జగన్ దిగ్భ్రాంతి

జగన్ దిగ్భ్రాంతి - Sakshi


శోభా నాగిరెడ్డి మృతితో వైఎస్సార్‌సీపీలో తీవ్ర విషాదం

జగన్, విజయమ్మ, షర్మిల ప్రచారం రెండ్రోజులు వాయిదా

పార్టీ కార్యాలయంలో నివాళులు, జెండా అవనతం

 

 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉప నాయకురాలు, ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి భూమా శోభా నాగిరెడ్డి మరణవార్తతో పార్టీలో విషాదం అలముకుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, జగన్ సోదరి షర్మిల, సతీమణి భారతి ప్రచార కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. శోభ మృతికి సంతాప సూచకంగా గురు, శుక్రవారాలు  జగన్, విజయమ్మ, షర్మిల పర్యటనలతో పాటు అన్ని ప్రచార కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్టు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఆళ్లగడ్డలో శోభ అంత్యక్రియలకు పార్టీ పెద్దలంతా హాజరవుతారని చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శోభా నాగిరెడ్డి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ జెండాను అవనతం చేశారు. పార్టీ నేతలు పీఎన్వీ ప్రసాద్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 

 నేడు ఆళ్లగడ్డకు జగన్

 

 పార్టీలో అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండే తమ ఆత్మీయురాలు మరణించారని తెలిసి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, సోదరి షర్మిల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గుంటూరు జిల్లాలో రెండ్రోజులపాటు విస్తృతంగా పర్యటించి బుధవారం రాత్రికి పొన్నూరుకు చేరుకున్న జగన్‌కు శోభా నాగిరెడ్డి ప్రమాదవార్త తెలియడంతో హతాశులయ్యారు. ఆమెను కేర్ ఆస్పత్రికి తరలించారని తెలియడంలో ఆయన ఆస్పత్రి వర్గాలతో ఎప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడుతూ శోభా నాగిరెడ్డి పరిస్థితి తెలుసుకుంటూ వచ్చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందనడంతో గురువారం ఉదయం పొన్నూరులో క్లుప్తంగా ప్రసంగించి  హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే శోభ  ఉదయం 11 గంటలకే మృతి చెందడంతో భౌతిక కాయాన్ని స్వస్థలం ఆళ్లగడ్డ తీసుకువెళ్లారు. గురువారం సాయంత్రానికి హైదరాబాద్ చేరుకున్న జగన్ శుక్రవారం ఆళ్లగడ్డకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో హెలికాప్టర్‌లో ఆళ్లగడ్డకు వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి. అంత్యక్రియలకు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, షర్మిల, వైఎస్ భారతితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.

 

 హుటాహుటిన వచ్చిన విజయమ్మ

 

 శోభా నాగిరెడ్డి ప్రమాదానికి గురయ్యారన్న సమాచారం తెలియడంతో విజయమ్మ రాజమండ్రి నుంచి హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఆమె కేర్ ఆస్పత్రికి చేరుకునే సమయానికే శోభ కన్ను మూయడంతో కన్నీరు మున్నీరయ్యారు. తన కూతురులాంటి శోభ మరణం భరించలేనిదని విలపించారు. తూర్పు గోదావరి జిల్లాలో మూడు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించిన విజయమ్మ బుధవారం రాత్రి రాజమండ్రిలో బస చేశారు. గురువారం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆమె ‘వైఎస్సార్ జనభేరి’ చేపట్టాల్సి ఉంది. ఈ కార్యక్రమం వాయిదా వేశారు.

 

 పులివెందుల నుంచి షర్మిల, భారతి

 

 నంద్యాలలో శోభానాగిరెడ్డితో కలసి వైఎస్సార్ జనభేరి నిర్వహించిన షర్మిల బుధవారం రాత్రి పులివెందుల చేరుకున్నారు. ఆమె గురువారం అనంతపురం జిల్లా కదిరిలో పర్యటించాల్సి ఉంది. అలాగే పులివెందులలో జగన్ తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆయన సతీమణి వైఎస్ భారతి వేంపల్లె మండలంలో పర్యటించాల్సి ఉంది. శోభానాగిరెడ్డి ప్రమాదవార్త తెలియడంతో వారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని ఒకే వాహనంలో హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు.


శోభా నాగిరెడ్డి,

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top