భూ బాధితులకు మహా భరోసా

భూ బాధితులకు మహా భరోసా - Sakshi


‘సేవ్‌ విశాఖ’ మహాధర్నాకు పోటెత్తిన జనం

అడుగడుగునా పోలీసుల ఆంక్షలు

మండుటెండను సైతం లెక్కచేయని జనం


సాక్షి, విశాఖపట్నం: అధికార తెలుగుదేశం పార్టీ నేతల భూ కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ ‘సేవ్‌ విశాఖ’ పేరిట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గురువారం విశాఖపట్నంలో నిర్వహించిన మహాధర్నాకు జనం పోటెత్తారు. ధర్నాపై పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించినప్పటికీ అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా భూ బాధితులు జిల్లావ్యాప్తంగా భారీగా తరలివచ్చారు. ధర్నా వేదికపై ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగానికి ముందే భూ బాధితులతో మాట్లాడారు. వారి కష్టాలు, సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎన్ని ఇబ్బందులెదురైనా కుంగిపోకుండా ధైర్యంగా పోరాడుతామని భరోసా కల్పించారు. రానున్నది ప్రజల ప్రభుత్వమని, కబ్జా రాక్షసులను కటకటాల వెనక్కి పంపి, మీ భూములు కాపాడతామంటూ జగన్‌ ఇచ్చిన హామీ బాధితుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది.



అడుగడుగునా ఆంక్షలు, అడ్డంకులు

ప్రతిపక్షం తలపెట్టిన ‘సేవ్‌ విశాఖ’ మహాధర్నాను విఫలం చేయాలని ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం సమీపంలోని లాల్‌బహదూర్‌శాస్త్రి విగ్రహం వద్ద ధర్నా వేదిక వద్దకు ప్రజలు చేరుకోకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఆర్టీసీ కాంప్లెక్‌ చుట్టుపక్కల నుంచి ధర్నా వేదిక వద్దకు వచ్చే అన్ని దారులను పోలీసు బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ జనాన్ని చెదరగొట్టారు. ఖాకీ వలయాన్ని జనం ఖాతరు చేయలేదు. అప్పటి వరకూ చెట్లు, బస్టాప్‌ల కింద తలదాచుకున్న వారు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాగానే ఒక్కసారిగా ధర్నా వేదిక వద్దకు పరుగులు పెట్టారు. జన ప్రవాహంతో నలుదిశలా రహదారులు కిక్కిరిసిపోయాయి. ప్రజలు మండుటెండలో రెండు గంటలపాటు నిలబడి ఉండిపోయారు. జగన్‌ ప్రసంగిస్తున్నంత సేపూ అంతటి వేడిలోనూ కేరింతలు కొట్టారు. ఆయన చెప్పే ప్రతి మాటకు వారిలో ఉత్సాహం రెట్టింపయ్యింది. ధర్నా ముగించి చివరి అభివాదం చేసి ప్రతిపక్ష నేత వెనుతిరిగేవరకూ ప్రజలు నిలుచున్న చోటు నుంచి కదల్లేదు.



ఉరకలెత్తించిన జననేత ప్రసంగం

భూ కబ్జాల బాగోతాన్ని బట్టబయలు చేస్తూ... ‘సిట్‌’ పేరుతో కపట నాటకమాడుతున్న ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ సాగిన జననేత జగన్‌ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. పేదల కడుపులు కొడుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులకు అండగా నిలుస్తున్న చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌ తీరుని జగన్‌ సాక్ష్యాలతో సహా ప్రజలకు వివరించారు. నాతో కలిసి రండి.. సర్కారుపై సమరశంఖం పూరిద్దాం అంటూ ఆయన ఇచ్చిన పిలుపుతో బాధితుల్లో కొత్త ఉత్తేజం నెలకొంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top