డెప్యూటీ సీఎం పీఏనంటూ హల్‌చల్ !

డెప్యూటీ సీఎం పీఏనంటూ హల్‌చల్ !


విజయవాడ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి వ్యక్తిగత సహాయకుడినని.. తనకు అవసరమైన భూముల వివరాలను ఇవ్వాలంటూ తహసీల్దార్‌తో గొడవ పడి, విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిని గన్నవరం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం... గవర ప్రసాద్ అనే వ్యక్తి గురువారం ఉదయం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. నేరుగా తహసీల్దార్ ఎం.మాధురి వద్దకు వెళ్లి.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వద్ద పీఏగా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. వెదురుపావులూరిలోని ఆర్‌ఎస్ నెంబరు 88, 895లోని భూముల వివరాలు కావాలని కోరారు. ఆ భూములు ఆతనికి సంబంధించినవి కాకపోవడంతో సమాచారం ఇచ్చేందుకు ఆమె నిరాకరించారు.

 

 దీనిపై ప్రసాద్ గట్టిగా డిమాండ్ చేయడంతో ఆమెకు అనుమానం వచ్చి ఐడెంటిటీ కార్డు చూపమని కోరారు. ఆతడు ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. వారి ఆదేశాల మేరకు డెప్యూటీ సీఎం వద్ద పనిచేసే వోఎస్‌డీని తహసీల్దార్ ఫోన్‌లో సంప్రదించారు. అయితే ప్రసాద్ అనే వ్యక్తి ఎవరో తమకు తెలియదని చెప్పారు. పీఏనంటూ తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆతడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో ఆతనిని గట్టిగా నిలదీయగా, కొద్దిసేపు ఎంపీ నిమ్మల కిష్టప్పకు పీఏ నంటూ, తర్వాత ఓ పెద్ద మనిషి వద్ద పనిచేస్తున్నట్లు చెప్పాడు. ఆ వివరాలు చెప్పకూడదంటూ పొంతన లేని సమాధానాలిచ్చాడు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసు అధికారులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు.  కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్  విధించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top