11 నెలల్లో రూ.100 కోట్ల పనులేనా!


పోలవరం :‘టీడీపీ అధికారంలోకి వచ్చి 11 నెలలైంది. అన్ని నెలల చంద్రబాబు పాలనలో జరిగింది రూ.100 కోట్ల పనులేనా. ఇలా అయితే ప్రాజెక్ట్ ఎన్నేళ్లకు పూర్తవుతుంది’ అని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. బుధవారం నిర్వహించిన బస్సు యాత్రలో భాగంగా ఆయనపోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్‌కు చేరుకుని ప్రాజెక్టు మ్యాప్‌ను పరిశీలించారు. అనంతరం మీడియాతో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. ఏడాదికి రూ.4 వేల కోట్ల విలువైన పనులు జరగాల్సి ఉండగా, కేవలం రూ.100 కోట్ల మేర మాత్రమే పనులు జరగడం ఏమిటన్నారు. రూ.180 కోట్లను మొబలైజేషన్ అడ్వాన్స్ తీసుకుని రూ.100 కోట్లు ఖర్చు చేశారన్నారు. చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తానని ప్రకటించారని గుర్తు చేశారు.  

 

నష్టపరిహారం పెంచండి

పోలవరం ప్రాజెక్ట్ పనులు ఎందుకు జరగడం లేదని ఇంజినీరింగ్ అధికారులను వైఎస్ జగన్ ప్రశ్నించగా, సమస్యలున్నాయని చెప్పారు. ఆ సమస్యలేమిటని అడిగితే 1,200 ఎకరాల భూసేకరణ సమస్య ఉందన్నారు. రైతులకిచ్చే నష్టపరిహారం పెంచడం ద్వారా వారిని సంతోషపరిస్తే ఆ సమస్యను పరిష్కరించవచ్చని జగన్ సూచించారు. ప్రాజెక్టును పూర్తిచేసేం దుకు రూ.16 వేల కోట్లు అవసరం కాగా, వైఎస్సార్ హయాంలో రూ.4 వేల కోట్లు ఖర్చుచేశారన్నారు.

మూడు సంవత్సరాల్లో పూర్తిచేయాలంటే ఏడాదికి రూ.4వేల కోట్లు ఖర్చుచేయాల్సి ఉందన్నారు. రూ.4వేల కోట్లపై రూ.400 కోట్లు వడ్డీ వస్తుందని, ఆ సొమ్ముతో నిర్వాసితులకు నష్టపరిహారం పెంచవచ్చని స్పష్టం చేశారు. ఆర్ అండ్ ఆర్ ఎందుకు అమలు చేయలేకపోతున్నారని అధికారులను ప్రశ్నించారు.



పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల 194 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చని చెప్పారు. ఈ ఏడాది డెల్టా ప్రాంతానికి 10 వేల క్యూసెక్కుల నీరు అవసరం కాగా, కేవలం 7.4 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే సరఫరా చేశారని, దీనివల్ల రెండో పంట పండే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోల వరం పనులు జరుగుతున్నాయని ఇంజినీరింగ్ అధికారులు చెప్పగా.. ‘ఏవి.. ఏం పనులు కనబడటం లేదు. సున్నా పనులే కనపడుతున్నాయి’ అని జగన్ అన్నారు.



వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కుడి కాలువ నిర్మాణానికి సంబంధించి 70శాతం పనులు పూర్తికాగా, 11 నెలల చంద్రబాబు పాలనలో మిగి లిన 30 శాతం పనుల్లో ఒక్క అంగుళం కూడా జరగలేదన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం కోసం రైతులకు ఎకరానికి రూ.19.50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చి రెండు రోజుల్లో భూసేకరణ చేశారన్నారు.



పోలవరం నిర్వాసితులకు ఎకరానికి రూ.1.50 లక్షలు, రూ.1.80 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారన్నారు. పోలవరం నిర్వాసితులను పిలిచి ఎంత కావాలి, సమస్య ఏమిటని తెలుసుకుని పట్టిసీమ పథకం లాగే నష్టపరిహారం ఇచ్చి ఉంటే సమస్య పరిష్కారం అయ్యేదన్నారు. ఇందుకోసం కేవలం రూ.300 కోట్లు మాత్రమే ఖర్చు అవుతాయన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top