సంతాపంలోనూ పక్షపాతమా?


* సీఎం తర్వాత ప్రతిపక్ష నేతకు అవకాశమివ్వని స్పీకర్

* అభ్యంతరం తెలిపిన వైఎస్సార్‌సీపీ

* మాట్లాడకపోతే నేనేం చేసేదన్న స్పీకర్

* సంప్రదాయాన్ని ఎలా విస్మరిస్తారని ప్రశ్నించిన జగన్‌మోహన్‌రెడ్డి

* స్పీకర్‌పై విపరీత ఆరోపణలు చేయొద్దన్న కోడెల శివప్రసాదరావు



సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభలో విపక్షం గొంతు వినపడకుండా చేయాలనుకున్న అధికారపక్ష ‘అనధికార నిర్ణయానికి’ అనుగుణంగానే  గురువారం సభ నడిచింది. సంతాప తీర్మానంపై మాట్లాడే అంశంలోనూ ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్న అంశంపై కొద్దిసేపు చర్చసాగింది. సభ ప్రారంభమైన వెంటనే తిరుపతి ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ మృతికి సంతాపం తెలుపుతూ శాసనసభాపక్ష నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ప్రసంగించారు.



అనంతరం సభా సంప్రదాయాల ప్రకారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడాల్సి ఉండగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలుగుదేశం సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావుకు, ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పల్లె రఘునాథరెడ్డి, చింతల రామచంద్రారెడ్డికి అవకాశం ఇచ్చారు. చింతల తన ప్రసంగంలో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డికి ఇంతవరకు ఎందుకు మైకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇదే సమయంలో జ్యోతుల నెహ్రూ మరికొందరు వైఎస్సార్‌సీపీ సభ్యులు కూడా లేచి స్పీకర్‌ను ప్రశ్నించారు. ఈ దశలో స్పీకర్‌కు, విపక్ష సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది.



జగన్: అధ్యక్షా... మొట్టమొదటి నుంచి ప్రతిపక్షాన్ని కించపరిచేలా కావాలనే ఇలా చేస్తున్నారు. మీ తీరు బాధాకరం. (ఈ దశలో స్పీకర్ అభ్యంతరం చెబుతూ.. సారీ, మీరు సమస్యను సృష్టిస్తున్నారు, ఇది సరికాదు అంటుండగా... జగన్ తన మాటలను కొనసాగించారు) ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నేత మాట్లాడడం సంప్రదాయం. ఇంతకుముందు ఒకటి రెండుసార్లు మీరూ నన్ను అడిగారు. నేను మాట్లాడతానని సమాచారమిచ్చాను. నోరు తెరిచి అడిగిన తర్వాత కూడా అవకాశం ఇవ్వలేదు. ప్రతిపక్ష నేత మాట్లాడకూడదన్న ఒకే ఒక ఉద్దేశంతోనే అవకాశం ఇవ్వలేదు. గతంలో అడిగిన మీరు ఈ రోజెందుకు అడగలేదు. వాళ్లు ఈవేళ అధికారంలో ఉన్నారని, వాళ్లను అనుసరించడం తగదు. ఇదే ఎల్లకాలం జరగదు. ఈవేళ వాళ్లు అధికారంలో ఉండొచ్చు. రేపు మేము రావొచ్చు. స్పీకర్ కచ్చితంగా సంప్రదాయాలను పాటించాలి.



స్పీకర్: సభాధ్యక్ష పదవిని ఆపాదించే విధంగా (వైల్డ్) ఆరోపణలు తగదు. ముఖ్యమంత్రి తర్వాత మాట్లాడతారేమోనని మీవైపు నాలుగైదుసార్లు చూశా. మీరు మాట్లాడలేదు. మీరు మాట్లాడతానంటే అవకాశం ఇచ్చేవాడిని. మీకు ప్రాధాన్యత ఉంటుంది. మీతో బలవంతంగా మాట్లాడించలేను కదా! ప్రతిపక్ష నాయకునికి మైకు ఇవ్వలేదెందుకని చెవిరెడ్డి ఎందుకు చెప్పలేదు? ప్రతి విషయాన్ని వివాదం చేయొద్దు. దయచేసి కూర్చోండి. ఇప్పుడు చెబుతున్నారు కదా, జగన్ గారూ మాట్లాడండి... అంటూ అప్పుడు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత పెషావర్‌లో స్కూలు విద్యార్థుల కాల్చివేతను ఖండిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంపై ముఖ్యమంత్రి తర్వాత జగన్‌మోహన్‌రెడ్డిని పేరు పెట్టి పిలిచి మాట్లాడమని స్పీకర్ కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top