మీ రూట్‌మ్యాప్‌ చెల్లదు


జగన్‌ ‘రాజధాని’ పర్యటనపై ఆంక్షలు



సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణ వల్ల నష్టపోతున్న రైతులకుఅండగా నిలిచేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఇక్కడ పర్యటించనున్నారు. ఆయన పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు అధికారుల ద్వారా ఆంక్షలు విధిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ రూపొందించిన పర్యటన రూట్‌ మ్యాప్‌నకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. తాము ఇచ్చిన రూట్‌ మ్యాప్‌ ప్రకారమే పర్యటించాలని పోలీసులు ఆదేశించినట్లు వైఎస్సార్‌సీపీ నాయకులు చెప్పారు. జగన్‌ రాజధాని గ్రామాల్లో పర్యటించేందుకు వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, మంగళరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) తదితరులు రెండు రూట్‌ మ్యాప్‌లు రూపొందించారు.



పోలీసులు మాత్రం ఈ రెండు రూట్‌ మ్యాప్‌లకు అనుమతి లేదంటూ నిరాకరించారు. తామిచ్చే  మ్యాప్‌ ప్రకారమే పర్యటన ఉండాలని ఆంక్షలు విధించారు. పోలీసుల రూట్‌ మ్యాప్‌ ప్రకారం.. జగన్‌ కనకదుర్గ వారధి వద్ద ఎక్స్‌ప్రెస్‌ హైవే బాధితులతో మాట్లాడుతారు. అక్కడి నుంచి హైవే మీదుగా ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి వరకు వెళ్లి మంగళగిరికి చేరుకుంటారు. అక్కడి నుంచి నిడమర్రులో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తరువాత కురగల్లు, ఐనవోలు, సచివాలయం మీదుగా మందడం, అక్కడి నుంచి మల్కాపురం, వెలగపూడి మీదుగా లింగాయపాలెం వరకు పర్యటిస్తారు.



జగన్‌ కాన్వాయ్‌ ముందు టీడీపీ వ్యక్తులు?

జగన్‌ పర్యటనపై పోలీసులు ఇప్పటికే ఆంక్షలు విధించగా.. అధికార పార్టీ నేతలు మాత్రం ఆయనను రాజధాని ప్రాంతంలో అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్‌ వాహనాల కాన్వాయ్‌ ముందు కొందరు తమ అనుచరులను ఉంచి అడ్డుకునేందుకు వ్యూహం రచించినట్లు సమాచారం. కనకదుర్గ వారధి దాటి లోనికి రాకుండా చేయాలని ప్రత్యేకంగా కొందరిని  ఏర్పాటు చేసినట్లు తెలిసింది.



రైతులంతా తుళ్లూరుకు రావాలి

రాజధానిలో సామాజిక ప్రభావ అంచనా సర్వేను ఇన్నాళ్లూ పట్టించుకోని అధికారులు జగన్‌ పర్యటన నేపథ్యంలో ఆగమేఘాలపై ముందుకు కదులుతున్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల ప్రజలు సామాజిక ప్రభావ అంచనా సర్వేపై అభిప్రాయాలు తెలిపవచ్చని, సమస్యలు ఏమైనా ఉంటే గురువారం తుళ్లూరు సీఆర్‌డీఏ కార్యాలయానికి వచ్చి చెప్పుకోవచ్చని కమిషనర్‌ చెరుకూరు శ్రీధర్‌ పేరుతో బుధవారం ప్రకటన విడుదల చేశారు. అలాగే ప్రజలకు సెల్‌ఫోన్లలో మెసేజ్‌లు కూడా పంపిచారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మందడం గ్రామ రైతులకు ప్లాట్ల కేటాయింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బుధవారం రాత్రి సెల్‌ఫోన్లకు సందేశాలు పంపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top