ఈ ఊళ్లోనే ఎందుకిలా?

ఈ ఊళ్లోనే ఎందుకిలా? - Sakshi


రాచపల్లెలో రెండు నెలలుగా జనమంతా మంచం పడితే ఏం చేస్తున్నారు..

బాధితులకు ఏదైనా జరిగితే.. బాధ్యత ఎవరిది?

తిరుపతి నుంచి నిపుణులైన డాక్టర్లను పిలిపించేందుకు కృషి చేస్తాం

తాగునీటిని శుభ్రం చేసి అందించండి

అధికారుల తీరుపై మండిపడిన ప్రతిపక్ష నేత జగన్

వారు కోలుకునే వరకు పార్టీ తరఫున పౌష్టికాహారం అందిస్తామని వెల్లడి

లక్షుమయ్య, రఘురాం, దానమయ్య కుటుంబాలకు పరామర్శ

నల్లపురెడ్డిపల్లెలో నూతన జంటకు ఆశీర్వాదం

మబ్బుచింతలపల్లెలో మహిళలతో మాటామంతి


 

 సాక్షి కడప/పులివెందుల : ‘రాచపల్లెలో ఇన్ని రోజుల నుంచి జనం జ్వరాలతో అల్లాడుతుంటే ఏం చేస్తున్నారు.. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. గ్రామంలో 208 మంది ఉంటే.. అందులో 129 మందికి జ్వరాలొచ్చాయి.. ఇంతమందికి  ఈ ఒక్క ఊరిలోనే ఎందుకిలా.. పొద్దున కూలీకి వెళితే తప్ప వీరికి పూట గడవదు.. పని ముగించుకొని ఇంటికి రాగానే జ్వరంతో మంచాన పడుతున్నారు. ఇన్ని రోజులైనా కారణం కనుక్కోలేకపోవడం చాలా దుర్మార్గం.



పౌష్టికాహారం తీసుకుంటే సమస్య ఇంతగా ఉండదు అంటున్నారు.. ప్రభుత్వం నుంచి ఇప్పించండంటే అవకాశం లేదని చెబుతున్నారు. మరి జ్వర పీడితుల పరిస్థితి ఏమిటి.. ప్రభుత్వానికి కనికరం లేదు.. వారు కోలుకునే వరకు అవసరమైన పౌష్టికాహారాన్ని  మానవత్వంతో పార్టీ తరఫున మేమే అందిస్తాం.. జ్వర బాధితులను చూస్తుంటేనే బాధేస్తోంది. ఈ బాధితురాలిని చూడండి.. పేరు పద్మావతి. ఇప్పుడు జ్వరంతో బాధపడుతోంది.. నెలన్నర్ర క్రితం ఈమె కొడుకు జ్వరంతోనే చనిపోయాడు. పరిస్థితి ఇలాగుంటే ఎందుకు అలక్షం చేస్తున్నారు.. బాధితులకు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిద’ంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులపై మండిపడ్డారు. శనివారం సాయంత్రం ఆయన చక్రాయపేట మండలం కె.రాచపల్లె జ్వర పీడితులను పరామర్శించారు. రెండు నెలలుగా జ్వరాలతో గ్రామం మంచానపట్టి.. అలమటిస్తున్నా పట్టించుకోని వైనంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులంతా జ్వరాలతో అల్లాడిపోతుంటే ఎంపీ అవినాష్‌రెడ్డి చొరవ తీసుకొని వైద్య శిబిరం ఏర్పాటు చేయించారని బాధితులు వైఎస్ జగన్‌కు వివరించారు.  



 జ్వరాలు ఎందుకిలా వస్తున్నాయి..

 గ్రామాన్ని జ్వరాలు వణికిస్తున్నాయి. జ్వరం రావడం.. తగ్గడం.. మళ్లీ రావడం ఇదే పక్రియ రెండు నెలలుగా కొనసాగుతోంది. ఒక్క ఊరిలోనే వరుసగా వదిలి పెట్టకుండా జ్వరాలు రావడానికి కారణమేంటని అక్కడే ఉన్న డిప్యూటీ డీఎంహెచ్‌వో సుబ్బరాయుడును వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఇవి వైరల్ ఫీవర్స్ అని.. లార్వా ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎండకు పనికి వెళుతుండటంవల్ల వడదెబ్బ సోకి జ్వరాలపాలవుతున్నారని ఆయన వైఎస్ జగన్‌కు వివరించారు.



ప్రస్తుతం గ్రామంలో ఫాగింగ్ చేస్తున్నామని, పైపు లైన్ల లీకేజీల వల్ల నీరు కలుషితం కావడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. పైప్‌లైన్ మరమ్మతులు వెంటనే చేయించాలని, శుభ్రం చేసిన నీటిని అందించాలని జగన్ ఆదేశించారు. తిరుపతి నుంచి ప్రత్యేక వైద్యులను ఇక్కడికి రప్పించి వైద్యం చేయించేందుకు కృషి చేస్తానన్నారు. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. జనం కోలుకునే వరకు పార్టీ తరఫున పౌష్టికాహారం సరఫరా చేస్తామన్నారు.  



 వృద్ధులు, మహిళలతో మాటామంతి

 తుమ్మలపల్లె నుంచి పులివెందులకు వస్తున్న వైఎస్ జగన్‌ను మబ్బుచింతలపల్లె బస్టాఫ్ వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు చుట్టుముట్టి  పలకరించారు. ఒక్కొక్కరితో ఆప్యాయంగా మాట్లాడారు. కొంత మంది వృద్ధులు పింఛన్ రాలేదని.. మరికొంత మంది మహిళలు డ్వాక్రా రుణం పేరుతో బాబు మోసం చేశారని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మబ్బుచింతలపల్లెలోని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు నాగమల్లారెడ్డి, శివశంకర్‌రెడ్డిల ఇళ్లకు వెళ్లి కాసేపు మాట్లాడారు. జగన్ వెంట వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, చక్రాయపేట జడ్పీటీసీ సభ్యుడు బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.

 

 బిజీబిజీగా జగన్..

 శనివారం ఉదయం వైఎస్ రాజారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులర్పించడం మొదలు రాత్రి వరకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బిజీబిజీగా గడిపారు. పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెకు చెందిన చండ్రాయుడు, గంగాదేవి దంపతుల కుమారుడు రామాంజనేయులు, కవితల వివాహానికి హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. వేముల మండలం ఎం.తుమ్మలపల్లె గ్రామంలో ఇటీవల తోట వద్ద కరెంటు షాక్‌తో వృుతి చెందిన రైతు రఘురాం కుటుంబాన్ని పరామర్శించారు.



జగన్‌ను చూడగానే రఘురాం సతీమణి భారతి, కొడుకు వెంకట హర్షలు బోరున విలపించారు. వారిని వైఎస్ జగన్ ఓదార్చారు. రెండు రోజుల క్రితం 16వ వార్డు కౌన్సిలర్ వెంకటరమణ తండ్రి లక్షుమయ్య వృుతి చెందారని తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుమారులు వెంకటరమణ, సుబ్రమణ్యంలను ఓదార్చారు. ఇటీవల వృుతి చెందిన క్రిష్టియన్‌లైన్‌లోని దానమయ్య ఇంటికి వెళ్లి ఆయన కుమారుడు ప్రభుదాస్‌ను ఓదార్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top