్స్.. ఇలా ఏం తీసుకున్నా 80 శాతం పనులు ముందే పూర్తయ్యాయి. అలాంటి వాటిని కూడా చంద్రబాబు ఇప్పటికీ పూర్తి చేయలేయలేదు. అలాంటి మనిషి ఎమ్మెల్యేలతో ప్రతిజ్ఞ చేయించడం నిబద్దత అనిపించదని మండిపడ్డారు.



"పోతిరెడ్డిపాడు కనీసం 20 శాతం పనులు కూడా చెయ్యలేదు. గండికోట, చిత్రావతి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అయ్యాయి. బాబు వచ్చి మూడేళ్లవుతున్నా మిగిలిపోయిన చిన్న పనులు కూడా కాలేదు. శ్రీశైలం లో నీళ్లు ఉన్నా సీమకు నీళ్లివ్వలేని పరిస్థితి. ఇలాంటి సీఎంకు నిజాయితీ ఎక్కడిది. పిల్ల కాలువ పనులు పూర్తి చేసినా అనంతపురం జిల్లాకు నీళ్లు ఇవ్వొచ్చు. పులిచింతల ప్రాజెక్టు చంద్రబాబు సీఎం అయ్యేనాటికే పూర్తయ్యింది. కానీ ఇప్పటికీ అక్కడ ఆర్ అండ్ ఆర్ అమలు చేయలేదు. పట్టిసీమ స్టోరేజీ కెపాటిసీ ఆలోచించమని చెప్పాం. కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోతున్నాయి." అని పరిస్థితి ఇలా ఉంటే చంద్రబాబు అసెంబ్లీలో ఇలాగేనా ప్రవర్తించేదని ప్రశ్నించారు. ప్రతిజ్ఞ చేయించాలనుకుంటే దానికో పద్ధతి ఉంటుంది. మంచి మాటలు తప్పులేదు. అసెంబ్లీలో ఇలాంటివి తగునా? అధికారపక్షం నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. నాకు అసెంబ్లీలో టైమ్ ఇచ్చి ఉంటే ఇదే చెప్పేవాళ్లం... అని జగన్ అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top